ముంపు వ్యధ..

ABN , First Publish Date - 2022-06-23T17:51:32+05:30 IST

అక్టోబర్‌ 2020లో కురిసిన భారీ వర్షానికి రాజేంద్రనగర్‌లోని గగన్‌పహాడ్‌ అప్పాచెరువు తెగి దిగువన ఉన్న ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిద్రపోతున్న నలుగురు మృతి

ముంపు వ్యధ..

అదే బాధ మెజార్టీ ప్రాంతాల్లో నాటి దుస్థితే

 రెండేళ్లుగా ప్రకటనలతోనే సరి

 క్షేత్రస్థాయిలో మారని పరిస్థితి

 చెరువులు, నాలాల పక్కన పొంచి ఉన్న ప్రమాదం

 ఆలస్యంగా ఎస్‌ఎన్‌డీపీ పనులు

 వర్షాలతో మరింత నెమ్మదించిన వైనం

 ఆయా ప్రాంతాల్లో కొత్త ప్రమాదాలు


హైదరాబాద్‌ సిటీ: అక్టోబర్‌ 2020లో కురిసిన భారీ వర్షానికి రాజేంద్రనగర్‌లోని గగన్‌పహాడ్‌ అప్పాచెరువు తెగి దిగువన ఉన్న ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిద్రపోతున్న నలుగురు మృతి చెందారు. మైలార్‌దేవ్‌పల్లి పల్లె చెరువు తెగి అలీనగర్‌కు చెందిన 9 మంది వరద నీటిలో గల్లంతయ్యారు. 

 నాగోల్‌ డివిజన్‌ అయ్యప్ప కాలనీలో ఇటీవల మోస్తరుగా కురిసిన వర్షానికి ఇళ్లలోకి నీరు చేరింది. చెరువు అలుగుకు అనుసంధానంగా ఉన్న కాలువ మరమ్మతు పనులు జరుగుతుండడం.. దిగువకు నీరు వదలకపోవడంతో కాలనీ జలమయమైంది. 

 గత ఏడాది హయత్‌నగర్‌ డివిజన్‌లోని కట్టమైసమ్మ, తిరుమల, ఆర్టీసీ మజ్దూర్‌ కాలనీలు దాదాపు నాలుగు రోజులపాటు నీటిలోనే ఉన్నాయి. దీంతో నిత్యావసరాలు తెచ్చుకునేందుకు, ఇతరత్రా పనుల కోసం బయటకు వెళ్లేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

 మల్కాజిగిరి వినాయకనగర్‌ డివిజన్‌లోని దీన్‌దయాళ్‌నగర్‌కు భారీగా వరద నీరు రావడంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన సుమేధ రోడ్డు కనిపించక డ్రెయిన్‌లో పడి మృతి చెందింది. 

మణికొండ గోల్డెన్‌ టెంపుల్‌ వద్ద పైప్‌లైన్‌ కాలువలో పడి ఐటీ ఉద్యోగి రజనీకాంత్‌ మృతిచెందాడు. పైప్‌లైన్‌ నిర్మాణ పనుల కోసం తవ్విన కాలువ వరద నీటిలో కనిపించక ఈ ప్రమాదం జరిగింది. 

భారీ వర్షాలు కురిసినప్పుడు నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాలు, ముంపునకు నిదర్శనాలివి. పదుల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయి.. వందలాది కాలనీలు రోజుల తరబడి నీట మునిగి రెండేళ్లు దాటింది. అయినప్పటికీ నాడు వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుదలకు పాలకులు చేపడతామన్న పనుల్లో ఒక్కటీ పూర్తి కాలేదు. క్షేత్రస్థాయి పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. భారీ వర్షం కురిస్తే మళ్లీ అవే బాధలు పునరావృతం కానున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. వరద ప్రవాహ వ్యవస్థకు సంబంధించి ఆరు దశాబ్దాలుగా జరిగిన నిర్లక్ష్యం గత ఎనిమిదేళ్లలోనూ కనిపిస్తోంది. 


వందేళ్ల రికార్డు స్థాయి వర్షపాతం 2020లో నమోదవగా.. దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుడతామన్న ప్రభుత్వ పెద్దల మాటలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. రెండేళ్లలో పనులు మొదలు పెట్టడం మినహా పూర్తి చేసినవి చాలా అరుదు. ఇప్పటికీ గతంలో ముంపునకు గురైన మెజార్టీ ప్రాంతాల్లో అదే దుస్థితి. వర్షాకాలంలోపు పూర్తిచేస్తామని ప్రారంభించిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎ్‌సఎన్‌డీపీ) పనులూ వానలతో నెమ్మదించాయి. పనుల కోసం తవ్విన కాలువలు, గుంతలు ఇప్పుడు కొత్త ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి.


