రెండేళ్లలో మురుగు మాయం

Sep 25 2021 @ 12:22PM

వేసవిలోనూ నీటి ఇబ్బందులు రాకుండా చర్యలు

రూ. ఏడు వేల కోట్లతో వాటర్‌బోర్డు పనులు

ఇప్పటికే ఒక ప్యాకేజీ టెండర్లు ఖరారు

మరో రెండు ప్యాకేజీల పనులకు కసరత్తు

శివారు తాగునీటి పనులు ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌-2లోనే చర్యలు చేపట్టిన అధికారులు


తాగునీటి వసతి, మురుగునీటి నిర్వహణ మెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌  ఇవ్వడంతో వాటర్‌బోర్డు రంగంలోకి దిగింది. ఏకకాలంలో సుమారు రూ.7వేల కోట్ల విలువైన పనులను  చేపట్టనుంది. రెండేళ్లలో వాటిని పూర్తి చేసి రోడ్లపై మురుగు కనిపించని నగరంగా తీర్చిదిద్దనుంది


హైదరాబాద్‌ సిటీ : నగరానికి తాగునీటి సరఫరాకు ఢోకా లేకుండా, నీటి తరలింపులో ఇబ్బందులు రాకుండా వాటర్‌బోర్డు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే సుంకిశాల ఇన్‌టెక్‌ ఛానల్‌ పనులను రూ.1450 కోట్ల వ్యయంతో ప్రారంభించింది. కోర్‌సిటీలోని జోన్‌-3లో సివరేజీ పనులను రూ.300 కోట్లతో చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. తాజాగా మురుగునీటి శుద్ధిలో భాగంగా 31 ఎస్టీపీల నిర్మాణానికి రూ.3866.21 కోట్లకు గ్రీన్‌ సిగ్నల్‌ రాగా, శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారంలో భాగంగా రూ.1200కోట్లతో పనులు చేపట్టేందుకు పాలనాపరమైన అనుమతులు వచ్చాయి. దాంతో టెండర్లను ఆహ్వానించేందుకు వాటర్‌బోర్డు కసరత్తు చేస్తోం ది. వచ్చే రెండేళ్లలో వాటర్‌బోర్డు ఆధ్వర్యంలో ఈ కీలకమైన పనులు జరగనున్నాయి. 

శివారులో విస్తరిస్తున్న మరిన్ని ప్రాంతాలకు తాగునీటిని అందించేందుకు రూ.1200 కోట్లతో 2వేల కిలోమీటర్ల మేర కొత్తగా పైపులైన్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి, 70 రిజర్వాయర్లు నిర్మించడానికి అధికారులు ఇప్పటికే డీపీఆర్‌ రూపొందించారు. ఓఆర్‌ఆర్‌ పేజ్‌-2 పేరుతో టెండర్ల నిర్వహణ చేపట్టి ఏదైనా సంస్థకు పనులు అప్పగించేందుకు చర్యలు చేపడుతున్నారు.


రెండో ప్యాకేజీలో 14 ఎస్టీపీలకు టెండర్లు

సివరేజీ మాస్టర్‌ ప్లాన్‌ అమలులో భాగంగా ఇప్పటికే ప్యాకేజీ-3 పనులు ప్రారంభమవ్వగా, ప్యాకేజీ-1, ప్యాకేజీ-2 పనుల్లో 14 ఎస్టీపీలను నిర్మించడానికి టెండర్లను ఆహ్వానించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్యాకేజీ-1లో ఉప్పల్‌, కాప్రా, మల్కాజిరి, అల్వాల్‌ సర్కిళ్ల పరిధిలో రూ.1230.21కోట్లతో 8 ఎస్టీపీలను, ప్యాకేజీ-2లో రాజేంద్రనగర్‌, ఎల్బీనగర్‌ సర్కిళ్ల పరిధిలో రూ.1355.33కోట్లతో ఆరు ఎస్టీపీలను నిర్మించనున్నారు. 


సుంకిశాలతో వేసవి ఇబ్బందులకు చెక్‌ 

 వేసవిలో నీటి ఇబ్బందులు లేకుండా నగరానికి మెరుగ్గా కృష్ణా జలాలను తరలించడంలో కీలకమైన సుంకిశాల ప్రాజె క్టు పనులు ప్రారంభమయ్యాయి. పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని వాటర్‌బోర్డు అధికారులు డెడ్‌లైన్‌ విధించారు. ఆగస్టు మొదటివారంలోనే పనులు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా తొలుత అండర్‌ గ్రౌండ్‌ షాప్ట్‌, ఇన్‌టెక్‌ టన్నెల్‌ పనులు మొదలుపెట్టారు. కృష్ణా జలాలను మూడు ఫేజ్‌లో అత్యంత లోతు నుంచి కూడా సులువుగా తోడేందుకు భారీ ఇన్‌టెక్‌ వెల్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు.


మొదలైన ఎస్టీపీ నిర్మాణ పనులు

నగరంలో ఉత్పత్తి అయ్యే మురుగునీరంతా సివరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎస్‌టీపీ)లోకి వెళ్ళిన తర్వాతే నదులు, జలాశయాల్లో కలిసే విధంగా అధికారులు రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 31 ఎస్టీపీల నిర్మాణానికి రూ.3866.21కోట్ల పనులకు గ్రీన్‌ సిగ్నల్‌  ఇచ్చింది. ఎస్టీపీల నిర్మాణంతో కలుషితంగా మారిన చెరువులు, కుంటలు మెరుగుపడనున్నాయి. ఇప్పటికే మొదటి దశలో ప్యాకేజీ-3లోని 17 ఎస్టీపీలను రూ.1280.87కోట్లతో నిర్మించడానికి టెండర్లను ఆహ్వానించగా ప్రముఖ నిర్మాణ సంస్థ పనులు దక్కించుకుంది. ఈ పనుల్లో భాగంగా కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి సర్కిళ్ల పరిధిలోని అంబర్‌ చెరువు, ప్రగతి నగర్‌, చిన్న మైసమ్మ చెరువు, నల్ల చెరువు, కూకట్‌ పల్లి, ఖాజాకుంట, ఎల్లమ్మకుంట లేక్‌, జయానగర్‌, ఫతేనగర్‌, వెన్నెలగడ్డ, గాయత్రినగర్‌, చింతల్‌, ఫాక్స్‌సాగర్‌ లేక్‌, శివాలయ నగర్‌ చెరువు, పరికి చెరువు, కంద్రిగుట్ట, మియాపూర్‌ పటేల్‌ చెరువు, గంగారాం చెరువు, ముల్లకత్వ చెరువు, కాముని చెరువు, దుర్గంచెరువు, కాజాగూడలలో రోజుకు 376.5 మిలియన్‌ గ్యాలన్ల మురుగునీటిని శుద్ధి చేసేలా 17 ఎస్టీపీల నిర్మాణానికి సంబంధిత సంస్థ చర్యలు చేపట్టింది. 

Follow Us on: