ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద జర భద్రం

Sep 21 2021 @ 11:58AM

రక్షణ కంచెల లేమి

నేలకు తాకుతూ విద్యుత్‌ తీగలు

స్తంభాలకు వేలాడుతున్న ఇతర తీగలు

ఫిర్యాదులను పట్టించుకోని అధికారులు


హైదరాబాద్/కుత్బుల్లాపూర్‌: కుత్బుల్లాపూర్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ కంచె ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాకరంగా మారాయి. గతంలో అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ప్రతి ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ కంచె ఏర్పాటు చేయాలనే నిబంధన ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేసే యంత్రాంగం అంతకుముందు తీసుకోవాల్సిన చర్యలపై మాత్రం ఎటువంటి శ్రద్ధ చూపడం లేదు. 


పాఠశాలలు పునఃప్రారంభమైనా..

కరోనా నేపథ్యంలో ముతబడిన పాఠశాలలు ఇటీవల పునఃప్రారంభమయ్యాయి. ఆయా రోడ్లు, వీధుల్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల పక్క నుంచే విద్యార్థులు, చిన్నారులు పాఠశాలలకు రాకపోకలు సాగిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద నేలకు తాకుతూ వేలాడుతున్న విద్యుత్‌ తీగలు, మూతలేని ఫ్యూజ్‌ బాక్సుల వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.


చెత్తాచెదారంతో అస్తవ్యస్తంగా..

ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయకపోవడంతో వాటి చుట్టూ చెత్తాచెదారంతో పాటు వ్యర్థాలు చేరి అస్తవ్యస్తంగా మారుతోంది. 

వర్షాలు కురిసినా, ఏదైనా మ్యాన్‌హోల్‌ లీకైనా ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ నీరు చేరి అక్కడ వేలాడుతున్న విద్యుత్‌ తీగలు నీటిలో తేలియాడుతున్నాయి. రక్షణ కంచెలు లేని ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద పెరిగిన గడ్డి, ఇతర మొక్కలను మేసేందుకు వచ్చే పశువుల కొమ్ములు, కాళ్లు వేలాడే తీగల్లో చిక్కుకొని ప్రమాదాలకు గురవుతున్నాయి. గతంలోనూ పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. 


ఫిర్యాదులు చేసినా పట్టించుకోని యంత్రాంగం

ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని, వాటి పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, సరైన ఫ్యూజ్‌ బాక్సులను అమర్చాలని, విద్యుత్‌ స్తంభాలకు తీగలను చుట్టలుగా చుట్టి ప్రమాదాలకు కారణమయ్యే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పలుమార్లు అధికారులకు స్థానికులు, యజమానులు ఫిర్యాదులు చేసినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.


విద్యుత్‌ స్తంభాలపై..

అధికారుల పర్యవేక్షణలోపంతో విద్యుత్‌ స్తంభాలకు కేబుల్‌, టెలీకాం, ఇంటర్‌నెట్‌ ఇతరాత్ర తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. ఇలా అన్ని రకాల తీగలను విద్యుత్‌ స్తంభాలకు కుప్పలు తెప్పలుగా కట్టి మిగిలిన తీగలను స్తంభాలపై చుట్టాలుగా చుట్టి పెట్టడంతో వాటి భారం స్తంభాలపై పడి ఓ పక్కకు ఒరిగి ప్రమాదకరంగా మారుతున్నాయి. 

Follow Us on:

హైదరాబాద్మరిన్ని...