బిజెపి జైత్రయాత్రకు ‘హైదరాబాద్’ స్ఫూర్తి

ABN , First Publish Date - 2022-07-05T06:47:29+05:30 IST

హైదరాబాద్‌లో 18 సంవత్సరాల తరువాత జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో ఒక కొత్త ఊపును తీసుకువచ్చాయి...

బిజెపి జైత్రయాత్రకు ‘హైదరాబాద్’ స్ఫూర్తి

హైదరాబాద్‌లో 18 సంవత్సరాల తరువాత జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో ఒక కొత్త ఊపును తీసుకువచ్చాయి. దక్షిణాదిన కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా బిజెపికి అమిత జనాదరణ ఉన్నదని, ప్రజలు బిజెపిని ఒక ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని నేతలకు అర్థమైంది. జాతీయ కార్యవర్గ సమావేశానికి రెండు రోజుల ముందే వచ్చిన సభ్యులు తెలంగాణలో వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు వారికి ఆశ్చర్యకరమైన అనుభవాలు కలిగాయి. సామాన్య ప్రజలు, ఆదివాసీలు, దళితులు, యువత వారిని అక్కున చేర్చుకున్నారు. ఇవాళ తెలంగాణ మారుమూల పల్లెల్లో కూడా నరేంద్రమోదీ పేరు వినని వారు లేరు. ‘మోదీ అధికారంలోకి వచ్చాక మనకంటూ ఒక అస్తిత్వం ఉన్నదన్న విషయం తెలిసింది’ అని వరంగల్‌లో ఒక స్థానిక యువకుడు బిజెపి నేతలతో చెప్పాడు. రాష్ట్రపతి పదవికి ఒక ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును ఎంపిక చేసిన విషయం బిజెపి నేతలు రాకముందే తెలంగాణలోని ఆదివాసీలకు తెలిసిపోయింది. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రధాని మోదీ సభకు యువతీ యువకులు భారీ సంఖ్యలో రావడం బిజెపి పట్ల వారి ఆకాంక్షలు ఎంతగా పెరుగుతున్నాయో స్పష్టమవుతోంది.


తెలంగాణలో కేసిఆర్ సర్కార్ అసమర్థ పాలన వల్ల లక్షలాది యువకులు రోడ్డున పడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమయింది. అదే సమయంలో బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి వేగంగా జరగడం, మోదీ సారథ్యంలో మన దేశం ప్రపంచంలో ఆరవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం కూడా యువజనులు గమనిస్తున్నారు. తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే తమ భవిష్యత్ మెరుగుపడుతుందని వారికి తెలుసు. అందుకే ప్రధాని మోదీ బహిరంగ సభలో అభివృద్ధి గురించి ఎక్కువగా మాట్లాడారు. తెలంగాణలో కేంద్రం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన గణాంక వివరాలతో సహా వివరించారు. రీజినల్ రింగ్ రోడ్డుకు, జాతీయ రహదారులకు మాత్రమే కాదు, హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లకు కూడా కేంద్రమే నిధులు ఇస్తుందని ఆయన చెప్పారు. కేంద్రం కేటాయించిన నిధులతోనే ఫ్లై ఓవర్లతో పాటు ఎలివేటెడ్ కారిడార్లు కడుతున్నారని, గత 8 ఏళ్లలో జాతీయ రహదారుల పొడవు రెట్టింపై 2500 కిలోమీటర్లనుంచి 5000 కిలోమీటర్లకు పెరిగాయని ఆయన తెలిపారు. గ్రామీణ సడక్ యోజన క్రింద గ్రామాల్లో 2500 కిమీ రోడ్ల నిర్మాణానికి కూడా కేంద్రమే రూ. 1700 కోట్ల మేరకు మంజూరు చేసిందని, తెలంగాణలో కేంద్రం కేటాయించిన రూ. 31 వేల కోట్ల వల్లే 1800 కిమీ రైల్వే లైన్ల నిర్మాణమైందని మోదీ చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఏనాడైనా ఈ విషయాన్ని చెప్పిందా? గత ఆరేళ్లలో కేంద్రమే రూ. లక్ష కోట్లు చెల్లించి ధాన్యాన్ని కొన్నదని, తెలంగాణలో 5 నీటి పారుదల ప్రాజెక్టులకు రూ. 35 వేల కోట్లకు పైగా నిధుల సమకూర్చిందని ప్రధానమంత్రి తెలియజేశారు. ఇంతకు ముందు కేసీఆర్ ఏనాడైనా ఈ విషయాన్ని ప్రజలకు చెప్పారా? కరోనా సమయంలో టీకాలను అభివృద్ధి చేయగల పరిశోధనలకు కేంద్రమే ఊతం ఇచ్చిందని, మోదీ స్వయంగా ఇందుకు దోహదం చేశారని కేసిఆర్‌కి తెలియని విషయమా? తెలంగాణలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిచేందుకు రూ.8500 కోట్లను కేటాయించి, విదేశాలనుంచి ఎరువులను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితిని మోదీ నివారించిన విషయం కేసీఆర్ మాట వరుసకైనా చెప్పారా? కేంద్రం అమలు చేస్తున్న జనధన్ యోజన క్రింద కోటి మంది తెలంగాణ మహిళలు ప్రయోజనం పొందుతున్నారని కేసిఆర్‌కు తెలుసా? కేసిఆర్ కోరకుండానే తెలంగాణలో మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను నిర్మించి వేలాది యువకులకు ఉపాధి కల్పిస్తామని మోదీ ప్రకటించారు. తెలంగాణకు కేంద్రం ఏమి చేసిందని కేసిఆర్, ఆయన కుమారుడు కేటిఆర్ పదే పదే ప్రశ్నిస్తున్నారు. కేంద్రం వల్ల తెలంగాణకు ప్రయోజనాలు లభించాయని తెలిస్తే రాజీనామా చేస్తానని కూడా కేటిఆర్ ప్రకటించారు. మరి ఇప్పుడు ప్రధాని మోదీ మాట్లాడిన తర్వాత రాజీనామా చేయగల ధైర్యం కేటిఆర్‌కు ఉన్నదా?


బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధానంగా మోదీ ప్రభుత్వం సాధించిన రాజకీయ, ఆర్థిక విజయాల గురించి చర్చించారు. పార్టీ కార్యకర్తలకే కాదు, ప్రజలకు కూడా వాస్తవాలు తెలుపడమే ఈ సమావేశాల ఉద్దేశం. గత 8 సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం ప్రపంచంలోని అగ్రదేశాల స్థాయిలో దేశాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా, ఆత్మనిర్భరత, పేదల సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తోంది. భారతీయ యువత ప్రతిభావంతమైందని, వారు ఉత్తమ ఉత్పత్తులు సాధించగలరని, తద్వారా భారత్ ఆత్మనిర్భరత సాధించగలదని మోదీ విశ్వసించినందువల్లే మేక్ ఇన్ ఇండియా పథకాన్ని రూపొందించారు. దేశంలో జరిగిన అభివృద్ధి కేవలం కొన్ని వర్గాలకే ప్రయోజనం చేయకుండా అన్ని వర్గాలకు దాని ఫలితాలు అందేలా చేయాలని, సమాజంలో అట్టడుగున ఉన్న వారికి కూడా ఈ ప్రయోజనాలు చేకూర్చి దీనదయాళ్ అంత్యోదయ పథకానికి సార్థకత కలిగించాలని మోదీ భావించారు. 2014లో విజయం లభించిన కొద్ది గంటల్లోనే మోదీ చేసిన ప్రసంగంలో ఈ మేరకు ఆయన తన లక్ష్యాలను నిర్వచించుకున్నారు. ప్రధానంగా ఆయన నిధులు దళారీల చేతుల్లోకి పోకుండా పంపిణీ వ్యవస్థలో నిర్మాణాత్మకమైన మార్పులు తీసుకువచ్చినందువల్లే ప్రజలకు నేరుగా పథకాల ప్రయోజనాలు చేరుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో కేవలం పది శాతం నిధులు మాత్రమే ప్రజలకు చేరితే మిగతా 90 శాతాన్ని దళారులు నొక్కేసేవారు. ఆ సంస్కృతికి మోదీ చరమగీతం పాడారు. కాంగ్రెస్ హయాంలో ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని కొన్ని వర్గాలకు, కులాలకు మాత్రమే పథకాలు అమలు చేసే వారు. కాని ఇప్పుడు అన్ని వర్గాలకు, కులాలకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో పథకాలు అమలు అవుతున్నాయి. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సామాజిక భద్రతా పథకాల గురించి ఎంత చెప్పినా సరిపోదు. ఒక్క ఎస్‌సి, ఎస్‌టిలకే మోదీ సర్కార్ రూ. 30వేల కోట్లు బదిలీ చేసింది.


ఆర్థిక వ్యవస్థ ద్విగుణీకృతంగా ఊపందుకోవాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ టెక్నాలజీతో మౌలిక సదుపాయాలు వేగంగా ఏర్పడాలనే మోదీ ఆకాంక్షలకు అనుగుణంగానే ఇవాళ నవ భారతం రూపకల్పన జరుగుతోంది. ఆయన తీసుకున్న చర్యల వల్లే భారతదేశంలో కోట్లాది మందికి వాక్సిన్ అందడమే కాక, ప్రపంచంలోని వంద దేశాల్లో 200 కోట్ల మందికి మనం ఉచితంగా వాక్సిన్‌ను అందజేయగలిగాం. గత రెండేళ్లలో ఆరోగ్య మౌలిక సదుపాయాలకు కేంద్రం ఇచ్చిన ప్రాధాన్యత వల్లే ఇవాళ దేశంలోని ఆస్పత్రుల్లో ఐసీయు పడకలు కేవలం 2,169 నుంచి 1.49 లక్షలకు చేరుకున్నాయి.


బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగినప్పుడల్లా ప్రజలకు పార్టీ ఏమి చేసిందో చెప్పేందుకు అవకాశం లభిస్తుంది. హైదరాబాద్ మహానగరం ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని బిజెపికి కల్పించింది. ఈ సమావేశాలు కల్పించిన నూతనోత్సాహ వెల్లువలో కేసీఆర్– కేటీఆర్ బాప్ బేటా సర్కార్ కొట్టుకుపోక తప్పదు.


వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Updated Date - 2022-07-05T06:47:29+05:30 IST