మూడు బృందాలు.. 15 రోజులు

ABN , First Publish Date - 2021-10-14T17:32:17+05:30 IST

ముప్పై మంది పోలీసులు.. మూడు బృందాలు.. రెండు బస్సులు.. ఓ ఇన్నోవా.. ఏడు రాష్ట్రాల గుండా.. 4 వేల కిలోమీటర్ల ప్రయాణం. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా, అర్ధరాత్రి అడవుల్లో,..

మూడు బృందాలు.. 15 రోజులు

జార్ఖండ్‌ సైబర్‌ నేరగాళ్ల కోసం వేట

రాచకొండ పోలీసుల సాహసం

23 మంది నిందితులను పట్టుకుని నగరానికి..

ఇప్పటికే 10 మంది రిమాండ్‌

నేడో రేపో మరో 13 మంది కటకటాల్లోకి.. 


హైదరాబాద్‌ సిటీ: ముప్పై మంది పోలీసులు.. మూడు బృందాలు.. రెండు బస్సులు.. ఓ ఇన్నోవా.. ఏడు రాష్ట్రాల గుండా.. 4 వేల కిలోమీటర్ల ప్రయాణం. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా, అర్ధరాత్రి అడవుల్లో, కచ్చా రోడ్లపై సుమారు 15 రోజులు పాటు ప్రయాణించారు. సైబర్‌ నేరగాళ్ల కోసం రాచకొండ పోలీసులు చేసిన సాహాస యాత్ర ఇది. అచ్చం ఖాకీ సినిమాను తలపించేలా ప్రయాణించి, 23 మంది ఘరానా సైబర్‌ నేరగాళ్లను పట్టుకున్నారు.  

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో సైబర్‌ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సీపీ మహేష్‌ భగవత్‌ ప్రత్యేక దృష్టి సారించారు. జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన వారే ఎక్కువగా ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుసుకున్నారు. ఆ ముఠాల ఆటకట్టించాలని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ సంకల్పించారు. సీపీ ఆదేశాలతో 30 మంది పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి 18 రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి  వేటకు బయల్దేరారు. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీ్‌సగఢ్‌, ఒడిషా, జార్ఖండ్‌.. అక్కడి నుంచి బిహార్‌, మధ్యప్రదేశ్‌, యూపీ ఇలా ఏడు రాష్ట్రాల గుండా సుమారు 4 వేల కిలోమీటర్లు ప్రయాణించారు. దారిలో ఏది దొరికితే అది తిన్నారు. చివరికి గమ్యాన్ని చేరుకుని, 23 మంది జార్ఖండ్‌ నేరగాళ్లను హైదరాబాద్‌కు తరలించారు. 


సైబర్‌ క్రైమ్‌ కో ఆర్డినేషన్‌ సెంటర్‌ సహకారంతో..

జార్ఖండ్‌ సైబర్‌ నేరగాళ్లకు సంబంధించి అన్ని సాంకేతిక ఆధారాలతో బయల్దేరిన రాచకొండ పోలీసులకు తెలంగాణ సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ సెంటర్‌ సహకారం అందించింది. పోలీసుల జార్ఖండ్‌లో నిందితులకోసం గాలిస్తున్న క్రమంలో అప్పటికే వారిని జామ్‌తారా, దేవ్‌గఢ్‌, డిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ సెంటర్‌కు సమాచారం అందింది. దాంతో వారు రాచకొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో మూడు బృందాలు మూడు చోట్లకు వెళ్లాయి. దేవ్‌గఢ్‌ జిల్లా జైలులో 10 మంది, జామ్‌తారా జైల్లో 8 మంది, తీహార్‌ జైల్లో అయిదుగురు ఉన్నట్లు గుర్తించింది. దీంతో వారిని పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకొని నగరానికి తీసుకొచ్చారు. రెండు రోజుల క్రితం దేవ్‌గఢ్‌కు చెందిన 10 మంది సైబర్‌ దొంగలను రిమాండుకు తరలించిన పోలీసులు.. మరో 13 మంది జామ్‌తారా నిందితులను నేడో రేపో కటకటాల్లోకి నెట్టడానికి సిద్దమవుతున్నారు.


గూగుల్‌లో చొరబడి మోసాలు.. 

జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన ఈ ఘరానా సైబర్‌ దొంగల ముఠా.. గూగుల్లో అక్రమంగా చొరబడతారు. వివిధ వెబ్‌సైట్లలో కస్టమర్‌ కేర్‌ నంబర్‌లుగా నమ్మి స్తూ నకిలీ ఫోన్‌ నంబర్‌లను అప్‌లోడ్‌ చేస్తారు.. అవి కస్టమర్‌ కేర్‌ నంబర్‌లుగా భావించిన అమాయకులను అడ్డంగా బుక్‌చేసి వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. అలాగే, పే వాలెట్లలో కేవైసీ అప్‌డేట్‌ పేరుతో మోసాలకు పాల్పడుతారు.

Updated Date - 2021-10-14T17:32:17+05:30 IST