ఆ సిమ్‌కార్డులతో ఏం చేశాడు?

Jun 16 2021 @ 10:59AM

బంగ్లా బార్డర్‌లో చిక్కిన చైనీయుడిని విచారిస్తున్న పోలీసులు

హైదరాబాద్‌ సిటీ: ఇండియా - బంగ్లా బార్డర్‌లో ఇటీవల చిక్కిన హ్యాన్‌ జున్వే వద్ద అధికారులు 1300 సిమ్‌కార్డులను గుర్తించారు. దేశంలోకి పలుమార్లు వచ్చి వాటిని తీసుకెళ్లడంపై అతని ప్లాన్‌ ఏంటీ, జున్వే వెనుక ఇంకా ఎవరున్నారు అనే వివరాలను దర్యాప్తు సంస్థలు సేకరిస్తున్నాయి. ఆ సిమ్‌కార్డులను దేని కోసం వినియోగించాడనే వివరాలను రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. హైదరాబాద్‌ పేలుళ్ల లింకులపై ఆరా తీస్తున్న నగర పోలీసులు, సైబర్‌క్రైం అధికారులు కూడా సిమ్‌కార్డులపై దృష్టి కేంద్రీకరించారు. గతేడాది వెలుగు చూసిన రుణాల యాప్‌ మోసాలకు, ఈ సిమ్‌కార్డులకు లింకు ఉందా అనేది అధికారులు పరిశీలిస్తున్నారు. 


రహస్యంగా తరలింపు

2010 నుంచి చైనా నుంచి ఆపరేట్‌ అయిన సిమ్‌కార్డుల వివరాలు ఇవ్వాలని దర్యాప్తు సంస్థలు టెలికామ్‌ కంపెనీలకు ఆదేశాలు జారీ చేశాయి. బార్డర్‌లో చిక్కిన హ్యాన్‌జున్వేను విచారించగా ఆర్థిక మోసాలు, నేరాల కోసమే సిమ్‌కార్డులను సేకరించినట్లు వెల్లడించాడు. అన్నింటినీ నకిలీ పత్రాలతోనే తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. సిమ్‌కార్డులను లోదుస్తుల్లో దాచి తీసుకెళ్లేవాడినని పేర్కొన్నాడు. హ్యాన్‌ చెప్పినట్లు సిమ్‌కార్డులను ఆర్థిక వ్యవహారాలకే వినియోగించాడా, లేదా అనేది తెలియాల్సి ఉంది.


బాధితులెవరు?

మన సిమ్‌కార్డులను చైనాకు తరలించి పలువురి ఖాతాలను హ్యాక్‌ చేయడం, ఇక్కడి వారి డబ్బును కొల్లగొట్టారన్న విషయాలను గుర్తించిన అధికారులు బాధితులెవరన్న విషయాలపై దర్యాప్తు సాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎంతమంది మోసపోయారు, ఖాతాల నుంచి మాయమైన డబ్బులపై హైదరాబాద్‌లో వచ్చిన ఫిర్యాదులపైనా అధికారులు దృష్టి సారించారు. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. 


సిమ్‌ కార్డే.. అయినా ప్రమాదకరమే

2007 మే 18న చారిత్రక మక్కామసీదులో పేలుళ్లు జరిగాయి. ఆ కేసులో దర్యాప్తు చేపట్టిన బృందాలకు సిమ్‌కార్డులే కీలక ఆధారాలుగా లభించాయి. ఫోన్‌లో సిమ్‌కార్డును పెట్టి, పేల్చే సమయంలో ఆ ఫోన్‌ను రింగ్‌ చేయడం లేదా రిమోట్‌ టెక్నాలజీని వాడి ఉంటారని అప్పట్లో అధికారులు గుర్తించారు. ఆ తర్వాత సిమ్‌కార్డులను వెస్ట్‌బెంగాల్‌లో కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఎన్‌ఐఏ విచారణలో చివరకు సిమ్‌కార్డులే కీలకంగా మారాయి.

Follow Us on: