Shocking : హైదరాబాద్‌ Metroకు రోజుకు ఇన్ని లక్షల నష్టమా..!?

ABN , First Publish Date - 2021-11-15T17:42:20+05:30 IST

Shocking : హైదరాబాద్‌ Metroకు రోజుకు ఇన్ని లక్షల నష్టమా..!?

Shocking : హైదరాబాద్‌ Metroకు రోజుకు ఇన్ని లక్షల నష్టమా..!?

  • రోజుకు 80లక్షల నష్టం..
  • ‘మెట్రో’కు సాయంపై ప్రభుత్వ నిర్లక్ష్యం
  • నేటికీ రూపాయి అందని పరిస్థితి

హైదరాబాద్‌ సిటీ : మూడు కారిడార్లలో రోజుకు 820 ట్రిప్పుల ద్వారా 2.80 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతున్నా మెట్రోరైలుకు రోజుకు రూ.80 లక్షల నష్టం వస్తున్నట్లు తెలుస్తోంది. కొవిడ్‌ తెచ్చిన నష్టాన్ని పూడ్చుకునేందుకు హెచ్‌ఎంఆర్‌ఎల్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నా గతంలోని ప్రయాణికుల సంఖ్యను అందుకోలేకపోతోంది. ఉదయం 6 నుంచి రాత్రి 11.15 వరకు నిర్విరామంగా రైళ్లను నడిపిస్తున్నా మెట్రో ఆదాయం పెరగడం లేదు. 2021 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మెట్రోకు రూ.386 కోట్ల ఆదాయం రాగా, నష్టం రూ.1,766 కోట్లు వచ్చినట్లు ఎల్‌అండ్‌టీ వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టు కోసం పలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికి ఏటా వడ్డీ రూ.1,412 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. గతంలో మాదిరిగా షాపింగ్‌ మాల్స్‌ నిర్వహణ సరిగా లేకపోవడం, ప్రకటనల ఆదాయం తగ్గడంతో నష్టాలు పెరుగుతున్నాయని ఎల్‌అండ్‌టీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం టికెట్లు, పార్కింగ్‌, షాపింగ్‌మాల్స్‌ ద్వారా అరకొరగా వస్తున్న ఆదాయం నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులకు కూడా సరిపోవడం లేదని పేర్కొంటున్నారు.


సాయం కోసం ఎదురుచూపులు..

నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థకు తమవంతు సాయం అందిస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మెట్రో సేవలను మరింతగా పెంచాలని చెబుతున్న పాలకులు సంస్థను ఆదుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా నిర్వహణ, వడ్డీల భారం మోయలేక హెచ్‌ఎంఆర్‌ సతమతమవుతోంది. కొవిడ్‌కు ముందు ఎల్‌బీనగర్‌ - మియాపూర్‌, జేబీఎస్‌ - ఎంజీబీఎస్‌, నాగోలు - రాయదుర్గం కారిడార్లలో రోజుకు 3.80 లక్షల నుంచి 4.20 లక్షల మంది మెట్రోలో ప్రయాణించేవారు. దీంతోపాటు షాపింగ్‌మాల్స్‌ నిర్వహణ, ప్రకటనలు పెద్ద ఎత్తున ఉండడంతో భారీ ఆదాయం సమకూరేది. ఏడాదికి మెట్రో టికెట్లు, మాల్స్‌ ప్రకటనల ద్వారా రూ.300 కోట్లకు పైగా ఆదాయం వస్తుండేది. 2020 ఫిబ్రవరిలో కొవిడ్‌ తాకిడి మొదలైనప్పటి నుంచి మెట్రో ఆదాయం బాగా తగ్గింది.


తక్షణ సాయం ఎక్కడ..?

రుణాల వడ్డీల చెల్లింపుల నిమిత్తం తక్షణ సాయంగా రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్లు అందిస్తామని రెండు నెలల క్రితం ఎల్‌అండ్‌టీ, మెట్రో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. రుణాలు, వడ్డీల వివరాలు తెలుసుకునేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు సమాచారం. అయితే ఇంతవరకు తమకు ఎలాంటి సాయం అందలేదని మెట్రో వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - 2021-11-15T17:42:20+05:30 IST