రోడ్డుమీద దొరికిన సిమ్‌తో..మహిళకు లైంగిక వేధింపులు

Jun 16 2021 @ 08:32AM

సైబర్‌ నేరగాడి ఆటకట్టించిన రాచకొండ పోలీసులు

హైదరాబాద్‌ సిటీ: రోడ్డు మీద దొరికిన సిమ్‌ కార్డుతో మహిళను లైంగికంగా వేధించిన సైబర్‌ నేరగాడి ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. సైబర్‌ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌లోని కొత్తచెరువు రోడ్డు, హనుమాన్‌నగర్‌కు చెందిన యువకుడు అక్షయ్‌కుమార్‌కు కొద్దిరోజుల క్రితం రోడ్డుమీద ఒక సిమ్‌కార్డు దొరికింది. దాన్ని తన సెల్‌ఫోన్‌లో వేయగా పనిచేసింది. ఆ నంబర్‌తో అక్షయ్‌కుమార్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీని క్రియేట్‌ చేశాడు. ఆ తర్వాత మహిళల ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీల కోసం వెతికి కొంతమందిని సెలెక్టు చేసుకున్నాడు. ఓ మహిళకు ఫ్రెండ్‌ రిక్వెస్టు పంపాడు. నగరానికి చెందిన ఓ మహిళ యాక్సెప్టు చేసింది. కొద్దిరోజులు ఆమెతో చాటింగ్‌ చేసిన యువకుడు ఆ తర్వాత వీడియో కాల్స్‌ చేయడం ప్రారంభించాడు. వీడియోకాల్స్‌లో నగ్నంగా మాట్లాడేవాడు. అసభ్యకర చిత్రాలు, మెసేజ్‌లు పంపేవాడు. అతని వేధింపులు భరించలేక ఆ యువతి రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలిసిన నిందితుడు ఆధారాలు దొరక్కుండా తన వద్ద ఉన్న రెండు మొబైల్‌ ఫోన్‌లను ఫార్మెట్‌ చేయించినట్లు పోలీసులు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా నిందితుడిని అదుపులోకి  తీసుకున్నారు.  

Follow Us on: