
ఒప్పందాలు ఉత్తమాటేనా?
భయం గుప్పిట్లో జనం
హైదరాబాద్/ చంపాపేట: చూడటానికి అది చెత్త... ప్రమాదవశాత్తు దానికి నిప్పంటుకుంటే మాత్రం ప్రాణనష్టంతో పాటు ఆస్తినష్టం జరుగుతుందనే భయం... సంఘటనలు జరగనంత వరకు అటువైపు ఎవరు కన్నెత్తు చూడరు... ఏదైనా జరగరానిది జరిగితే ప్రభుత్వంతో పాటు జనం దృష్టి మాత్రం వాటిపైనే ఉంటుంది. జనవాసాల మధ్య స్ర్కాప్ (చెత్త)వ్యాపారాలు కొనసాగుతున్నా వాటి గురించి పట్టించుకునేనాథుడు కరువైనారు. ఎవరైనా వాటి గురించి ప్రశ్నిస్తే నిర్వాహకులు డబ్బులు ఏరచూపడం, పలుకుబడి ఉపయోగించి నోరు మూయించడం పరిపాటిగా మారింది.
హస్తినాపురం డివిజన్ నందనవనం, శ్రీరమణకాలనీలలో వందల సంఖ్యలో కుటీర పరిశ్రమలు కొనసాగుతున్నాయి. నగరం బయట ఉండాల్సిన వాటిని యథేచ్ఛగా జనవాసాల మధ్య కొనసాగిస్తున్నారు. శ్రీరమణకాలనీలో నలభై చెత్త సేకరణ గోదాములు, ఎనిమిది ఫ్లష్డోర్ల తయారీ కేంద్రాలు, నాలుగు కెమికల్ గోదాములు ఏళ్ల నుంచి కొనసాగుతున్నాయి. కాలనీలో ప్రజలు గృహాలు, అపార్టుమెంట్లు నిర్మించుకున్నారు.
ప్రాణాలు అరచేతిలో..
కాలనీలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారు. గృహాల మధ్యన చెత్త గోదాములు ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని వారు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. గోదాములలో నీటివసతి, ఫైర్సేఫ్టీలు లేకపోవడం, రాత్రి వేళల్లో గోడౌన్లకు తాళా లు వేసి వెళితే విద్యుదాఘాతంతో ప్రమాదాలు సంభవిస్తాయని ప్రజలు భయపడుతున్నారు.
అంగీకారపత్రం కంచికేనా
శ్రీరమణకాలనీ ప్రజలు చెత్త గోదాములను కాలనీ నుంచి ఇతర ప్రదేశాలకు తరలించాలని 2019లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ, అప్పటి కార్పొరేటర్ పద్మానాయక్ దృష్టికి తీసుకెళ్లారు. కొంత మంది స్థానిక నాయకులు చెత్త గోడౌన్ల యజమానుల చెంతకు చేరి ఎమ్మెల్యేతో మాట్లాడి వారికి కొంత గడువు ఇవ్వాలని కోరారు. చివరకు చెత్త గోదాము యూనియన్ నాయకులు 2019 జూలై 14న కాలనీ సంక్షేమ సంఘానికి ఓ అంగీకారపత్రం రాసిచ్చారు. కాగితం రాసిచ్చిన తేదీ నుంచి సంవత్సరం లోగా చెత్త, ఫ్లష్డోర్స్తో పాటు ఇతర గోదాములను ఖాళీ చేసి వెళతామని పేర్కొన్నారు. వారు రాసిచ్చిన కాగితం మాట నేటికి అమలు కాలేదు. ఇటీవల సికింద్రాబాద్ బోయిగూడలో జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు మృతి చెందిన సంఘటన చోటుచేసుకోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిఽఽధులలో చలనం మొదలైంది. ఇటీవల శ్రీరమణకాలనీలో పలు చెత్తగోదాములను సీజ్ చేశారు. శ్రీరమణకాలనీ సంక్షేమ సంఘం వారికి ఇచ్చిన మాట ప్రకారం గోదాములు ఖాళీ చేయాలని వారు ఎమ్మెల్యే, ప్రస్తుత కార్పొరేటర్ సుజాతనాయక్పై వత్తిడి పెంచుతున్నారు.
మరికొంత సమయం ఇవ్వాలి
తాము గోదాములను ఖాళీ చేస్తామని కాగితం రాసిచ్చిన మాట వాస్తవం. కరోనా రావడంతో మా వ్యాపారాలు కొనసాగలేదు. మాకు కొంత సమయం ఇవ్వాలి.
- రాజిరెడ్డి, అధ్యక్షుడు, శ్రీ బాలాజీ ప్లాస్టిక్
అసోసియేషన్,శ్రీరమణకాలనీ
గోదాములను ఖాళీ చేయాలి
శ్రీరమణకాలనీలో జనవాసాల మధ్య గోదాములు ఉంటే ప్రమాదాలు జరగవచ్చు. గతంలో నిర్వాహకుల నుంచి కొందరు డబ్బులు తీసుకొని ప్రశ్నించేవారిని భయపెట్టి, గోదాములు తరలించకుండా రాజీ కుదుర్చారు. నీరు కలుషితం కావడంతో పాటు కెమికల్ గోదాముల నుంచి దుర్వాసన వస్తుంది.
- సుజాతనాయక్, కార్పొరేటర్, హస్తినాపురం
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం
జనవాసాల మధ్య ఉండే చెత్త, కెమికల్ ఇతర గోదాములను ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తరలిస్తాం. ఇందుకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ తయారు చేస్తుంది.
- సురేందర్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్,
ఎల్బీనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