మహా నగరంలో మోసగాళ్లు

ABN , First Publish Date - 2022-01-21T16:15:49+05:30 IST

డబ్బు కోసం ఓ సంపన్నుడి కూతురిని కిడ్నాప్‌ చేసిన రాజస్థాన్‌ ముఠా సభ్యుల ఆటకట్టించారు హైదరాబాద్‌ పోలీసులు...

మహా నగరంలో మోసగాళ్లు

విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న మహానగరంలో మోసగాళ్లు తెగబడుతున్నారు. బతుకుదెరువుకు వచ్చి చెడు వ్యసనాలకు బానిసలవుతూ డబ్బుల కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. వీరిలో చాలామంది చోరీల బాట పడితే మరికొందరు కిడ్నా్‌పలకు తెరతీసే ప్రయత్నాలు చేస్తున్నారు. నగర పోలీసులు వీరిపై ఉక్కుపాదం మోపి కటకటాల వెనక్కి తోస్తున్నారు. 


చేజ్‌ చేస్తున్న పోలీసులు

సంపన్నుడి కుమార్తె కిడ్నాప్‌నకు ప్లాన్‌

జైలుపాలైన రాజస్థాన్‌ ముఠా


హైదరాబాద్‌ సిటీ: డబ్బు కోసం ఓ సంపన్నుడి కూతురిని కిడ్నాప్‌ చేసిన రాజస్థాన్‌ ముఠా సభ్యుల ఆటకట్టించారు హైదరాబాద్‌ పోలీసులు. ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుంచి ఒక పిస్టల్‌, 5 రౌండ్ల బుల్లెట్లు, రెండు బైక్‌లు, 3 మొబైల్‌ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ గురువారం వివరాలు వెల్లడించారు.


రాజస్థాన్‌ రాష్ట్రంలోని జోద్‌పూర్‌కు చెందిన జవారీలాల్‌, విక్రమ్‌లు కొన్నేళ్లక్రితం బతుకుదెరువుకోసం నగరానికి వచ్చారు.  బాచుపల్లిలో హార్డ్‌వేర్‌ వ్యాపారం చేసేవారు. కొద్దిరోజుల తర్వాత చెడు వ్యసనాలకు బానిసలై సంపాదన కోసం అడ్డదారిలో కోట్లు సంపాదించాలనుకున్నారు. అందుకు కోటీశ్వరుడి కూతురుని కిడ్నాప్‌ చేయాలని పథకం వేశారు. కొన్నేళ్ల క్రితం రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చి బల్క్‌ డ్రగ్స్‌ (ఫార్మా) వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించిన మనోజ్‌ సలేచాజైన్‌ను వారు టార్గెట్‌ చేశారు. బోయినపల్లిలో ఉంటున్న మనోజ్‌ గురించి జవారీలాల్‌ పూర్తి వివరాలు సేకరించాడు. ఆయన కుమార్తెను కిడ్నాప్‌ చేసి రూ.కోటి డిమాండ్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. స్నేహితుడు విక్రమ్‌తో కలిసి రూ.30వేలు చెల్లించి మరోస్నేహితుడు మహేంద్రప్రతాప్‌ సింగ్‌ (రాజస్థాన్‌)ద్వారా మధ్యప్రదేశ్‌ నుంచి దేశవాలీ తుపాకీ తెప్పించాడు. ముగ్గురూ కలిసి ద్విచక్ర వాహనాలపై రెక్కీ నిర్వహించారు. ఈనెల 10న 12 గంటల ప్రాంతంలో మనోజ్‌ ఇంటి బయటకు వచ్చిన అతని కుమార్తెను కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నించారు. ఆ యువతి భయపడిపోయి గట్టిగా కేకలు వేసింది. స్థానికులు అప్రమత్తమై కిడ్నాపర్స్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించగా వారు అక్కడి నుంచి పారిపోయారు. 


సాంకేతిక ఆధారాలతో పట్టివేత.. 

బాధితుడు మనోజ్‌ బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న సీపీ సీవీ ఆనంద్‌ నార్త్‌జోన్‌ టీమ్‌ను రంగంలోకి దింపారు. పోలీసులకు ఎలాంటి క్లూస్‌ లభించకపోవడంతో సేకరించిన కొన్ని టెక్నికల్‌ ఎవిడెన్స్‌తో నిందితులు రాజస్థాన్‌కు చెందిన ముఠాగా గుర్తించారు. నిందితులు వీవోఐపీ యాప్‌( వాయిస్‌ వోవర్‌ ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌) ద్వారా వాట్సాప్‌ కాల్స్‌లో మాట్లాడుకున్న ఆధారాలు సేకరించి వారిని అరెస్ట్‌ చేశారు. 


అవి ఇరానీ చైన్‌ స్నాచర్‌ పనే..!

గొలుసు చోరీల కేసులో పోలీసులకు చిక్కిన టెక్నికల్‌ ఎవిడెన్స్‌..

 కమిషనరేట్‌ పరిధిలో బుధవారం వరుస చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడి హడలెత్తించిన గొలుసు దొంగ.. ఇరానీ చైన్‌ స్నాచర్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. తలకు టోపీ పెట్టుకొని, ముఖానికి నల్లటి మాస్కు ధరించి, చేతులు నిండుగా స్వెటర్‌ ధరించి యాష్‌ కలర్‌ యాక్టివాపై ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 వరకు 6 స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటికే సీసీటీవీ కెమెరాలను, ఇతర ఆధారాలను సేకరించారు. లభించిన సాంకేతిక ఆధారాల ప్రకారం మహారాష్ట్ర ఇరానీ గ్యాంగ్‌కు చెందిన ఘరానా దొంగే ఈ గొలుసు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నాందేడ్‌ మీదుగా నగరానికి వచ్చిన నిందితుడు నగరంలో తిష్ఠ వేసి పక్కా పథకం ప్రకారమే స్నాచింగ్‌లకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అతను కచ్చితంగా పాత నేరస్థుడే అని, నగరంపై అతనికి పూర్తిగా పట్టుందని పోలీసులు బృందాలు అభిప్రాయపడుతున్నాయి.


అద్దెకున్న ఇంట్లోనే దొంగతనం రూ.15లక్షల ఆభరణాలు చోరీ

అద్దెకు ఉంటూ ఆ యజమాని ఇంటికే కన్నం వేశారు రాజస్థాన్‌ యువకులు. రూ.15లక్షల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. సైబరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ గురువారం వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌ సికర్‌ జిల్లాకు చెందిన ఇమ్రాన్‌ అన్సారీ, ముఖే్‌షకుమార్‌ సైనీలు బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి చాంద్రాయణగుట్టకు చెందిన ముక్రం ఇంటి పెంట్‌హౌస్‌లో ఉంటున్నారు. ఇటీవల ఇంటి యజమాని కుటుంబంతో సహా కెనడాకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన ఆ యువకులు ఆ ఇంట్లోకి చొరబడి రూ.15లక్షల విలువైన బంగారం దోచేశారు. ఫిర్యాదు అందుకున్న సౌత్‌జోన్‌ పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి టెక్నికల్‌ ఎవిడెన్స్‌ సేకరించారు. నిందితులతో పాటు బంగారం కొనుగోలు చేసిన దీన్‌దయాళ్‌ ప్రజాపతి అలియాస్‌ బోళాను అరెస్టు చేశారు. 

Updated Date - 2022-01-21T16:15:49+05:30 IST