HYD: ఇళ్ల మధ్య బారా?

ABN , First Publish Date - 2021-09-18T17:07:46+05:30 IST

సీతాఫల్‌మండి డివిజన్‌ మైలార్‌గడ్డలో బార్‌ అండ్‌ రెస్టారెండ్‌ నిర్మాణపనులను శుక్రవారం మహిళలు, స్థానికులు అడ్డుకున్నారు. జనావాసాల మధ్య బార్‌కు ఎలా అనుమతి ఇచ్చారంటూ

HYD: ఇళ్ల మధ్య బారా?

మైలార్‌గడ్డలో బార్‌ నిర్మాణ పనులను అడ్డుకున్న మహిళలు 

స్థానికులకు కార్పొరేటర్‌ మద్దతు


హైదరాబాద్/బౌద్ధనగర్‌: సీతాఫల్‌మండి డివిజన్‌ మైలార్‌గడ్డలో బార్‌ అండ్‌ రెస్టారెండ్‌ నిర్మాణపనులను శుక్రవారం మహిళలు, స్థానికులు అడ్డుకున్నారు. జనావాసాల మధ్య బార్‌కు ఎలా అనుమతి ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లైసెన్స్‌ రద్దు చేయకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చిలకలగూడ వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని మైలార్‌గడ్డలో గల భవనంలో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు పనులు నిర్వహిస్తున్నారు. సమాచారమందుకున్న స్థానికులు, పలు బస్తీలకు చెందిన మహిళలు అక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టారు. బార్‌ పనులను అడ్డుకుని కూలీలను పంపించి వేశారు. జనావాసాల మధ్య బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు అనుమతి ఇవ్వడంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మత్తులో మహిళలు, చిన్నారులపై ఇటీవల జరుగుతున్న ఘాతుకాలు, అఘాయిత్యాలు, లైంగికదాడులు అధికారులకు కనిపించటం లేదా బస్తీ మహిళ నాయకురాలు నవనీత ప్రశ్నించారు. కార్పొరేటర్‌ సామల హేమ ఘటానికి స్థలానికి చేరుకుని మహిళలకు మద్దతు ప్రకటించారు. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటుకు ఇచ్చిన అంగీకార పత్రాలను రద్దు చేసుకోవాలని భవన యజమానికి సూచించారు. అనంతరం మహిళలు చిలకలగూడ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-09-18T17:07:46+05:30 IST