Hyderabad శివార్లలో ‘రక్తచరిత్ర’.. జంటహత్యల వెనుక నయూమ్‌ ముఠా..!?

ABN , First Publish Date - 2022-03-02T14:43:18+05:30 IST

Hyderabad శివార్లలో ‘రక్తచరిత్ర’.. జంటహత్యల వెనుక నయూమ్‌ ముఠా..!?

Hyderabad శివార్లలో ‘రక్తచరిత్ర’.. జంటహత్యల వెనుక నయూమ్‌ ముఠా..!?

హైదరాబాద్ సిటీ/రంగారెడ్డి జిల్లా : నగర శివార్లలో మంగళవారం జరిగిన రియల్టర్ల జంట హత్యల కేసు తీవ్ర కలకలం రేపింది. ముందస్తు ప్రణాళికతో వారిని కిరాతకంగా కాల్చిచంపడం వెనుక కిరాయి ముఠాహస్తం కూడా ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. హత్యకు గురైన రాఘవేంద్రరెడ్డి కూడా ఓ కేసులో జైలు శిక్ష అనుభవించినట్లు తెలుస్తోంది. నగర శివార్లలో భూముల ధరలు అమాంతంగా పెరగడంతో రియల్‌ ఎస్టేట్‌ దందాలు కూడా పెరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో భూవివాదాల్లో రాజకీయనేతలు, మాఫీయా కూడా తలదూర్చుతుండడంతో ఘర్షణలు, హత్యలు చోటుచేసుకుంటున్నాయి.


సులువుగా డబ్బుసంపాదించేందుకు నేరస్థులు ఈ రంగాన్ని వాడుకుంటున్నారు. నగర, శివారు ప్రాంతాల్లో జరిగే అనేక భూవివాదాలు, సెటిల్‌మెంట్ల వెనుక వీరే ఉంటున్నారు. అలాగే అనేక చోట్ల కొందరు పోలీసులు కూడా భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్న బడా నేతలు. అధికారుల బాగోతంపై గత ఏడాది ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. దీంతో కొందరు తాత్కాలికంగా వెనుకకు తగ్గారు.


ఖాళీ జాగా కనిపిస్తే.. 

డబ్బు, స్థానికంగా పలుకుబడి ఉన్న వారు రియల్‌ ఎస్టేట్‌ దందాలకు దిగుతున్నారు. గతంలో క్రయవిక్రయాలు జరిగిన భూములు ఖాళీగా ఉంటే వాటిలో గద్దల్లా వాలిపోతున్నారు. ముఖ్యంగా శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌, మొయినాబాద్‌, సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌, మహేశ్వరం, షాద్‌నగర్‌,  కుత్బుల్లాపూర్‌, కీసర, ఘట్‌కేసర్‌, మేడ్చల్‌ తదితర మండలాల్లో భూవివాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో అడ్డగోలుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. లేని వివాదాలను సృష్టిస్తున్నారు. వీటిని తామే పరిష్కరిస్తామంటూ ముందుకు వస్తున్నారు. అధికారులు, పోలీసులు, రాజకీయ నేతలతో సంబంధాలు పెట్టుకుని ఈ దందా చేస్తున్నారు.


కిరాయి ముఠాలు.. 

కొందరు రియల్టర్లు తమ దందాకు అడ్డువస్తే ఏదో కేసులో ఇరికించడం, హత్యలు చేయడానికి సైతం వెనుకాడటం లేదు. ఇందుకోసం కిరాయి ముఠాలను రంగంలో దించుతున్నారు. మంగళవారం జరిగిన హత్యల వెనుక సుపారి గ్యాంగ్‌ ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పాయింట్‌ బ్లాంక్‌లో కాల్పులు జరిపిన తీరును బట్టి రాటుదేలిన ముఠానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ జంట హత్యలు వెనుక నయూమ్‌ ముఠా పాత్ర ఉందనే అనుమానాలను కూడా వ్యక్తం కావడంతో పోలీసులు ఆ కోణంలో విచారిస్తున్నారు.


గతంలోనూ.. 

నగర శివారు ప్రాంతాల్లో  రియల్‌ ఎస్టేట్‌ భాగస్వాముల మధ్య కూడా విభేదాలు తలెత్తి హత్యలు జరిగాయి. గత ఏడాది బాలాపూర్‌లో ఇద్దరు రియల్టర్ల మధ్య జరిగిన విభేదాలు కారణంగా అమాయకుడు బలయ్యాడు. సుపారి తీసుకున్న వాళ్లు చంపాల్సిన వ్యక్తిని కాకుండా అదే రంగు షర్ట్‌ వేసుకున్న మరొకరిని కత్తులతో పొడిచి హత్యచేశారు. 2019లో పహడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇద్దరు రియల్‌ ఎస్టేట్‌ భాగస్వాముల మధ్య గొడవ జరిగి మహ్మద్‌సాదీ అనే వ్యక్తిని హత్యచేశారు.  2019 డిసెంబర్‌లో ఓల్డ్‌ బోయినపల్లిలో భూవివాదంలో అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకున్నారు. చివరికి వీరి అండతో ఓ వర్గం వారు మరో వర్గంపై దాడిచేశారు. అయితే ఆ సమయంలో అడ్డువచ్చిన అమాయకుడైన వాచ్‌మన్‌కు నిప్పంటించారు.

Updated Date - 2022-03-02T14:43:18+05:30 IST