భాగ్యనగరంలో బాగున్న రోడ్లే బాగుచేస్తున్నారు..!

ABN , First Publish Date - 2021-06-22T17:53:57+05:30 IST

ఇది లిబర్టీ చౌరస్తా నుంచి నారాయణగూడ వైపు వెళ్లే రహదారి. ఈ రోడ్డుపై ఎక్కడా గుంత కూడా...

భాగ్యనగరంలో బాగున్న రోడ్లే బాగుచేస్తున్నారు..!

  • సీఆర్‌ఎంపీలో చిత్ర విచిత్రాలు 
  • పై పై పూతలతో మమ అనిపిస్తున్నారు
  • ఉన్నతాధికారుల దృష్టికి విషయం
  • పనులు నిలిపివేయాలని ఆదేశాలు
  • వర్షాకాలం నేపథ్యంలో.. రోడ్ల నిర్మాణం బంద్‌
  • ఇప్పటికే మిల్లింగ్‌ చేసిన చోట మాత్రమే పనులు

ఇది లిబర్టీ చౌరస్తా నుంచి నారాయణగూడ వైపు వెళ్లే రహదారి. ఈ రోడ్డుపై ఎక్కడా గుంత కూడా లేదు. అయినా రోడ్డు పునర్నిర్మాణానికి కసరత్తు ప్రారంభించారు. రెండు దిక్కులా ఫుట్‌పాత్‌ వైపు మిల్లింగ్‌ చేశారు. ఉన్నతాధికారులకు విషయం తెలియడంతో పనులు ఆపేయాలని ఆదేశాలు జారీ చేశారు.


బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ - 12లోనూ ఇదే పరిస్థితి. కొన్ని చోట్ల రహదారి బాగున్నా మిల్లింగ్‌ చేసి మళ్లీ నిర్మిస్తున్నారు. ఇవి రెండే కాదు నగరంలోని చాలా ప్రాంతాల్లో అద్దంలా మెరుస్తున్న రోడ్లను తొలగించి మళ్లీ పనులు చేపడుతున్నారు. పై పై పూతలు వేసి పనులు పూర్తి చేశామనిపిస్తున్నారు. కాంప్రెహెన్సివ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రామ్‌(సీఆర్‌ఎంపీ)లో భాగంగా పలు ప్రధాన రహదారులపై ఈ తంతు జరుగుతోంది. కేంద్ర కార్యాలయం అధికారుల దృష్టికి వచ్చిన ఈ తరహా పనులను నిలిపివేస్తుండగా, కొన్ని చోట్ల యథేచ్ఛగా సాగిపోతున్నాయి. బాగున్న రోడ్లనే కొన్ని ఏజెన్సీలు పునర్నిర్మిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


హైదరాబాద్‌ సిటీ : సీఆర్‌ఎంపీలో భాగంగా గ్రేటర్‌లోని 709 కి.మీల రహదారుల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను జీహెచ్‌ఎంసీ ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించింది. ఆరు జోన్లలో ఒక్కో జోన్‌ బాధ్యత ఒక్కో సంస్థ చూసుకుంటోంది. తరచూ అధ్వానంగా మారుతున్న గ్రేటర్‌ రోడ్లతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని భావించిన సర్కారు.. రోడ్ల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించింది. ఐదేళ్ల కాల వ్యవధికి రూ.1687 కోట్లతో ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే సంవత్సరం గడిచింది. అయితే ఎంపికైన సంస్థలు చేపడుతున్న పనుల తీరు, విధానం విమర్శలకు దారి తీస్తోంది.


ఒప్పందం ఇలా

ఒప్పందం ప్రకారం రహదారులు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, మరమ్మతుతోపాటు ఆ స్ర్టెచ్‌లలో పారిశుధ్యం, డ్రెయిన్‌లు, సెంట్రల్‌ మీడియన్ల నిర్వహణను ఆయా ఏజెన్సీలు చూసుకోవాలి. మొదటి సంవత్సరం 50 శాతం రహదారులు (355 కి.మీలు) నిర్మించాలి. రెండో ఏడాది 30 శాతం, మూడో సంవత్సరం 20 శాతం రోడ్లు నిర్మించాలి. మొదటి సంవత్సరం నుంచి గుంతల పూడ్చివేత, డ్రైనేజీ లీకేజీ లను అరికట్టడం ఇతరత్రా నిర్వహణ పనులు ఏజెన్సీలే చూసుకోవాలి. ముందుగా పాడైన రహదారులను పునర్నిర్మించాలి.


గతంలోలా కార్పెటింగ్‌, రీ కార్పెటింగ్‌ కాకుండా, మిల్లింగ్‌ చేసి కేంబర్‌ సరిగా ఉండేలా, వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా పనులు చేయాలి. పలు ఏజెన్సీలు బాగున్న రోడ్లకు పై పైన మిల్లింగ్‌ చేసి మమ అనిపిస్తున్నారు. హిమాయత్‌నగర్‌ రహదారిలో ఇదే జరిగింది. మెరుగ్గా ఉన్న రోడ్డుపై మిల్లింగ్‌ చేసి పనులు చేపట్టేందుకు ఏజెన్సీతో కలిసి జోనల్‌, సర్కిల్‌ అధికారులు రంగం సిద్ధం చేశారు. దాదాపు 500 మీటర్ల మేర రెండు వైపులా మిల్లింగ్‌ చేశారు. అటుగా వెళ్లిన ఉన్నతాధికారి అది చూసి రోడ్డు బాగున్నప్పుడు పనులు చేయడమెందుకని అసహనం వ్యక్తం చేశారు. 


మాన్‌సూన్‌ దృష్ట్యా బంద్‌

వర్షాకాలం నేపథ్యంలో రహదారుల నిర్మాణాన్ని నిలిపివేయాలని నిర్ణయించినట్టు ఓ అధికారి చెప్పారు. ఇప్పటికే మిల్లింగ్‌ చేసిన చోట నిర్మాణ పనులు సాగనున్నాయి. ఇతర ప్రాంతాల్లో రహదారుల తవ్వకం, మిల్లింగ్‌, నిర్మాణ పనులపై నిషేధం విధించారు. 


ఇవీ వివరాలు...

గ్రేటర్‌లో మొత్తం రోడ్లు- 9103 కి.మీలు

సీఆర్‌ఎంపీకి ఇచ్చినవి- 709 కి.మీలు

ఇప్పటి వరకు నిర్మించినవి- 350 కి.మీలు

మొదటి యేడాది నిర్మించాల్సినవి- 355 కి.మీలు 

ప్రస్తుత సంవత్సరం టార్గెట్‌-95 కి.మీలు

Updated Date - 2021-06-22T17:53:57+05:30 IST