Hyderabad : ఈ ఏడాది అత్యాచారాలు పెరిగాయ్‌!

ABN , First Publish Date - 2021-12-28T13:44:33+05:30 IST

ఈ ఏడాది అత్యాచారాలు పెరిగాయ్‌!

Hyderabad : ఈ ఏడాది అత్యాచారాలు పెరిగాయ్‌!

  • రాచకొండలో తొమ్మిది శాతం పెరిగిన నేరాలు
  • 123 మంది చిన్నారి పెళ్లి కూతుళ్లకు.. రక్షణ కల్పించిన షీటీమ్స్‌
  • వార్షిక నివేదిక వెల్లడించిన సీపీ మహేష్‌ భగవత్‌

హైదరాబాద్‌ సిటీ : రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఏడాది క్రైమ్‌ రేట్‌ తొమ్మిది శాతం పెరిగింది. సైబర్‌ క్రైమ్‌ 123 శాతం పెరిగింది. నాగోల్‌లోని దేవికా కన్వెన్షన్‌ హాల్లో సోమవారం రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ వార్షిక నివేదిక వివరాలు వెల్లడించారు. శక్తివంచన లేకుండా సిబ్బంది నిబద్ధతతో పని చేసి శాంతి భద్రతల పరిరక్షణలో సక్సెస్‌ అయినట్లు తెలిపారు. గతేడాది కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా కొంత క్రైమ్‌ రేట్‌ తగ్గగా, ఈ ఏడాది పెరిగిందన్నారు. వచ్చిన పిటిషన్‌ను కేసు కట్టి బాధితులకు న్యాయం చేయాలని ప్రయత్నించడమే అందుకు కారణమన్నారు. గతేడాది 19857 కేసులు నమోదైతే, ఈ ఏడాది 21,685 కేసులు నమోదైనట్లు వెల్లడించారు.


మహిళలపై పెరిగిన వేధింపులు

ఈ ఏడాది మహిళలపై అత్యాచారాలు, వేధింపులు, కిడ్నాపులు పెరిగాయి. వరకట్న చావులు కొంతమేర తగ్గాయి. గతేడాది 17 మంది మహిళలు హత్యకు గురికాగా, ఈ ఏడాది 11 మంది హత్యకు గురయ్యారు. మహిళలపై జరిగిన దాడులు, వేధింపుల కేసుల్లో 377 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో 368 మంది బాధితులకు తెలిసిన వారే కావడం గమనార్హం. 2019లో 82, 2020లో 82, 2021లో 171 మందిపైనా పీడీయాక్టు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు.


అక్రమ రవాణాపై ఉక్కుపాదం..

యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ టీమ్‌ 198 మంది నేరస్థులను అరెస్టు చేసి 249 మందిని నిందితుల చెర నుంచి రక్షించింది. 56 మంది ఘరానా నేరగాళ్లపై పీడీయాక్టు నమోదు చేసింది. కాగా, నేరం జరిగిన చోటే పోలీసులు ఆన్‌లైన్‌లో పెటీ కేసు నమోదు చేస్తున్నారు. చార్జిషీటు దాఖలు చేసి, వెంటనే కోర్టులో హాజరు పరుస్తున్నారు. ఈ ఏడాది 1,12,866 ఈ పెట్టీ కేసులు నమోదు చేశారు. 


డ్రగ్స్‌పై ప్రత్యేక డ్రైవ్‌

డ్రగ్స్‌ అడ్డుకట్టకు రాచకొండ పరిధిలో ప్రత్యేక డ్రైవ్‌ కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది 93 కేసులు నమోదు చేసిన పోలీసులు 175 మంది స్మగ్లర్స్‌ను కటకటాల్లోకి నెట్టారు. 5779.791 కేజీల గంజాయి, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. 


శిక్షల్లో నెంబర్‌ వన్‌

నేరస్థులకు శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవడంలో రాచకొండ  కమిషనరేట్‌ నాలుగేళ్లుగా తెలంగాణలోనే మొదటి స్థానంలో నిలిచిందని కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు. వివిధ కేసుల్లో నిందితులకు 2018లో 55 శాతం, 2019లో 66 శాతం, 2020లో 51 శాతం శిక్షలు పడగా ఈ ఏడాది 55 శాతం నిందితులకు కోర్టులు శిక్షలు విధించాయన్నారు. ఈ ఏడాదిలో 4 సార్లు నేషనల్‌ లోక్‌ అదాలత్‌లు ఏర్పాటు చేసి 8836 కేసులు పరిష్కరించి తెలంగాణలో మొదటి స్థానంలో ఉన్నామన్నారు.

Updated Date - 2021-12-28T13:44:33+05:30 IST