హైదరాబాద్‌ ఐటీ ఎగుమతుల్లో 15ు వృద్ధి

ABN , First Publish Date - 2021-12-03T07:32:55+05:30 IST

సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగుల వలసలు 2022 చివరి వరకూ కొనసాగే అవకాశం ఉంది. డిజిటల్‌ టెక్నాలజీలకు దేశ, విదేశాల్లో గిరాకీ అనూహ్యంగా పెరిగింది.

హైదరాబాద్‌ ఐటీ ఎగుమతుల్లో 15ు వృద్ధి

  •  కొత్తగా 60 వేల ఉద్యోగాలు
  •  2021-22 సంవత్సరానికి హైసియా అంచనా 
  •  వచ్చే ఏడాది చివరి వరకూ వలసలు తప్పవు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగుల వలసలు 2022 చివరి వరకూ కొనసాగే అవకాశం ఉంది. డిజిటల్‌ టెక్నాలజీలకు దేశ, విదేశాల్లో గిరాకీ అనూహ్యంగా పెరిగింది. అవసరాలకు అనుగుణంగా కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్‌ వంటి టెక్నాలజీల్లో నైపుణ్యాలు కలిగిన నిపుణుల లభ్యత పెరిగే వరకూ ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి ఉద్యోగుల వలసలు కొనసాగుతునే ఉంటాయని హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) ప్రెసిడెంట్‌ భరణి కే అరోల్‌ అన్నారు. ఉన్న కంపెనీలో ప్రోత్సహకాలు, ప్రమోషన్లు ఇచ్చినప్పటికీ.. అంతకు మించిన వేతనాలను ఆఫర్‌ చేసినప్పుడు నిపుణులు ఇతర కంపెనీలకు వెళతారని అన్నారు. ఈ నెల 16న వార్షిక ఇన్నోవేషన్‌ సదస్సు, అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని హైసియా నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండేళ్ల క్రితం మొత్తం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో డిజిటల్‌ టెక్నాలజీ నైపుణ్యాలున్న ఉద్యోగులు 8 శాతం మంది ఉండేవారు. ఇప్పుడు 25 శాతానికి పెరిగింది. భవిష్యత్తులో డిజిటల్‌ టెక్నాలజీల్లో నైపుణ్యాలున్న ఉద్యోగులు 40-45 శాతానికి చేరే వరకూ వలసలు తప్పవని అభిప్రాయపడ్డారు. 


  ప్రధమార్థంలో రూ.45,000 కోట్ల ఎగుమతులు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి హైదరాబాద్‌, తెలంగాణ సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు 15 శాతం వరకూ పెరిగే వీలుందని హైసియా ప్రెసిడెంట్‌ భరణి తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు 13 శాతం పెరిగి రూ.1.45 లక్షల కోట్లకు చేరాయి. ఈసారి అంతకన్నా ఎక్కువగా వృద్ధి రేటు నమోదు కానుందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌ ఐటీ/ఐటీ  సేవల రంగంలో ఉద్యోగాలు 8 శాతం పెరిగి 6.28,615కు చేరాయి. కొత్తగా 46,489 మందికి ఉద్యోగాలు లభించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల పెరుగుదల రేటు 9-10 శాతం ఉండనుందని భరణి తెలిపారు. అంటే 60 వేలకు పైగా కొత్త ఉద్యోగాలు లభించే వీలుంది. 


తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌, ఎంసీఏ తదితర కోర్సులను పూర్తి చేసుకుని వచ్చే విద్యార్థుల్లో 80 శాతం మందికి ఈసారి దేశీయ సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమ ఉద్యోగావకాశాలు కల్పించగలదన్నారు. కాగా 2020-21 ఆర్థిక సంవత్పరం ప్రధమార్థంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) ద్వారా హైదరాబాద్‌ నుంచి జరిగిన ఎగుమతులు 13 శాతం పెరిగాయని హైదరాబాద్‌ ఎస్‌టీపీఐ డైరెక్టర్‌ సీవీడీ రామ్‌ప్రసాద్‌ తెలిపారు. మొదటి రెండు త్రైమాసికాల్లో హైదరాబాద్‌ ఎస్‌టీపీఐ సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు రూ.45,000 కోట్లు ఉన్నట్లు తెలిపారు. 


500 మంది ప్రతినిధులు..

ఈ నెల 16న జరగనున్న హైసియా ఇన్నోవేషన్‌ సదస్సుకు దాదాపు 500 మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. వ్యాపారాలు, జీవితాలపై డిజిటల్‌ టెక్నాలజీల ప్రభావంపై నిపుణులు ప్రసంగిస్తారు. దాదాపు 40 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులు, సేవల కంపెనీలకు వివిధ విభాగాల్లో అవార్డులు ప్రదానం చేయనున్నారు. కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌, ఐటీ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌, టీసీఎస్‌ ఈడీ సుబ్రమణియమ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 

Updated Date - 2021-12-03T07:32:55+05:30 IST