2019 లో జరిగిన ఘటనపై వినియోగదారుల ఫోరం తీర్పు ఇదీ..

ABN , First Publish Date - 2021-07-29T18:34:12+05:30 IST

ఢిల్లీ వెళ్లి వచ్చేందుకు 2019 ఫిబ్రవరిలో మేక్‌ మై ట్రిప్‌ సైట్‌లో

2019 లో జరిగిన ఘటనపై వినియోగదారుల ఫోరం తీర్పు ఇదీ..

హైదరాబాద్‌ సిటీ : సాంకేతిక కారణాలు ఏమైనా వినియోగదారుడికి జరిగిన నష్టాన్ని సేవలందించిన సంస్థ భరించాలని వినియోగదారుల ఫోరం స్పష్టం చేసింది. జూబ్లీహిల్స్‌కు చెందిన ఆర్‌ఎస్‌ గోయల్‌ ఎప్పుడు విమాన టికెట్‌లు కావాలన్నా మేక్‌ మై ట్రిప్‌ ద్వారా బుక్‌ చేసుకునేవాడు. ఢిల్లీ వెళ్లి వచ్చేందుకు 2019 ఫిబ్రవరిలో మేక్‌ మై ట్రిప్‌ సైట్‌లో టికెట్‌ల కోసం ప్రయత్నించాడు. రూ. 6,587 ఆన్‌లైన్‌ పేమెంట్‌ పూర్తయిన తర్వాత వెబ్‌పేజీ తిరిగి మొదటికి రావడంతో పలుమార్లు ప్రయత్నించి వదిలేశాడు. అనంతరం యాత్రా డాట్‌ కామ్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. తర్వాత మేక్‌ మై ట్రిప్‌ నుంచి కూడా టికెట్లు బుక్‌ అయ్యాయని సందేశం వచ్చింది.


ఒకేరోజు రెండు టికెట్లు బుక్‌ అవడంతో మేక్‌ మై ట్రిప్‌ ద్వారా బుక్‌ అయిన టికెట్లను రద్దు చేయాలని కోరాడు. పలుమార్లు సంప్రదించగా క్యాన్సిలేషన్‌ ఖర్చులు పోగా రూ. 834 వాపస్‌ చేశారు. దాంతో బాధితుడు టికెట్‌ డబ్బుతోపాటు రూ. 4 లక్షల పరిహారం కోరుతో వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. టికెట్‌ కోసం డబ్బులు చెల్లించిన తర్వాత వేచి చూడకుండా వేరేచోట టికెట్‌ కొనుగోలు చేశారని.. సాంకేతిక కారణాల వల్ల పేమెంట్‌ పూర్తయిన నిమిషాల వ్యవధిలో టికెట్‌ కన్ఫర్మేషన్‌ వచ్చిందని.. టికెట్‌ క్యాన్సిల్‌ చార్జీలు మినహాయించి మిగతాడబ్బు తిరిగిచ్చామని.. మేక్‌ మై ట్రిప్‌ ప్రతినిధులు కోర్టుకు తెలిపారు.


తాము వినియోగదారుడికి.. సేవాసంస్థకు వారధిలా పనిచేస్తామన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సాంకేతిక కారణాలకు వినియోగదారుడు బాధ్యత వహించడని తేల్చి చెప్పింది. 45 రోజుల వ్యవధిలో రూ. 5,753 తిరిగి చెల్లించాలని వినియోగదారుల ఫోరం-2 ప్రెసిడెంట్‌ జస్టిస్‌ వక్కంటి నర్సింహారావు, సభ్యులు జస్టిస్‌ పీవీటీఆర్‌ జవహర్‌బాబు, జస్టిస్‌ ఆర్‌ఎస్‌ రాజశ్రీతో కూడిన ధర్మాసనంతీర్పు వెలువరించింది. మానసిక వేదనకు గురిచేసినందుకు రూ. 1,500, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ. 1000 చెల్లించాలని ఆదేశించింది.

Updated Date - 2021-07-29T18:34:12+05:30 IST