నా భర్తను స్వదేశానికి రప్పించండంటూ.. ప్రభుత్వాన్ని అభ్యర్థించిన హైదరాబాద్ మహిళ

ABN , First Publish Date - 2021-03-08T02:37:21+05:30 IST

యజమాని చేతిలో మోసపోయిన తన భర్త సౌదీ అరేబియాలో చిక్కుకున్నారని హైదరాబాద్‌కు చెందిన నఫీస్ బేగం ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను క్షేమంగా ఇండియాకు రప్పించేందుకు తగిన చర్యలు తీసుకో

నా భర్తను స్వదేశానికి రప్పించండంటూ.. ప్రభుత్వాన్ని అభ్యర్థించిన హైదరాబాద్ మహిళ

హైదరాబాద్: యజమాని చేతిలో మోసపోయిన తన భర్త సౌదీ అరేబియాలో చిక్కుకున్నారని హైదరాబాద్‌కు చెందిన నఫీస్ బేగం ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను క్షేమంగా ఇండియాకు రప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నఫీస్ బేగం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. నఫీస్ బేగం భర్త హసన్ పాషా కొన్నేళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ ఓ పెయింటింగ్ షాప్‌లో పనికి కుదిరారు. 10ఏళ్లపాటు అందులోనే పని చేసిన హసన్ పాషాకు.. యజమాని షాపులో భాగస్వామ్యం ఇచ్చాడు. భాగస్వామ్యం తీసుకున్నందుకుగానూ హసన్ పాషా నుంచి సదరు యజమాని నెలకు దాదాపు 4వేల రియాల్‌లు వసూలు చేశారు. అనంతరం అతని యజమాని ఆ షాపును హసన్‌ పాషాకే లీజుకిచ్చి.. నెలకు 5,500 రియాల్‌లను అద్దెగా చెల్లించాల్సిందిగా కోరాడు. దీనికి హసన్ పాషా కూడా అంగీకరించాడు. 



మూడు నెలలపాటు హసన్ పాషా సవ్యంగానే అద్దె చెల్లించాడు. ఈ క్రమంలోనే కరోనా పంజా విసిరింది. అనంతరం ఆ షాపును మున్సిపల్ అధికారులు కూల్చేశారు. ఈ క్రమంలో స్పందించిన యజమాని.. ఇండియాకు వెళ్లి, కొత్త వీసాపై తిరిగి రావాల్సిందిగా హసన్ పాషాకు సూచించాడు. దానికి హసన్ పాషా అంగీకరించాడు. దీంతో వీసా కోసమని నమ్మబలికి అతని యజమాని హసన్ పాషా వద్ద కొన్ని సంతకాలు తీసుకున్నాడు. అనంతరం స్వదేశానికి బయల్దేరిన హసన్ పాషాకు ఓ షాకింగ్ విషయం తెలిసింది. 15000 సౌదీ రియాల్‌లను మోసం చేసినట్టుగా తన యజమాని తనపై ఫిర్యాదు చేశాడని.. దేశం విడిచి వెళ్లకుండా అతని పేరును అధికారులు బ్లాక్ లిస్ట్‌లో చేర్చినట్టు తెలుసుకుని హసన్ పాషా షాకయ్యాడు. ఈ క్రమంలో హసన్ పాషా సౌదీ అరేబియాలో చిక్కుకున్నాడు. కాగా.. తన భర్తకు సహాయం చేసి, స్వదేశానికి రప్పించాల్సిందిగా నఫీస్ బేగం విదేశాంగ మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు. 


Updated Date - 2021-03-08T02:37:21+05:30 IST