యువతే గురి.. అడ్డా సిలిగురి..

ABN , First Publish Date - 2020-11-24T17:36:14+05:30 IST

అందమైన అమ్మాయిలతో డేటింగ్‌ చేస్తారా..? హాట్‌ హాట్‌ స్నేహం కావాలా..? అయితే వెంటనే మా వెబ్‌సైట్‌లో మీ పేరును రిజిస్టర్‌ చేసుకోండి. మీ పూర్తి సంతృప్తికి మా పూర్తి గ్యారంటీ! ఇదీ.. సోషల్‌ మీడియాలో ఆ కేటుగాళ్లు ఇచ్చే ప్రకటన. ఆకర్షితులైన యువత ఆయా వెబ్‌సైట్లు లేదా అప్లికేషన్లు...

యువతే గురి.. అడ్డా సిలిగురి..

హైదరాబాద్‌ : అందమైన అమ్మాయిలతో డేటింగ్‌ చేస్తారా..? హాట్‌ హాట్‌ స్నేహం కావాలా..? అయితే వెంటనే మా వెబ్‌సైట్‌లో మీ పేరును రిజిస్టర్‌ చేసుకోండి. మీ పూర్తి సంతృప్తికి మా పూర్తి గ్యారంటీ! ఇదీ.. సోషల్‌ మీడియాలో ఆ కేటుగాళ్లు ఇచ్చే ప్రకటన. ఆకర్షితులైన యువత ఆయా వెబ్‌సైట్లు లేదా అప్లికేషన్లు తెరవగానే అందమైన అమ్మాయిల ఫొటోలతో కూడిన రిజిస్ట్రేషన్‌ ఫాం కనిపిస్తుంది. అందులో తమ వివరాలను నింపగానే.. నిర్వాహకుల వద్ద ఏయే ప్యాకేజీలు ఉన్నాయనే వివరాలు వస్తాయి.


అనంతరం ఫోన్‌ కాల్‌లో ఒక అమ్మాయి తియ్యటి స్వరంతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారిని పలకరిస్తుంది. మరిన్ని ప్యాకేజీలకు వారు డబ్బులు చెల్లించేలా చేస్తుంది. అదే వారు మోసపోవడానికి మొదటి మెట్టు. ఈ తరహాలో వలపుల వల విసిరి దేశవ్యాప్తంగా యువత బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు మోసగాళ్లు. ఈ బ్యాచ్‌ రోజుకు రూ. లక్షల్లో కొల్లగొడుతుండటం గమనార్హం. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి నగరం ఈ దందాకు ప్రధాన అడ్డాగా మారింది. ఇలాంటి ఓ ఘరానా ముఠా ఆట కట్టించారు సైబరాబాద్‌ పోలీసులు. పోలీసుల విచారణలో నిందితులు పలు విషయాలను వెల్లడించారు.


బజారుకో కాల్‌సెంటర్‌...

సిలిగురిలో సైబర్‌ నేరగాళ్లు బజారుకో కాల్‌సెంటర్‌ నిర్వహిస్తున్నారు. స్పైసీ ఫ్రెండ్‌షిప్‌, ది డేటర్స్‌ హబ్‌, బంబుల్‌, కాఫీమీట్‌.. వంటి పలు యాప్‌ల పేరిట యువతను ఆకర్షిస్తున్నారు. అందమైన అమ్మాయిల ఫొటోలతో కుప్పలు తెప్పలుగా నకిలీ వెబ్‌సైట్లను సృస్టిస్తున్నారు. వాటిల్లో రిజిస్టర్‌ అయిన వారిని అడ్డంగా దోచేస్తున్నారు. రిజిస్టర్‌ అయిన యువతకు ఫోన్‌ చేసే అమ్మాయిలు, తాము ముందుగా శిక్షణ పొందిన విధంగా.. కవ్వింపు మాటలతో ఇవతలి వారిని రెచ్చగొడతారు. రిజిస్ట్రేషన్‌ రుసుం చెల్లించేలా ముగ్గులో దించుతారు. ఐడీ పేరిట ఓ కార్డును ఇచ్చి.. తమ వద్ద ఉన్న వివిధ ప్యాకేజీలు, వాటిల్లో సేవల గురించి వివరిస్తారు. మాటల్లో దించిన తర్వాత బాధితుల నుంచి రూ. లక్షలు కొల్లగొడతారు. 


