మాకొద్దా.. కార్పొరేట్‌ విద్య.. కేసీఆర్ సర్కార్‌పై విద్యార్థుల ఆగ్రహం!

ABN , First Publish Date - 2021-06-24T19:28:29+05:30 IST

ఇతను 2020-21లో బహదూర్‌పుర మండలంలోని ఎంజేపీటీబీసీఆర్‌డబ్ల్యూఎస్‌లో పదో తరగతి పూర్తి చేసి

మాకొద్దా.. కార్పొరేట్‌ విద్య.. కేసీఆర్ సర్కార్‌పై విద్యార్థుల ఆగ్రహం!

  • ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నగర విద్యార్థులు
  • 13 ఏళ్లుగా ఎదురుచూస్తున్న పరిస్థితి
  • ఈ-పాస్‌ వెబ్‌సైట్‌లో చూపించని హైదరాబాద్‌ ఆప్షన్‌
  •  గ్రామీణ ప్రాంత పిల్లలకు అందుతున్న ఉచిత విద్య

ఈ చిత్రంలో కనిపిస్తున్న విద్యార్థి పేరు పంజాల ప్రేమ్‌నివాస్‌. నగరంలోని డీబీఆర్‌ మిల్లు మారుతీనగర్‌లో నివాసముంటున్న ఇతను 2020-21లో బహదూర్‌పుర మండలంలోని ఎంజేపీటీబీసీఆర్‌డబ్ల్యూఎస్‌లో పదో తరగతి పూర్తి చేసి 10 జీపీఏ సాధించాడు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-పాస్‌ విధానం ద్వారా హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ కాలేజీలో ఉచిత సీటు పొందేందుకు ఇటీవల ఈపా్‌స.సీజీజీ.గౌట్‌.ఇన్‌ వెబ్‌సైట్‌ను ఆశ్రయించాడు. కాగా, సైట్‌లో ఇతర జిల్లాల్లోని కాలేజీల వివరాలు చూపిస్తున్నప్పటికీ హైదరాబాద్‌ జిల్లా ఆప్షన్‌ కనిపించడం లేదు. నాలుగు రోజులుగా పదేపదే సైట్‌ను తెరిచి సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేస్తున్నప్పటికీ నగరంలోని కాలేజీలు కనిపించకపోవడంతో ఆందోళనకు గురవుతున్నాడు. ఈనెల 30తో దరఖాస్తు గడువు ముగుస్తుందని ఆవేదనకు లోనవుతున్నాడు. ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్‌ కాలేజీల్లో ఉచిత సీట్లు ఇచ్చి నాణ్య మైన విద్యను అందిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో విఫలమవుతోందని చెప్పేందుకు ప్రేమ్‌నివాస్‌ ఓ ఉదాహరణగా నిలుస్తున్నాడు. 


హైదరాబాద్‌ సిటీ : భాగ్యనగరంలో కూలీనాలీ చేసుకుంటున్న తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి కాలేజీల్లో చదివించలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ఆశ్రమ పాఠశా లలు, సంక్షేమ వసతిగృహాలు, గురుకులాలు, జవహర్‌ నవోదయ, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లలో ఏటా పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్‌లో ప్రైవేట్‌ కాలేజీల్లో ఉచిత సీట్లు ఇప్పించి వారి భవిష్యత్‌కు బాటలు వేసేందుకు 2008లో అప్పటి ప్రభుత్వం ‘కార్పొరేట్‌ కాలేజీ’ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల పిల్లలతోపాటు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారు, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు ఈ అవకాశం కల్పిస్తూ ముందుకుసాగుతోంది. 


ఒక్కో విద్యార్థికి రూ.35 వేలు..

కార్పొరేట్‌ కాలేజీ విద్యలో భాగంగా రాష్ట్రంలోని ప్రైవేట్‌ కార్పొరేట్‌ కళాశాలల్లో ప్రతి ఏటా 25 శాతం సీట్లను భర్తీ చేస్తుంటారు. వాస్తవంగా పదో తరగతిలో 7 జీపీఏ కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు కార్పొరేట్‌ కళాశాలల్లో చేర్పించి వారి భవిష్యత్‌ విద్యాభివృద్ధికి బాటలు వేసేందుకు ప్రభుత్వం చేపట్టిన  ఈ కార్యక్రమం హైదరాబాద్‌ నగర పరిధిలో అమలుకావడం లేదు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని కాలేజీల్లో నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్య అందుతున్నప్పటికీ నగరంలోని పిల్లలకు అందని ద్రాక్షగా మారడంతో వారు తప్పనిసరి పరిస్థితిలో ప్రభుత్వ కాలేజీల్లో చేరాల్సి వస్తోంది. కార్పొరేట్‌ విద్యలో భాగంగా ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ఏటా రూ.35 వేలు కేటాయిస్తున్నప్పటికీ హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని మురికివాడలు, బస్తీలు, పేదల కాలనీల్లో నివాసముంటున్న పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో యాజమాన్యాలు ఇష్టపడడం లేదు.


అందుకే హైదరాబాద్‌ ఆప్షన్‌ తొలగింపు..

రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే హైదరాబాద్‌లోనే పేరొందిన కాలేజీలున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కార్పొరేట్‌, దిగువ మధ్య తరగతి కాలేజీలు మొత్తం 520 వరకు ఉన్నాయి. ఇందులో కేవలం హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో 60 నుంచి 70 వరకు పేరొందిన కార్పొరేట్‌ కళాశాలలు నడుస్తున్నాయి. 13 ఏళ్ల క్రితం కార్పొరేట్‌ కాలేజీ విద్యను ప్రారంభించిన సమయంలోనే కళాశాలల యాజమాన్యాలు పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు ఆసక్తి చూపలేదని తెలిసింది. ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం ఇచ్చే రూ.35వేలతో చదువులు చెప్పే పరిస్థితి లేదని, చదువు కంటే నిర్వహణ భారం ఎక్కువవుతుందని భావించడంతోపాటు ప్రభుత్వం నుంచి డబ్బులు కూడా సకాలంలో రావంటూ వెనక్కి తగ్గారు. 


తామే నేరుగా విద్యార్థిని చేర్పించుకుని రెండేళ్ల పాటు ఇంటర్‌ క్లాసులు చెబితే ప్రభుత్వం ఇచ్చే దానికంటే మూడింతలు సంపాదించుకోవచ్చని నిర్ణయించుకని, నగర పరిధిలోని యాజమాన్యాలు కార్పొరేట్‌ విద్యకు నిరాకరించాయి. ఈ క్రమంలో ‘ఈపా్‌స.సీజీజీ.గౌట్‌.ఇన్‌ వెబ్‌సైట్‌’ నుంచి ప్రభుత్వం హైదరాబాద్‌ ఆప్షన్‌ను తొలగించింది. ఈ-పాస్‌ వెబ్‌సైట్‌లో ఇతర జిల్లాల విద్యార్థుల నుంచి అడిగినట్లుగా.. విద్యార్థి తల్లి డ్వాక్రా సంఘం సభ్యురాలిగా ఉండడం, నిరుపేదలు, తండ్రి వార్షిక ఆదాయం, హైదరాబాద్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల ఆప్షన్‌ వివరాలు అడుగుతున్నప్పటికీ ఆయా సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేస్తున్న సందర్భంగా తీసుకోవడంలేదని విద్యార్థులు వాపోతున్నారు. 


నగరంలో 1400 నోటిఫైడ్‌ మురికివాడలు..

హైదరాబాద్‌ నగరానికి ఉపాధి, ఉద్యోగం నిమిత్తం వివిధ రాష్ర్టాలు, జిల్లాల నుంచి లక్షలాది మంది వచ్చి స్థిరపడ్డారు. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల్లో కొందరు అద్దె ఇళ్లలో ఉండడంతోపాటు మరికొందరు గుడిసెలు వేసుకుని తాత్కాలికంగా ఉంటున్నారు. ప్రస్తుతం నగరంలోని 1400 నోటిఫైడ్‌ మురికివాడలుండగా, అనధికారికంగా మరో 400 ఉన్నాయి. ఆయా వాడల్లో దాదాపు 32 లక్షల కుటుంబాలు న్నాయి. అయితే రోజువారీ కూలీ పనులు చేసుకుని పిల్లలను పోషించుకుంటున్న పేదలు తమ పిల్లలను ప్రైవేట్‌ కాలేజీల్లో చదివించని పరిస్థితి నెలకొంది. ప్రైవేట్‌ యాజమాన్యాల వైఖరి కారణంగా మరోవైపు కార్పొరేట్‌ కాలేజీ విద్యకు కూడా దూరంగా ఉండాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్‌ జిల్లాలోని 182 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 2020లో 7,860 మంది విద్యార్థులు పదో తరగతి పూర్తిచేశారు. తాజాగా 2021లో 8,558 మంది ఉత్తీర్ణత సాధించారు.

 

జీఓలోనే ఆప్షన్‌ లేదు

‘కార్పొరేట్‌ కాలేజీ’ స్కీమ్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో హైదరాబాద్‌ ఆప్షన్‌ లేని మాట వాస్తవమే. దీనిని జీఓను అమలుచేసినప్పటి నుంచే అందుబాటులోకి తీసుకురాలేదు. చాలామంది పిల్లలు తమకు ఫోన్‌ చేసి అడుగుతున్నారు. ఈ విషయంలో తాము ఏమీ చేయలేం. - శ్రీనివా‌స్‌రెడ్డి, సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, హైదరాబాద్‌


పేద పిల్లలకు న్యాయం చేయాలి 

ప్రభుత్వం అందిస్తున్న కార్పొరేట్‌ కాలేజీ విద్య నగరంలోని పేద పిల్లలకు కూడా వర్తింపజేయాలి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌ జిల్లాలో చేపట్టపోవడం దారుణం. ప్రభుత్వ పట్టింపులేనితనం, ప్రైవేట్‌ యాజమాన్యాల నిర్లక్ష్యంతో మురికివాడల్లోని పిల్లలు పదో తరగతి వరకే చదువును ఆపేయాల్సి వస్తోంది. కరోనా నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు కార్పొరేట్‌ కాలేజీల్లో ఈ ఏడాది పూర్తిగా ఉచిత విద్యనందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. - శ్రీహరి, ఏబీవీపీ సెంట్రల్‌ వర్కింగ్‌ కమిటీ మెంబర్‌

Updated Date - 2021-06-24T19:28:29+05:30 IST