సరూర్‌నగర్‌లో కొత్త సమస్యలు

మిషన్‌ కాకతీయ కింద 2018లో సరూర్‌నగర్‌ చెరువు అభివృద్ధి, సుందరీకరణ కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసింది. అవుట్‌లెట్‌ కాలువ నిర్మాణం చేపట్టకుండా చెరువు చుట్టూ మట్టి కట్టలు పోయడంతో వరద నీరు దిగువకు వెళ్లే అవకాశం లేదు. దీంతో సింగరేణి కాలనీ, సరస్వతి కాలనీ, తపోవన్‌, గ్రీన్‌పార్క్‌, రెడ్డి కాలనీ, కృష్ణానగర్‌, ఆదర్శనగర్‌ కాలనీలకు ముంపు ముప్పు తప్పేలా లేదు. రూ.8.70 కోట్ల వ్యయంతో చేపట్టిన 1,700 మీటర్ల బాక్స్‌డ్రెయిన్‌ పనులు ఇంకా సా..గుతూనే ఉన్నాయి. 


బడంగ్‌పేట, మీర్‌పేటలో...

మీర్‌పేట్‌, బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లలోని పలు కాలనీల ప్రజలు ముంపు భయంతో వణుకుతున్నారు. మీర్‌పేట్‌ కార్పొరేషన్‌ పరిధిలో రూ.18.93 కోట్లతో, బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లో రూ.64 కోట్లతో నాలాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వానా కాలం నాటికి వాటి నిర్మాణం పూర్తిచేసి వరద ముంపు నుంచి కాలనీలను గట్టెక్కించాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఇప్పటికీ పనులు పూర్తికాలేదు. 


అప్పా చెరువు వద్ద ఆగమాగం

అప్పా చెరువు వద్ద నాలా సహజ ప్రవాహ వ్యవస్థకు విరుద్ధంగా నిర్మిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో ఉన్న అలుగు వద్ద కాకుండా వేరేచోట నాలా నిర్మిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో వరద నీరు దిగువకు సాఫీగా వెళ్లదంటున్నారు. పల్లెచెరువు నుంచి అలీనగర్‌, అల్‌జుబైల్‌ కాలనీ వరకు నాలా విస్తరణ పనులు ప్రారంభించి ఏడాది దాటినా.. ఇంకా సగం కూడా పూర్తవలేదు.  


మణికొండలో..

మణికొండ గోల్డెన్‌ టెంపుల్‌ వద్ద గతంలో ప్రమాదం జరిగి ఓ వ్యక్తి మృతి చెందినా.. అధికారుల తీరు మారలేదు. పలు ప్రాంతాల్లో పైప్‌లైన్‌లు వేసి పెద్దపెద్ద మ్యాన్‌హోల్స్‌ తవ్వి తగిన జాగ్రత్తలు లేకుండా నిర్లక్ష్యంగా వదిలివేశారు. 


జీడిమెట్లలో..

జీడిమెట్ల సుభా్‌షనగర్‌ నుంచి బాలానగర్‌, నవజీవన్‌నగర్‌, సాయినగర్‌, వినాయక్‌నగర్‌ మీదుగా వెళ్లే మురికి నాలా గౌతమినగర్‌లో మరో నాలాలో కలుస్తోంది. రెండేళ్ల క్రితం నాలా పక్కనున్న నవజీవన్‌నగర్‌, సాయినగర్‌ నీట మునిగాయి. రిటైనింగ్‌ వాల్‌ నిర్మించకపోవడంతో ఇప్పుడూ అదే పరిస్థితి ఉంది.


జల్‌పల్లిలో..

జల్‌పల్లి బతుకమ్మ కుంట నుంచి గుర్రం చెరువు వరకు బాక్స్‌టైప్‌ నాలా పనులు చేపట్టారు. 1.7 కిలోమీటర్ల వరకు జరుగుతున్న పనులు 50 శాతం పూర్తయ్యాయి. మిగతా పనులు పూర్తి కావాలంటే మరో మూడు నెలలు పట్టవచ్చు. వర్షాలు వస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవు. 

Updated Date - 2022-06-23T17:51:32+05:30 IST