వర్షాకాలం వచ్చేసింది.. హైదరాబాద్‌లో భయం.. భయం..!

ABN , First Publish Date - 2021-06-17T19:11:12+05:30 IST

వర్షం వస్తే.. గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముంపు భయమే కాదు..

వర్షాకాలం వచ్చేసింది.. హైదరాబాద్‌లో భయం.. భయం..!

  • వర్షాకాలంలో పొంచి ఉన్న ముప్పు
  • వర్షాలకు కూలిపోయే స్థితిలో ఎన్నో ..
  • సెంట్రల్‌, సౌత్‌ జోన్లలో అధికం

వర్షం వస్తే.. గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముంపు భయమే కాదు, పాత భవనాలు కూలి ఎవరి ప్రాణాలు పోతాయోనన్న భయమూ ఉంటుంది. వర్షాకాలంలో ఏటా ఎక్కడో చోట పాత భవనాలు, పురాతన ఇళ్లు కూలుతూనే ఉన్నాయి. పాత భవనాలను గుర్తిస్తున్నాం, తొలగిస్తున్నాం అంటున్న జీహెచ్‌ఎంసీ అధికారుల ప్రకటనలు పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చడం లేదు.


హైదరాబాద్‌ సిటీ : ఏటా వరదలో కొట్టుకుపోయే బాధితుల కంటే భవనాలు, గోడలు కూలి చనిపోతున్నవారే అధికంగా ఉంటున్నారు. అందుకే వర్షం వస్తే పురాతన భవనాల్లో నివసించే వారితో పాటు సమీప ఇళ్లవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే వర్షాకాల సీజన్‌ ప్రారంభమైంది. బుధవారం సుల్తాన్‌బజార్‌ నయి గల్లీలో 50 ఏళ్ల నాటి పాతభవనం కుప్పకూలింది. ఏడాది క్రితం భవనాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి ఇటీవల మరమ్మతు పనులు చేపట్టారు. ఈ క్రమంలోనే భవనం కుప్పకూలింది. ఆ సమయంలో కూలీ లు అప్రమత్తంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది.


ప్రమాద ఘంటికలు

అనేక ప్రాంతాల్లో పాత భవనాలతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ప్రధానంగా సౌత్‌జోన్‌, సెంట్రల్‌ జోన్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లు పూర్తి గా శిథిలావస్థకు చేరాయి. నాలుగైదు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇళ్లు కావడంతో ఎప్పుడు కూలతాయే తెలియని పరిస్థితి ఉంది. సెంట్రల్‌ జోన్‌ పరిధిలో 300కు పైగా పురాతన, శిథిలావస్థకు చేరిన భవనాలున్నాయి. సౌత్‌జోన్‌లోని పాతబస్తీ ప్రాంతంలో ప్రమాదకర స్థాయిలో 200 వరకు పాత భవనాలున్నాయి. బేగంబజార్‌, కోఠి, సుల్తాన్‌బజార్‌, బడీచౌడీ, ముక్తియార్‌గంజ్‌, అఫ్జల్‌గంజ్‌, గౌలిగూడ, చార్మినార్‌, ఫలక్‌నుమా, యాకత్‌పురా, బహదూర్‌పురా, మలక్‌పేట, పురానాపూల్‌, కార్వాన్‌ తదితర ప్రాంతాల్లో పాత భవనాలున్నాయి. ఇందులో కొన్నింట్లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. మరికొన్ని భవనాలు నివాస సముదాయాలుగా ఉన్నాయి. సికింద్రాబాద్‌ జోన్‌ పరిధిలో కూడా వివిధ భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఇందులో కొన్నింటిని తక్షణం కూల్చేయాల్సిన  అవసరం ఉంది.


కోర్టుకెక్కుతున్న యజమానులు

పాత భవనాలను కూల్చేయడానికి జీహెచ్‌ఎంసీ అధికారులు స్ట్రక్చరల్‌ ఇంజనీర్లతో సర్వే చేయించి సెక్షన్‌ 459 ప్రకారం భవన యజమానులకు నోటీసులు ఇస్తున్నారు. తీసుకోకపోతే భవనాలకు అంటిస్తున్నారు. అయితే అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. చర్యలు చేపట్టడంలో వెనుకడుగు వేస్తున్నారు. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో అనేక మంది జీహెచ్‌ఎంసీ నోటీసులను ఖాతరు చేయడం లేదు. మరికొందరు కోర్టుకెక్కుతున్నారు. గ్రేటర్‌ పరిధిలో సుమారు 150 మందికి పైగా భవనాల యజమానులు కోర్టుకెక్కినట్లు సమాచారం. అయితే ఈ పాత భవనాల విషయంలో కోర్టులో తగిన వాదన వినిపించడంలో జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. 


కుప్పకూలిన పాత భవనం

సుల్తాన్‌బజార్‌ నయి గల్లీ ప్రాంతంలో 50 ఏళ్ల నాటి పాత భవనం బుధవారం కుప్పకూలింది. స్థానికుల వివరాల ప్రకారం... సుల్తాన్‌బజార్‌ నయి గల్లీ ప్రాంతంలో సుమారు 250 చదరపు గజాల్లో ఉన్న గ్రౌండ్‌ ప్లస్‌ రెండంతస్తుల భవనాన్ని ఏడాది క్రితం సచిన్‌ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. అందులో ఉండేవారిని ఖాళీ చేయించి మరమ్మతు పనులు చేపట్టారు. భవనం పటిష్టత కోసం పిల్లర్‌ ఏర్పాటు చేస్తుండగా, చప్పుడు వచ్చింది. దాంతో అక్కడే ఉన్న కూలీలు పక్కకు జరిగారు. భవనం పెచ్చులూడుతూనే ఒక్కసారిగా కుప్పకూలింది. కూలీలు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ పాత భవనాన్ని ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించలేదు. నోటీసులివ్వలేదు. భవనం కూలడంతో స్థానిక పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు ఘటనా స్థలిని సందర్శించారు. యజమాని నుంచి వివరాలు సేకరించారు.

Updated Date - 2021-06-17T19:11:12+05:30 IST