ఇలా అమ్మాయిలతో కూడిన కాల్‌ సెంటర్లను ఒక్కో ముఠా నాయకుడు 10 నుంచి 30 వరకూ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక్కడ పనిచేసే యువతులకు మంచి జీతంతోపాటు.. ఎంతమందిని ముగ్గులోకి దింపారనేదాని ఆధారంగా ఇన్సెంటివ్‌లు కూడా ఇస్తారు. సిలిగురిలో అడుగడుగునా ఉన్న ఈ కాల్‌సెంటర్లు బయటికి ఏదో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ, లేదా ఫైనాన్స్‌ సంస్థలా కనిపిస్తుంటాయి. అపార్టుమెంట్లు అద్దెకు తీసుకుని వీటిని నడుపుతుంటారు. దందా జరిగేదంతా ఆన్‌లైన్‌లోనే. అందమైన అమ్మాయిల ఫొటోలు, టెలీకాలర్స్‌ మాట్లాడే తియ్యటి మాటలే ముఠా పెట్టుబడి. ఈ మోసగాళ్లు ఇచ్చే ప్యాకేజీలను చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఇందులో 3నెలలు, 12నెలలు, 18నెలలతో కూడిన ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి. 


ఆన్‌లైన్‌ మోసాలతో అప్రమత్తంగా ఉండండి : పోలీసులు

ప్యాకేజీలను బట్టి యువతులతో స్నేహం, డేటింగ్‌, చాటింగ్‌, వాట్సాప్‌ నెంబర్‌ ఇవ్వడం, ఆన్‌లైన్‌ చాటింగ్‌, వీడియో చాటింగ్‌ వంటివి ఉంటాయని నమ్మిస్తారు. రిజిస్టర్‌ అయిన వ్యక్తి ప్యాకేజీ ఎంచుకున్న తర్వాత వారి దగ్గరి నుంచి వివిధ రకాల ఫీజుల పేరుతో.. రూ. లక్షల్లో  డబ్బులు కొల్లగొడతారు. ఆ తర్వాత బిచాణా ఎత్తేస్తారు. ఇలా దేశవ్యాప్తంగా యువతను మోసగించి రూ. కోట్లు సంపాదిస్తున్నారు. ఈ దందా నిర్వహించడానికి సైబర్‌ నేరగాళ్లు వందలకొద్దీ సిమ్‌కార్డులను ఉపయోగిస్తారు. 


ఓ వ్యక్తిని మోసం చేస్తే.. ఇక ఆ సిమ్‌ను పడేస్తారు. ఆ సిమ్‌లు వివిధ రాష్ట్రాలకు చెందిన చిరునామాలతో రిజిస్టర్‌ అయి ఉంటాయి. వాటిని ఉపయోగించడానికి చౌకధర ఫోన్లను వాడతారు. ఒకసారి ఆ దందా వద్ద రిజిస్టర్‌ అయిన వ్యక్తి సమాచారాన్ని తదనంతరం అన్ని రకాల సైబర్‌ నేరాలకు వినియోగిస్తున్నట్లు పోలీసులకు నిందితులు వెల్లడించారు. సిలిగురిలో వందల సంఖ్యలో ఇలాంటి కాల్‌సెంటర్‌లు ఉండటం గమనార్హం. క్షణిక సుఖాలకు ఆశపడి, ఇలాంటి వలపుల వలలో యువత చిక్కుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. 


ఒక నెల సిల్వర్‌ ప్యాకేజీ- 2,500+జీఎస్‌టీ

3 నెలలు గోల్డ్‌ ప్యాకేజీ- 5,500+జీఎస్‌టీ

12 నెలలు ప్లాటినం- 10,500+జీఎస్‌టీ

18 నెలలు వీఐపీ ప్యాకేజీ- 15,000+జీఎస్‌టీ

Updated Date - 2020-11-24T17:36:14+05:30 IST