వ్యాపారాలకే పరిమితం

ABN , First Publish Date - 2021-11-14T17:20:06+05:30 IST

ఇవే కాదు.. నగరంలోని పలు ప్రాంతాల్లో లూ-కెఫేలు వ్యాపారానికే పరిమితమయ్యాయి. పౌరులకు వాష్‌ రూమ్‌లు అందుబాటులో ఉంచాలన్న విషయాన్ని విస్మరించాయి. అదే బాధ్యతతో

వ్యాపారాలకే పరిమితం

నామమాత్రపు అద్దెతో లీజుకు

వారాలు, నెలల తరబడి అందుబాటులో ఉండని టాయిలెట్లు

ప్రజలకు ఉపయోగమేది..? 

ఆ సంస్థల ఆర్థిక ప్రయోజనాల కోసమేనా..? 

గ్రేటర్‌లో 12 పెద్ద, 135 చిన్న లూ-కెఫేలు

ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోన్న సంస్థలు

మంత్రికి కోపమొస్తుందన్న భయంతోనే మిన్నకుంటున్న అధికారులు

లూ-కెఫేలలో పనిచేయని వాష్‌రూమ్‌లు 


ఇవి ఎన్‌టీఆర్‌ మార్గ్‌లో ఉన్న రెండు లూ-కెఫేలు. ఒక్కో కెఫే-లో నిత్యం రూ.20 వేల నుంచి రూ.25వేలు, వారాంతాల్లో అంతకంటే ఎక్కువే వ్యాపారం జరుగుతుంది. ఈ రెండు కెఫేల్లో వాష్‌ రూమ్‌లు రెండు వారాలుగా అందుబాటులో లేవు. అయినా నిర్వాహకులు వాటిని మరమ్మతు చేసే ప్రయత్నం చేయడం లేదు. 


హైదరాబాద్‌ సిటీ: ఇవే కాదు.. నగరంలోని పలు ప్రాంతాల్లో లూ-కెఫేలు వ్యాపారానికే పరిమితమయ్యాయి. పౌరులకు వాష్‌ రూమ్‌లు అందుబాటులో ఉంచాలన్న విషయాన్ని విస్మరించాయి. అదే బాధ్యతతో నామమాత్రపు ధరకు స్థలాన్ని పొందిన ఏజెన్సీలు ఫక్తు వ్యాపారం చేస్తున్నాయి. ప్రజలకు మెరుగైన నిర్వహణతో కూడిన టాయిలెట్లు అందుబాటులోకి తీసుకువచ్చే క్రమంలో ఉభయ కుశలోపరిగా లూ-కెఫేలను మూడేళ్ల క్రితం జీహెచ్‌ఎంసీ తెరపైకి తీసుకువచ్చింది. శేరిలింగంపల్లిలో పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభించి.. పౌరులకు ఉపయుక్తంగా ఉందంటూ నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం గ్రేటర్‌లో 12 పెద్ద లూ-కెఫేలు, 135 మినీ లూ-కెఫేలు ఉన్నాయి. పెద్ద లూ-కెఫేలకు ప్రధాన రహదారుల పక్కన ఫుట్‌పాత్‌లపై 180 నుంచి 320 చ.అ.లు, మినీ లూ-కెఫేలకు 50 నుంచి 100 చ.అ.ల మేర స్థలం కేటాయించారు. నిర్ణీత స్థలంలో మహిళలు, పురుషులకు వేర్వేరుగా వాష్‌రూమ్‌లు ఏర్పాటు చేయాలి. దివ్యాంగులు, వృద్ధులు వినియోగించుకునేందుకు వీలుగా మెట్లు, హ్యాండ్‌ గ్రిల్స్‌, ర్యాంప్‌లు ఉండాలి. వాష్‌ రూమ్‌లను పౌరులు ఉచితంగా వినియోగించుకోవచ్చు. వాష్‌ రూమ్‌లు పరిశుభ్రంగా ఉండేలా నిర్వహణ బాధ్యతలు చేసుకోవాల్సింది ఆయా సంస్థలే. మరి కొంత స్థలంలో కెఫే ఏర్పాటు చేయాలి. టీ, కాపీ, సమోసా, స్నాక్స్‌, తాగునీరు విక్రయించే అవకాశం ఉంటుంది.  


మంత్రి సిఫారసుతో...

ఉచిత వినియోగానికి అవకాశమిస్తు.. వాష్‌రూమ్‌లు నిర్వహిస్తున్నందుకు నామమాత్రపు రుసుముతో లీజుకిచ్చారు.  మాదాపూర్‌, కొండాపూర్‌, బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్క్‌, ఎన్‌టీఆర్‌ మార్గ్‌ తదితర ప్రాంతాల్లో స్థలం కేటాయించారు.  కనీసంగా నెల అద్దెను రూ.99.96గా నిర్ణయించి 12 ప్రాంతాల్లో పెద్ద లూ-కెఫేలను ఓ ఏజెన్సీకి అప్పగించారు. అదే అద్దె ప్రాతిపదికన 15 యేళ్లపాటు లీజు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఓ మంత్రి సిఫారసు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం గతంలో జరిగింది. వాస్తవంగా ఆయా ప్రాంతాల్లో 320 చ.అ.లకు దుకాణాల అద్దె రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటుంది. వాష్‌ రూమ్‌ల నిర్వహణ పట్టించుకోకుండా.. లూ-కెఫేలను వ్యాపార కేంద్రాలుగా మార్చినా జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడం లేదు. ఆయా సంస్థలపై చర్యలు తీసుకుంటే మంత్రికి కోపమొస్తుందన్న భయంతోనే వారి జోలికి వెళ్లడం లేదని తెలుస్తోంది. 


రెట్టింపు స్థలం ఆక్రమించి...

లూ-కెఫేల వద్ద కేటాయించిన విస్తీర్ణం కంటే రెట్టింపు స్థలాన్ని ఆయా సంస్థలు వినియోగించుకుంటున్నాయి. కొనుగోలు చేసే వ్యక్తులు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు, టేబుళ్లను పెద్ద లూ-కెఫేల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఫుట్‌పాత్‌లపై ఉన్న కెఫేల వద్ద ఈ ఏర్పాట్లతో పాదచారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఎన్‌టీఆర్‌ మార్గ్‌లోనే కాదు.. మాదాపూర్‌, కొండాపూర్‌, కేబీఆర్‌ పార్క్‌, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లోనూ లూ-కెఫేల వద్ద ఒక్కోసారి వాష్‌ రూమ్‌లు అందుబాటులో ఉండడం లేదు. వసతుల కల్పన ప్రధానోద్దేశంతో అనుమతినిచ్చిన లూ-కెఫేలను ఏజెన్సీలు వ్యాపార కేంద్రాలుగా మార్చాయి. 

Updated Date - 2021-11-14T17:20:06+05:30 IST