ఆగని అవినీతి.!

Oct 14 2021 @ 11:22AM

 టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయంలో ఎనిమిది నెలల క్రితం లంచం తీసుకుంటూ డీఈ మనోహర్‌ అవినీతి శాఖ అధికారులకు చిక్కాడు.

నాగోల్‌లో ఏఈ మధుకర్‌ ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ 

అధికారులకు చిక్కాడు.


.. వీరే కాదు, గతంలో కూడాకొందరు ఇలా పట్టుబడ్డారు. కొత్త కనెక్షన్‌ తీసుకోవాలన్నా, ప్యానల్‌ బోర్డులు కావాలన్నా, లైన్లు వేయాలన్నా డబ్బు డిమాండ్‌ చేసే సిబ్బందికి విద్యుత్‌ శాఖలో కొదవ లేదు. కొంతమంది అధికారులు నిబంధనల  పేరుతో భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏసీబీకి చిక్కుతున్నా బేఫికర్‌గా లక్షల్లో దోచేస్తున్నారు


విద్యుత్‌ శాఖలో ప్రతి పనికో రేటు 

అడిగినంత ఇస్తే అక్రమ నిర్మాణాలకూ కనెక్షన్లు

అధికారుల బంధువులే కాంట్రాక్టర్లు


హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌లో కొత్త అపార్ట్‌మెంట్లు, గృహాలు, విల్లాలు ఇలా ఎక్కడ విద్యుత్‌ కనెక్షన్లు తీసుకోవాలన్నా అడిగినంత ఇస్తే తప్పా కనెక్షన్లు త్వరగా మంజూరు కాని పరిస్థితులున్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా క్షేత్రస్థాయి అధికారులను కలవనిదే ఫైల్‌ ముందుకు కదలడం లేదు. పఠాన్‌చెరువు, కందుకూరు, జీడిమెట్ల, బాచుపల్లి, కొండాపూర్‌, రాజేంద్రనగర్‌, సరూర్‌నగర్‌, బోయిన్‌పల్లి, బేగంబజార్‌, సైఫాబాద్‌, అజామాబాద్‌, షాద్‌నగర్‌, అమన్‌గల్లి, మామిడిపల్లి, కొత్తూరు, గగన్‌పహాడ్‌, హయత్‌నగర్‌, తుర్కయాంజల్‌తో పాటు పలు ప్రాంతాల్లో కొంతమంది లైన్‌మన్లు, లైన్‌ ఇన్‌స్పెక్టర్లతో పాటు ఏఈ, ఏడీఈ, డీఈ స్థాయి అధికారులు తమ బంధువుల పేర్లతో కాంట్రాక్ట్‌ పనులు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అనుమతులు లేని భవనాలకు కొత్తకనెక్షన్లు, ప్యానల్‌బోర్డు మంజూరు చేసేందుకు లక్షల్లో డిమాండ్‌ చేస్తున్నారు. 


రేట్లు ఇలా..

అనుమతి లేని నిర్మాణానికి విద్యుత్‌ కనెక్షన్‌ కోసం పలు డివిజన్లలో ఏఈకి రూ. 10 వేలు, ఏడీఈకి రూ. 10 వేలు, డీఈకి రూ. 20-30 వేలు ఇలా రేట్‌ ఫిక్స్‌ చేసి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. అడిగింది ఇస్తే కానీ, రంగారెడ్డి, హైదరాబాద్‌ స్టోర్స్‌ నుంచి మెటీరియల్‌ బయటకు ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమాలు జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు.

కొత్తపేట: ఎల్‌బీనగర్‌ నాగోల్‌ డివిజన్‌ విద్యుత్‌ ఏఈ భుక్యా మధుకర్‌ లంచం తీసుకుంటుండగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ పట్టుకున్నారు. ఈ మేరకు ఆయన వివరాలు వెల్లడించారు. నాగోల్‌ డివిజన్‌ పరిధి రాక్‌టౌన్‌ కాలనీలో పంపాటి ఆనంద్‌కుమార్‌ ఓ భవనం నిర్మిస్తున్నాడు. సదరు భవనానికి విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌, మీటర్లు బిగించడానికి ప్రైవేటు విద్యుత్‌ కాంట్రాక్టర్‌ ప్రదీ్‌పరెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నారు. పనులు ముగిసిన తర్వాత విద్యుత్‌ సరఫరా ఇచ్చేందుకు, వర్క్‌ కంప్లీషన్‌ రిపోర్టు అందజేసేందుకు ప్రదీ్‌పకుమార్‌ రెడ్డిని రూ.15 వేలు ఇవ్వాలని సంబంధిత ఏరియా ఏఈ భుక్య మధుకర్‌ డిమాండ్‌ చేశారు. ప్రదీ్‌పకుమార్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ సిబ్బంది రంగంలోకి దిగి నాగోల్‌లోని ఏఈ కార్యాలయంలో బుధవారం ఉదయం 10.45 గంటలకు భుక్యా మధుకర్‌ను, ప్రదీ్‌పకుమార్‌రెడ్డి వద్ద తీసుకున్న లంచం డబ్బుతో సహా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

ఈ నేపథ్యంలో 12 మంది లైన్‌మన్లను, జూనియర్‌ లైన్‌మన్లనూ ఏసీబీ అధికారులు విచారించారు. కార్యాలయంలోని ఫైళ్లను, రికార్డులను తనిఖీ చేశారు. భుక్యా మధుకర్‌ను ఏసీబీ కోర్టులో హాజరు పరచి, చంచల్‌గూడ కారాగారానికి తరలించనున్నారు. బండ్లగూడలోని విద్యుత్‌ శాఖ ఏఈ కార్యాలయాన్ని మూడు రోజుల క్రితమే ఓల్డ్‌ నాగోల్‌లోని భవనంలోకి మార్చారు. కార్యాలయం నూతన భవనంలోకి మారిన మూన్నాళ్లకే ఏఈని ఏసీబీ అధికారులు పట్టుకోవడం నాగోల్‌లో చర్చనీయాంశమైంది.

Follow Us on:

హైదరాబాద్మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.