ముంచెత్తిన వాన

Sep 26 2021 @ 10:42AM

పలు ప్రాంతాల్లో కుండపోత

రహదారులపై వరద ప్రభావం

ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వాహనదారులు

సాయం కోసం జీహెచ్‌ఎంసీ, టీఎస్ ఎస్ పీడీసీఎల్‌ నంబర్లు

రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం

అత్యధికంగా మణికొండలో 10.8 సెంటీమీటర్ల వర్షపాతం


హైదరాబాద్‌ సిటీ: నగరాన్ని వరుణుడు మరోసారి వరద నీటితో ముంచెత్తాడు. రెండు గంటలపాటు ఏకధాటిగా వర్షం దంచి కొట్టడంతో దారులన్నీ చిన్నపాటి నదులను తలపించాయి. ఇరవై రోజులుగా అప్పుడ ప్పుడు వర్షాలు కురుస్తున్నప్పటికీ శనివారం రాత్రి ఒకేసారి భారీగా కురవడంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైన వర్షం 9.30 గంటల వరకు ఆగకుండా కురిసింది. పాతబస్తీలోని ఫలక్‌నుమా, బహదూర్‌పురా, బార్కస్‌, ఉప్పుగూడ, చాంద్రాయణగుట్ట, చందానగర్‌, మియాపూర్‌, శేరిలింగంపల్లి, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, హైదర్‌నగర్‌, ఆల్విన్‌కాలనీ, కూకట్‌పల్లి, సైదాబాద్‌, సరూర్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కోఠి, అబిడ్స్‌, లక్డీకాపూల్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, అమీర్‌పేట మైత్రివనం, ఖైరతాబాద్‌, అంబర్‌పేట్‌, కాచిగూడ, గోల్నాక, రాయదుర్గం, గచ్చిబౌలిలో భారీవర్షం కురిసింది. మణికొండలో అత్యధికంగా 10.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

స్తంభించిన ట్రాఫిక్‌

వర్షంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. అంబర్‌పేట్‌లోని మూసారాంబాగ్‌ బ్రిడ్జిపై వరద తాకిడి ఉండడంతో ఇరువైపులా ట్రాఫిక్‌ పోలీసులు రాకపోకలను నిలిపివేశారు. కింగ్‌కోఠి వద్ద భారీ వృక్షం నేలకొరగడంతో  ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ట్రాఫిక్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు సిబ్బందితో చెట్టును తొలగించారు. మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, ట్యాంక్‌బండ్‌, రాణిగంజ్‌, హిమాయత్‌నగర్‌, లక్డీకాపూల్‌లో రాత్రి 8.40 నుంచి 9.10 గంటల వరకు ట్రాఫిక్‌  నిలిచిపోయింది.   షేక్‌పేట్‌, టోలీచౌకి, మణికొండలో కురిసిన వర్షానికి ఆయా మార్గాల్లో వరద పోటెత్తింది. టోలీచౌకీలోని నదీంకాలనీ నుంచి భారీగా వరద రావడంతో ప్రధాన రహదారిలో గంటలకొద్దీ వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉప్పర్‌పల్లి పిల్లర్‌ నంబర్‌ 191 వద్ద రోడ్డుపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు.

Follow Us on: