సౌదీలో కరోనా కాటుతో హైదరాబాదీ మృతి !

ABN , First Publish Date - 2021-04-14T18:05:35+05:30 IST

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ప్రాంతానికి చెందిన ఎండీ ఫైజుద్దీన్‌(53) అనే వ్యక్తి సౌదీ అరేబియాలో కరోనా కాటుకు బలయ్యారు. కొన్నేళ్లుగా సౌదీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఫైజుద్దీన్ కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నివాసం ఉంటోంది. ఆయన భార్య ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.

సౌదీలో కరోనా కాటుతో హైదరాబాదీ మృతి !

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ప్రాంతానికి చెందిన ఎండీ ఫైజుద్దీన్‌(53) అనే వ్యక్తి సౌదీ అరేబియాలో కరోనా కాటుకు బలయ్యారు. కొన్నేళ్లుగా సౌదీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఫైజుద్దీన్ కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నివాసం ఉంటోంది. ఆయన భార్య ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. తాజాగా పెద్ద కూతురుకు వివాహం చేయాలని నిర్ణయించుకున్న ఫైజుద్దీన్‌ మార్చి నెలాఖరికి హైదరాబాద్‌కు రావాల్సి ఉంది. అంతలోనే అక్కడ మహమ్మారి బారిన పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత శుక్రవారం కన్నుమూశారు. ఇక కరోనా ఆంక్షలతో ఆయన భార్య, పిల్లలు సౌదీ వెళ్లే అవకాశం లేకుండా పోయింది.


దాంతో సౌదీ అరేబియాలో ఉంటున్న వారి బంధువుకు  అంత్యక్రియలు నిర్వహించే అధికారం కల్పిస్తూ ఫైజుద్దీన్‌ భార్య, కుటుంబ సభ్యులు ధృవ పత్రాలపై సంతకాలు చేసి పంపించారు. వచ్చే శుక్రవారం సౌదీలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే.. ఫైజుద్దీన్ తల్లి ఏడాది క్రితం అనారోగ్యంతో మరణించగా అంత్యక్రియలకు ఆయన స్వదేశానికి రాలేకపోయారు. అప్పుడు కరోనా కారణంగా విమాన రాకపోకలపై నిషేధం ఉండడంతో ఆయన భారత్‌కు రాలేదు. ఇప్పుడు సౌదీలో ఫైజుద్దీన్ కరోనాతో మృతి చెందగా.. ఆయన భార్య-పిల్లలు సౌదీ వెళ్లలేని పరిస్థితి. అప్పుడు.. ఇప్పుడు ఇలా కరోనా కడసారిచూపునకూ దూరం చేసింది.   

Updated Date - 2021-04-14T18:05:35+05:30 IST