Drugs తీసుకున్నా.. వదలం.. : సీపీ సీవీ ఆనంద్‌ స్ట్రాంగ్ వార్నింగ్..

ABN , First Publish Date - 2022-02-27T16:52:54+05:30 IST

మాదకద్రవ్యాలు సేవించే వారిని అరెస్ట్‌ చేసి, కేసులు నమోదు చేశారు నగర సీపీ సీవీ ఆనంద్‌...

Drugs తీసుకున్నా.. వదలం.. : సీపీ సీవీ ఆనంద్‌ స్ట్రాంగ్ వార్నింగ్..

  • కాలేజీలు.. విద్యాసంస్థల్లో వినియోగం
  • అప్రమత్తం కావాలని సూచన
  • మూడు కేసుల్లో పలువురి అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ : మాదకద్రవ్యాలు సేవించే వారిని అరెస్ట్‌ చేసి, కేసులు నమోదు చేశారు నగర సీపీ సీవీ ఆనంద్‌. అరెస్ట్‌ అయిన వారిలో ఐటీ ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు ఉన్నారు. కమిషనర్‌ కార్యాలయంలో శనివారం సీసీ సీవీ ఆనంద్‌ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని పలు కాలేజీలు, విద్యాసంస్థల్లో డ్రగ్స్‌ వినియోగం జరుగుతున్నట్లు పక్కా సమాచారం ఉందని, తాము అరెస్ట్‌లు చేయకముందే యాజమాన్యాలు, తల్లిదండ్రులు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్ధుల భవిష్యత్‌ నాశనం చేయాలన్న ఉద్దేశం తమకు లేదని, డ్రగ్స్‌ను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తప్పవన్నారు. డార్క్‌ వెబ్‌ కొనుగోళ్లపై కూడా తమ నిఘా ఉందని హెచ్చరించారు. హైదరాబాద్‌ నార్కొటిక్‌ ఇన్వెస్టిగేషన్‌ సూపర్‌విజన్‌ వింగ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్‌తోపాటు, హాష్‌ఆయిల్‌, గంజాయి విక్రేతలు, సరఫరాదారులతోపాటు వినియోగదారులను కూడా అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. 


నైజీరియన్‌తోపాటు డ్రగ్‌ ముఠా.. 

యాప్రాల్‌కు చెందిన స్టాక్‌మార్కెట్‌ ట్రేడర్‌ జ్వాలా పాండే అలియాస్‌ సిద్దార్థ పాండే (25) ఎండీఎంఏతోపాటు హాష్‌ఆయిల్‌, గంజాయి విక్రయిస్తున్నాడు. నైజీరియన్‌ నికోలస్‌ ఓలుసోలా రోటిమీ(33) నుంచి ఎండీఎంఏ, విశాఖకు చెందిన యశ్వంత్‌, ఈస్ట్‌మారేడ్‌పల్లికి చెందిన డీజే ప్లేయర్‌ నిఖిల్‌ షెనాయ్‌ (33)నుంచి  హాష్‌ఆయిల్‌, అదిలాబాద్‌కు చెందిన లఖన్‌, సోనేరావ్‌ నుంచి గంజాయి కొనుగోలు చేస్తుంటాడు. ఆదిలాబాద్‌కు చెందిన అమర్‌సింగ్‌ (37), ఉల్లాస్‌ సాబ్లే (25), సంకరమ్‌ సాబ్లే (25), గోతి హరిసింగ్‌ (50) ఈ గంజాయిని నగరానికి తరలిస్తున్నారు. అయితే, ఓ ఆస్పత్రుల అసిస్టెంట్‌ మేనేజర్‌గా పని చేస్తున్న కాకతీయనగర్‌కు చెందిన ఆదిత్యరాజన్‌, కొండాపూర్‌కు చెందిన విద్యార్థి జయబాలాజీలు సంతోష్‌ నుంచి డ్రగ్స్‌, గంజాయి, హాష్‌అయిల్‌ కొనుగోలు చేస్తారు. ఓయో రూముల్లో పార్టీలు నిర్వహించి ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు విక్రయిస్తున్నారు.


బంజారాహిల్స్‌కు చెందిన ప్రిమియా ఆస్పత్రి వైద్యుడు మహ్మద్‌ మద్‌నే (28), మాదాపూర్‌కు చెందిన ఐటీ ఉద్యోగిసాయి అనిరుధ్‌ (23), మియాపూర్‌కు చెందిన కుష్‌ మిశ్రా (23), శేరిలింగంపల్లికి చెందిన సిద్దార్ద్‌ విజయ్‌ కుమారన్‌ (35), నిజాంపేటకు చెందిన రోహిత్‌కుమార్‌ (24), గంగారానికి చెందిన బాలాజీ భగవాన్‌ సింగ్‌(29)తోపాటు మరో ఇద్దరు కొనుగోలు చేస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న నార్కొటిక్‌ ఇన్వెస్టిగేషన్‌ సూపర్‌ విజన్‌ వింగ్‌ అధికారులతోపాటు కార్ఖానా పోలీసులు నైజీరియన్‌ నికోల్‌సతోపాటు 9 మంది సరఫరాదారులను, ఆరుగురు వినియోగదారులను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 10 గ్రాముల ఎండీఎంఏ, 100 గ్రాముల హాష్‌ ఆయిల్‌, 8 కిలోల గంజాయి, 9 సెల్‌ఫోన్లు మొత్తం రూ. 5.4 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 


గంజాయి డోర్‌ డెలివరీ.. 

ధూల్‌పేటకు చెందిన మహేందర్‌ సింగ్‌ అలియాస్‌ ధరమ్‌ సింగ్‌ (35) ఫోన్‌లో ఆర్డర్‌ తీసుకుని గంజాయిని ఇంటి వద్దకే డెలివరీ చేస్తున్నాడు. కాచిగూడకు చెందిన లఖానీ జితేన్‌ (25), సీతాఫల్‌మండికి చెందిన నుడుపుపాటి రమ్య సిద్దార్ధ (30), గచ్చిబౌలికి చెందిన అనీ్‌షకుమార్‌ (35), బాలానగర్‌కు చెందిన చిటుకుల సమర సింహారెడ్డి (31) గంజాయి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ధరమ్‌సింగ్‌తో పాటు కొనుగోలుదారులను అరెస్ట్‌ చేసి వారి నుంచి  1.50 లక్షల విలువైన 2.5 కిలోల గంజాయి, యాక్టివా వాహనం, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.


ఎల్‌ఎస్డీ విక్రయిస్తున్న హెచ్‌సీయూ విద్యార్థి.. 

గాజులరామారం ప్రాంతానికి చెందిన సాయి విగ్నేష్‌ హెచ్‌సీయూ విద్యార్థి. డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. అవి అందుబాటులో లేకపోవడంతో ఈ ఏడాది డార్క్‌వెబ్‌ ద్వారా రూ. 12 వేలు వెచ్చించి 20 ఎల్‌ఎస్డీ బ్లాట్‌లు కొనుగోలు చేశాడు. వాటిని స్నేహితులైన అనుదీప్‌, నిఖిల్‌, ప్రీతం, వంశీ, రాహుల్‌, తేజ, శుష్మ, ఎలిజబెత్‌లతో కలిసి సేవించాడు.  ఫిబ్రవరిలో మరో 20 ఎల్‌ఎస్డీ బ్లాట్లను ఆర్డర్‌ చేసి, రూ. 36 వేల చొప్పున విక్రయించడం ప్రారంభించాడు. సమాచారం అందుకున్న నార్కొటిక్‌ ఇన్వెస్టిగేషన్‌ సూపర్‌విజన్‌ వింగ్‌ అధికారులు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. అమీర్‌పేట మైత్రీ వనం వద్ద డ్రగ్స్‌ విక్రయిస్తుండగా, సాయివిగ్నే్‌షతో పాటు కొనుగోలు చేసేందుకు వచ్చిన కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన విద్యార్ధులు సాయి చైత్ర, నాగార్జున, ఐటీ ఉద్యోగులు హేమంత్‌, అనుదీప్‌, సాయిబాలజీ, తేజస్వీ కుమార్‌లను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ. 3లక్షల విలువైన 19 ఎల్‌ఎస్‌డీ బ్లాట్లు, ల్యాప్‌టాప్‌, 5 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2022-02-27T16:52:54+05:30 IST