వరదల్లో వ్యర్థాలు

ABN , First Publish Date - 2021-10-20T18:01:05+05:30 IST

చెరువుల్లో పూడిక తీస్తే నీటి నిల్వ సామర్థ్యం పెరగాలి. అదే కాలువల్లో అయితే ప్రవాహ సామర్థ్యం అధికమవ్వాలి. కానీ, గ్రేటర్‌లో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. లక్షల క్యూబిక్‌

వరదల్లో వ్యర్థాలు

తరలించకపోవడంతో నాలాలు, వరదల్లో కలుస్తున్న వైనం

51 శాతం మాత్రమే తరలింపు

రెండు, మూడు పర్యాయాలు పూడిక తీయాల్సిన దుస్థితి

కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా

శేరిలింగంపల్లి, ఎల్‌బీనగర్‌ జోన్లలో అత్యల్పంగా తరలింపు

ముంపు ముప్పు అక్కడే ఎక్కువ

ఇతర జోన్లలో కూడా ఇబ్బందులు


హైదరాబాద్‌ సిటీ: చెరువుల్లో పూడిక తీస్తే నీటి నిల్వ సామర్థ్యం పెరగాలి. అదే కాలువల్లో అయితే ప్రవాహ సామర్థ్యం అధికమవ్వాలి. కానీ, గ్రేటర్‌లో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. లక్షల క్యూబిక్‌ మీటర్ల వ్యర్థాలు తొలగించినా నాలాలు, డ్రెయిన్లలో వరద సాఫీగా వెళ్లడం లేదు. కారణం తొలగించిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించక పోవడమే. కుప్పలుగా పేరుకుపోతున్న వ్యర్థాలు వరదలతో పాటు తిరిగి నాలాల్లో చేరుతున్నాయి. చెత్తా చెదారం, ప్లాస్టిక్‌ వ్యర్థాల మేటలు ప్రవాహానికి అడ్డంకిగా మారి సమీప ప్రాంతాల ముంపునకు కారణమవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 4.58 లక్షల క్యూబిక్‌ మీటర్ల వ్యర్థాలు తొలగించగా కేవలం 2.37 లక్షల క్యూబిక్‌ మీటర్లు మాత్రమే తరలించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే వ్యర్థాలు తొలగించి పూర్తిస్థాయిలో తరలించాల్సి ఉండగా సీజన్‌ ముగుస్తున్నా పూర్తి చేయకపోవడం జీహెచ్‌ఎంసీ ప్రత్యేకత. 


తగ్గుతున్న ప్రవాహ సామర్థ్యం

దసరా మర్నాడు కురిసిన భారీ వర్షం మరోసారి నగరంలో వరద ప్రవాహ వ్యవస్థ డొల్లతనాన్ని బహిర్గతం చేసింది. ఈ సీజన్‌లో పలుమార్లు పదుల సంఖ్యలో కాలనీలు, బస్తీలు ముంపునకు గురయ్యాయి. అందుబాటులో ఉన్న నాలాలు, డ్రెయిన్‌లను పూర్తి స్థాయిలో సంసిద్ధం చేయకపోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. నాలాలు, భూగర్భ డ్రెయిన్‌లు ఉన్న ఏరియాల్లో పూడిక వ్యర్థాలు పూర్తిస్థాయిలో తొలగించడం లేదు. తొలగించినా వాటిని అక్కడే కుప్పలుగా పోస్తున్నారు. వ్యర్థాలు మళ్లీ వరదలు, నాలాల్లోకి చేరుతున్నాయి. దీంతో రెండు, మూడు పర్యాయాలు పూడిక తీయా ల్సి వస్తోంది. దీనివల్ల ప్రజాధనం వృథా అవుతోంది. ఈ యేడాది రూ.45 కోట్లతో జీహెచ్‌ఎంసీ పూడికతీత పనులు చేపట్టింది.  ఇందులో 30-40 శాతం వరకు వృథా ఖర్చే కావడం గమనార్హం. ప్రధాన రహదారులపై పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. మోస్తరు వర్షం పడినా.. అంబర్‌పేట ఛే నెంబర్‌ వద్ద మోకాలి లోతు నీరు నిలుస్తుంది. బతుకమ్మకుంట, శివం రోడ్‌ వైపు నుంచి భారీగా వచ్చే వరద నీరు సాఫీగా వెళ్లే పరిస్థితి లేదు. శివం రోడ్‌ నుంచి ఛే నెంబర్‌ వైపు రోడ్డు పక్కన డ్రెయిన్‌ నిర్మించినా వ్యర్థాలు సక్రమంగా తొలగించక వరద నీరు రోడ్డు పైకి చేరుతోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 


ఆ జోన్లలో అత్యల్పం..

వ్యర్థాల తరలింపు తక్కువగా జరిగిన ప్రాంతాలే అధికంగా ముంపునకు గురవుతున్నాయి. శేరిలింగంపల్లిలో 68 వేల క్యూబిక్‌ మీటర్ల వ్యర్థాలు తొలగించగా, కేవలం 24 వేల క్యూబిక్‌ మీటర్ల వ్యర్థాలు మాత్రమే తరలించారు. ఇది కేవలం 35 శాతం మాత్రమే. ఎల్‌బీనగర్‌ జోన్‌ పరిధిలో దాదాపు 53 వేల క్యూబిక్‌ మీటర్ల వ్యర్థాలు తొలగించగా.. 26 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే తరలించారు. చార్మినార్‌లో 1.31 లక్షల క్యూబిక్‌ మీటర్ల వ్యర్థాలు తొలగించగా.. 70 వేల క్యూబిక్‌ మీటర్లు మాత్రమే తరలించారు. మొత్తంగా గ్రేటర్‌లో తొలగించిన వ్యర్థాల్లో 51 శాతం మాత్రమే తరలించారు. మిగతా 49 శాతంలో 30-35 శాతం వరకు తిరిగి నాలాల్లో చేరుతున్నాయి. 

Updated Date - 2021-10-20T18:01:05+05:30 IST