ind vs aus: హైదరాబాద్‌లో జరిగే ఇండియా-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్లపై గొడవకు ఫుల్‌స్టాప్.. టికెట్లు కావాలంటే..

ABN , First Publish Date - 2022-09-22T04:18:24+05:30 IST

ఇండియా-ఆస్ట్రేలియా హైదరాబాద్ వేదికగా జరగనున్న టీ20 క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు గురువారం నుంచి మొదలుకానున్నట్లు..

ind vs aus: హైదరాబాద్‌లో జరిగే ఇండియా-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్లపై గొడవకు ఫుల్‌స్టాప్.. టికెట్లు కావాలంటే..

హైదరాబాద్‌: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్ వేదికగా జరగనున్న టీ20 క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు గురువారం నుంచి మొదలుకానున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జంఖానా గ్రౌండ్‌లో టికెట్ల అమ్మకాలకు కౌంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు హెచ్‌సీఏ ప్రతినిధులు తెలిపారు. ఒక వ్యక్తికి రెండు టికెట్లు మాత్రమే విక్రయించడం జరుగుతుందని, టికెట్లు కొనేవారికి ఆధార్‌ కార్డు తప్పనిసరి అని హెచ్‌సీఏ స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా మ్యాచ్ టికెట్ల అమ్మకాలపై అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఫ్యాన్స్ డిమాండ్‌తో హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్‌ దిగిరాక తప్పలేదు. సెప్టెంబర్ 25న ఉప్పల్‌లో ఇండియా-ఆస్ట్రేలియా టీ20 ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది.



టీ-20 టికెట్లపై జరిగిన గొడవ ఏంటంటే..

టీ - 20 మ్యాచ్‌ టికెట్ల కోసం క్రికెట్‌ అభిమానులు సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్‌ వద్ద ఆందోళన చేపట్టారు. సెక్యూరిటీ సిబ్బంది లాఠీచార్జి చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నెల 25న ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ క్రికెట్‌ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య టీ 20 మ్యాచ్‌ జరగనుంది. మ్యాచ్‌ టికెట్లు సికింద్రాబాద్‌ జింఖానా హెచ్‌సీఏ కార్యాలయంలో మంగళవారం నుంచి లభిస్తాయని సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నగరంతో పాటు, వివిధ జిల్లాల నుంచి క్రికెట్‌ అభిమానుల తెల్లవారు జాము నుంచే గ్రౌండ్‌ వద్ద బారులు తీరారు. సెక్యూరిటీ సిబ్బంది గేట్లకు తాళాలు వేయడంతో గోడ దూకి లోపలికి దూసుకెళ్లారు. సెక్యూరిటీ గార్డులు లాఠీలకు పని చెప్పడంతో ఎక్కడి వాళ్ళు అక్కడ చెల్లాచెదురై బయటికి  పరుగులు తీశారు. దీంతో లంబా టాకీస్‌ రోడ్డుపై ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.


తాళాలు తీసే వరకు ఇక్కడే ఉంటాం..

టికెట్లు ఇస్తారా, లేదా అని క్రికెట్‌ అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయం తాళాలు తీసేవరకు ఇక్కడే ఉంటామన్నారు. హెచ్‌సీఏకు, అజారుద్దీన్‌కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టికెట్ల కోసం ఈ నెల 14 నుంచి తిరుగుతున్నామని, ఎప్పుడు ఇస్తారో స్పష్టంగా చెప్పడం లేదని మండిపడుతున్నారు. ఎట్టకేలకు హెచ్‌సీఏ తాజా నిర్ణయంతో అభిమానులు శాంతించారు.

Updated Date - 2022-09-22T04:18:24+05:30 IST