కరోనాపై అలుపెరుగని యుద్ధం.. వ్యాక్సినేషన్‌ పూర్తి

ABN , First Publish Date - 2021-06-13T16:51:56+05:30 IST

మూడు పోలీసు కమిషనరేట్‌ల పరిధుల్లో ఉన్నతాధికారులు ప్రణాళికాబద్ధంగా

కరోనాపై అలుపెరుగని యుద్ధం.. వ్యాక్సినేషన్‌ పూర్తి

  • రాచకొండ, సైబరాబాద్‌లో రెండు దశల్లో...
  • 2 వేల మందికి పైగా వైరస్‌
  • కోలుకున్న సిబ్బంది
  • సకాలంలో వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన సీపీలు

హైదరాబాద్‌ సిటీ : మూడు పోలీసు కమిషనరేట్‌ల పరిధుల్లో ఉన్నతాధికారులు ప్రణాళికాబద్ధంగా వవ్యహరించి సిబ్బందికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేయించారు. గర్భిణులు, అనారోగ్య సమస్యలున్న వారిని మినహాయిస్తే వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. వ్యాక్సిన్‌ వేసిన కారణంగా మహమ్మారి నుంచి ఎంతో మంది తప్పించుకున్నారు. ఎవరికైనా కరోనా సోకినా త్వరగానే కోలుకున్నారు. రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పదిహేను రోజుల వ్యవధిలోనే 98శాతం మొదటి డోస్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి చేశారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో సిబ్బంది ఎక్కువగా ఉండటంతో సుమారు నెలరోజుల పాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగించి, 98శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేశారు.


వ్యాక్సినేషన్‌ తర్వాత తక్కువ మందికి కరోనా.. 

రెండో దశలో ట్రై కమిషనరేట్‌ పరిధిలో 3,250 మంది కరోనా బారిన పడ్డారు.  అప్పటికే మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడంతో రెండు మూడు రోజులకు మించి సిబ్బంది ఇబ్బంది పడలేదు. వారం రోజుల లోపే నెగిటివ్‌ వచ్చి కోలుకున్నారు.  రెండో డోస్‌ పూర్తియిన వారిలో అతి తక్కువ మంది పోలీస్‌ సిబ్బంది మాత్రమే కరోనా బారినపడ్డారు. అయినా ఎలాంటి లక్షణాలూ లేకపోవడం, రోగనిరోధక శక్తి బాగా ఉండటం, యాంటీబాడీస్‌ పుష్కలంగా ఉండటంతో మూడు నాలుగు రోజుల వ్యవధిలోనే రికవరీ అయ్యారు. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి విధుల్లో చేరారు.


100 శాతం రికవరీ రేటు

ట్రై కమిషనరేట్‌ పరిధిలో మొదటి దశలో సుమారు 5,800 మందికి పైగా పోలీస్‌ సిబ్బంది కరోనా బారినపడ్డారు. పాత అనారోగ్య సమస్యలున్న ఒకరిద్దరు సిబ్బంది మినహా.. రాచకొండ సైబరాబాద్‌లో మొదటి దశలో పోలీసులు 100 శాతం రికవరీ రేటు సాధించారు. కానీ హైదరాబాద్‌ కమిషనరేట్‌లో 44 మంది మృత్యువాత పడ్డారు.

Updated Date - 2021-06-13T16:51:56+05:30 IST