హైదరాబాద్‌లో కలప వ్యాపారి కిడ్నాప్‌ కలకలం..

ABN , First Publish Date - 2021-07-04T17:45:22+05:30 IST

కలప వ్యాపారి కిడ్నాప్‌ కలకలం రేపింది. ఆర్థిక లావాదేవీల కారణంగా

హైదరాబాద్‌లో కలప వ్యాపారి కిడ్నాప్‌ కలకలం..

  • వ్యాపార లావాదేవీలే కారణమా?
  • నాగ్‌పూర్‌ బస్సు ఎక్కించిన దుండగులు
  • క్షేమంగా ఉన్నానంటూ పోలీసులకు సమాచారం

హైదరాబాద్ సిటీ/కొత్తపేట : నగరంలో కలప వ్యాపారి కిడ్నాప్‌ కలకలం రేపింది. ఆర్థిక లావాదేవీల కారణంగా నాగ్‌పూర్‌కు చెందిన కొందరు అతడిని కిడ్నాప్‌ చేసినట్లు ఎల్‌బీనగర్‌ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కిడ్నాపర్లు వ్యాపారిని  నాగ్‌పూర్‌ వెళ్లే బస్సులో తీసుకెళ్తుండగా, అతను తప్పించుకుని మరో బస్సులో నగరానికి వస్తున్నట్లు సమాచారం. మెహిదీపట్నం పరిధి శంకర్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ ఆరీఫ్‌ అక్బానీ(43) ఎల్‌బీనగర్‌ కర్మన్‌ఘాట్‌ డిఫెన్స్‌ కాలనీలో కైఫ్‌ ట్రేడర్స్‌ పేరిట కలప వ్యాపారం చేస్తున్నా డు. నాగ్‌పూర్‌ నుంచి కలప కొనుగోలు చేసి, ఇక్కడ విక్రయిస్తుంటాడు. మెహిదీపట్నంలోనే ఉండే ఎండీ అమీర్‌(29) అతడి వద్ద డ్రైవర్‌గా, ఇతర పనులు చేస్తున్నాడు. 


శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు వారిద్దరూ దుకాణంలో ఉండగా, నాగ్‌పూర్‌కు చెందిన తారీఖ్‌, లుక్మన్‌లతోపాటు గుర్తు తెలియని పది మంది కారు, డీసీఎం, అశోక్‌ లీలాండ్‌ ట్రాలీలో వచ్చారు. ఆరీఫ్‌ అక్బానీని బయటకు రమ్మని పిలవగా, అతడు వారినే దుకాణంలోకి రమ్మన్నాడు. నలుగురు దుకాణంలోకి వచ్చి సీసీ కెమెరాలు ఆఫ్‌ చేశారు. తమకు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకుండా, అడ్రస్‌ చెప్పకుండా ఇబ్బంది పెడుతున్నావని అన్నారు. డబ్బులు ఇస్తానని ఆరీఫ్‌ చెప్పగా, మిగితా వారు దుకాణంలో ఉన్న కలపను డీసీఎం, ట్రాలీల్లో లోడ్‌ చేసుకున్నారు. కొందరు అమీర్‌ ఫోన్‌ను లాక్కునే ప్రయత్నం చేయగా, అతడు బయటకు వెళ్లిపోయాడు.


ఈ క్రమంలో నలుగురు ఆరీ్‌ఫను బలవంతంగా కారులో ఎక్కించుకుని డీసీఎం, ట్రాలీల్లో లోడ్‌తోపాటు వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి అమీర్‌ ఎల్‌బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. ఆరీఫ్‌తో ఫోన్‌లో మాట్లాడే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి అతడితో ఫోన్‌లో మాట్లాడగలిగారు. కిడ్నాపర్లు మేడ్చల్‌ వద్ద ఓ వ్యక్తికి తనను అప్పగించి, నాగ్‌పూర్‌ బస్సు ఎక్కించారని, తోడుగా ఉన్న వ్యక్తి దారిలో బస్సు దిగిపోయాడని ఆరీఫ్‌ చెప్పాడు. తర్వాత తానూ బస్సు దిగి మరో బస్సులో వస్తున్నానని చెప్పాడు. కిడ్నాపర్ల కోసం మూడు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని ఎస్‌హెచ్‌ఓ అశోక్‌రెడ్డి తెలిపారు.


వ్యాపారి క్షేమం: సీపీ మహేష్‌ భగవత్‌ 

కిడ్నా్‌పనకు గురైన వ్యాపారితో పోలీసులు ఫోన్‌లో మాట్లాడారని సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. సదరు వ్యాపారి నాగ్‌పూర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి క్షేమంగా ఉన్నట్లు తెలిపాడని వెల్లడించారు. కిడ్నాప్‌ యత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, త్వరలో నిందితులను పట్టుకుంటామన్నారు.

Updated Date - 2021-07-04T17:45:22+05:30 IST