కార్ల అద్దె పేరుతో హైదరాబాద్‌లో ఘరానా మోసం

ABN , First Publish Date - 2021-06-15T18:01:00+05:30 IST

‘‘మీ కారును నాకు లీజుకు ఇవ్వండి. మీరు ప్రతినెలా దానిపై సంపాదిస్తున్న దానికి

కార్ల అద్దె పేరుతో హైదరాబాద్‌లో ఘరానా మోసం

  • రెట్టింపు ఆదాయం ఇస్తానని కుచ్చుటోపీ
  • 272 కార్లను సేకరించిన ‘సాఫ్ట్‌వేర్‌’ ముఠా
  • 67 కార్లను సగం ధరకే అమ్మేసిన కేటుగాళ్లు
  • ఆరుగురి అరెస్టు.. 50 కార్ల స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ : ‘‘మీ కారును నాకు లీజుకు ఇవ్వండి. మీరు ప్రతినెలా దానిపై సంపాదిస్తున్న దానికి రెట్టింపు ఆదాయం ఇస్తాను’’ అంటూ కార్ల యజమానులు, ట్రావెల్‌ ఏజెంట్లను మోసగించిన ఓ ముఠా గుట్టును సైబరాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురానికి చెందిన పల్లె నరేశ్‌కుమార్‌ అలియాస్‌ నరేశ్‌యాదవ్‌ ఎంటెక్‌ చదివాడు. చేవెళ్లలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఆ కంపెనీ యాజమాన్యం పదుల సంఖ్యలో కార్లు అద్డెకు తీసుకోవడం.. ట్రావెల్‌ ఏజెంట్లకు ప్రతినెలా రూ. లక్షలు చెల్లిస్తుండడాన్ని గమనించాడు.


దాంతో.. ట్రావెల్‌ వ్యాపారానికి తెరతీశాడు. తన స్నేహితులు బదావత్‌ రాజూనాయక్‌, కలుముల వికాస్‌, గొల్లె భరత్‌ జోషి,  భానూరి ఎలక్షన్‌ రెడ్డి, తాళ్ల నర్సింహాగౌడ్‌తో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించాడు. వీరంతా పైసా పెట్టుబడి లేకుండా.. ట్రావెల్‌ ఏజెంట్లు, కార్ల యజమానులకు రెట్టింపు ఆదాయం ఇస్తామని నమ్మించి, 272 కార్లను సేకరించారు. రెండు నెలలు ఒప్పందం ప్రకారమే అద్దెలు చెల్లించారు. భారీగా లాభం వస్తుండడంతో జల్సాలకు అలవాటు పడ్డారు. చూస్తుండగానే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి, యజమానులకు అద్దె చెల్లించలేని స్థితికి చేరుకున్నారు. దాంతో.. 205 కార్లకు సంబంధించిన యజమానులు, ట్రావెల్‌ ఏజెంట్లు.. తమ వాహనాలను తిరిగి తీసుకుపోయారు. 


డబ్బుకోసం మిగతా 67 కార్లను ఈ ముఠా తెలిసిన వారికి విక్రయించింది. ‘‘ఆర్టీయే/పోలీసు అధికారులు సీజ్‌ చేసిన కార్లను వేలంలో కొన్నాం. డాక్యుమెంట్లు క్లియర్‌ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. అందుకే తక్కువ ధరకే అమ్మేస్తున్నాం’’ అని నమ్మబలికాడు. ఇలా ఈ ముఠా అమ్మేసిన 67 కార్ల విలువ రూ. 4.3 కోట్లుగా ఉంటుందని సీపీ సజ్జనార్‌ తెలిపారు. రామచంద్రాపురానికి చెందిన రాపోలు ఆదిత్య అనే వ్యక్తి ఈ ముఠాకు 11 కార్లను అద్దెకిచ్చాడని, అద్దె ఎగ్గొట్టడం, కార్లను తిరిగి ఇవ్వకపోవడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ముఠా ఆటను కట్టించి, ఆరుగురిని అరెస్టు చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించామని, మొత్తం 50 కార్లను సీజ్‌ చేశామని సీపీ చెప్పారు. నిందితులను మరోసారి కస్టడీలోకి తీసుకుని, మిగతా 17 కార్లను కూడా సీజ్‌ చేస్తామని వివరించారు.

Updated Date - 2021-06-15T18:01:00+05:30 IST