
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ఎమ్మెల్సీ గోరెటి
అట్టహాసంగా ముగిసిన ఉస్మానియా తక్ష్-2022
హైదరాబాద్ సిటీ: సాధారణ జీవితం గడిపేవారే సృజనశీలురని కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న అన్నారు. ఉస్మానియా తక్ష్-2022 ముగింపు సందర్భంగా యూనివర్సిటీలోని ల్యాండ్స్కే్పలో శనివారం సాయంత్రం జరిగిన సాంస్కృతిక వేడుకలకు ముఖ్య అతిథిగా గోరెటి హాజరై మాట్లాడారు. వర్సిటీలకు అకాడమీ ప్రమాణాలు ఎంత ముఖ్యమో.. సమాజంలో మానవ ప్రమాణాలు, విలువలు అంతే ముఖ్యమని తెలిపారు. మార్కెట్ ఎకానమి మూలంగా కళలు ధ్వంసమవుతున్నాయన్నారు. తన కవిత్వం, పాటలు, మాటలతో విద్యార్థులను ఆయన హుషారెత్తించారు. వీసీ రవీందర్ మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీకి విద్యార్థులుగా వచ్చి ఉద్యోగులుగా వెళ్లాలని కోరారు. వర్సిటీలో వివిధ పోటీ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్‌ను 800ల మందికి సరిపడేలా తీర్చిదిద్దుతున్నామని, ఈ నెల 29న ప్రారంభిస్తామని తెలిపారు. ఈ నెల 13న ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో గోరెటి వెంకన్న రాసిన వ్యాసంలోని పలు విషయాలను విద్యార్థులతో వైస్ చాన్స్‌లర్ పంచుకున్నారు. కార్యక్రమంలో ప్రముఖ నృత్యకారిణి రాధామోహన్ ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలకు ల్యాండ్‌స్కేప్ ప్రాంగణం ఈలలు, చప్పట్లతో మార్మోగింది. కార్యక్రమంలో రిజిస్ర్టార్ లక్ష్మీనారాయణ, ఓఎస్డీ రెడ్యానాయక్ పాల్గొన్నారు.