హైదరాబాద్‌ నుంచి విజయవాడకు.. బస్సుల్లో బంగారం అక్రమ రవాణా

ABN , First Publish Date - 2021-01-25T15:43:19+05:30 IST

హైదరాబాద్‌ నుంచి విజయవాడకు బస్సుల్లో బంగారం అక్రమంగా..

హైదరాబాద్‌ నుంచి విజయవాడకు.. బస్సుల్లో బంగారం అక్రమ రవాణా

హైదరాబాద్‌ నుంచి బెజవాడకు తరలింపు 

విజయవాడలో ప్రత్యేక కార్యాలయం 

అక్కడి నుంచి షాపులకు సరుకు చేరవేత

1.7 కిలోల బంగారం, 1.4 కిలోల వెండి స్వాధీనం


విజయవాడ(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నుంచి విజయవాడకు బస్సుల్లో బంగారం అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం నిర్వహించిన దాడుల్లో నలుగురిని అదుపులోకి తీసుకొని 1.7 కిలోల బంగారం, 1.4 కిలోల వెండి ఆభర ణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సరుకును గవర్నరుపేట పోలీసులకు అప్పగించారు. వివరాలు... లాక్‌డౌన్‌ తర్వాత విజయవాడ బందరు లాకుల వద్ద సూర్య లాజిస్టిక్స్‌ పేరుతో ముంబైకి చెందిన వ్యక్తి కార్యాలయాన్ని తెరిచాడు. రాజస్థాన్‌లోని ధాల్‌పూర్‌కు చెందిన కృష్ణకాంత్‌శర్మ, కరమ్‌సింగ్‌ హైదరాబాద్‌ నుంచి బంగారం, వెండి ఆభరణాలను ప్రత్యేక బ్యాగ్‌ల్లో విజయవాడకు బస్సుల్లో తీసుకొస్తారు. వాటిని సూర్య లాజిస్టిక్స్‌ నుంచి విజయవాడతో పాటు గుంటూరు, తెనాలి, ఏలూరు, తణుకు, కాకినాడ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముందుగా ఫోన్ల ద్వారా తీసుకున్న ఆర్డర్ల ప్రకారం ఆభరణాలు సిద్ధం చేసి ఉంచుతారు. వాటిని మధ్యప్రదేశ్‌లోని మోరేనాకు చెందిన రోహిత్‌ తోమర్‌, రాజస్థాన్‌లోని ధాల్‌పూర్‌కు చెందిన దిలీప్‌సింగ్‌ కొరియర్లుగా వ్యవహరించి షాపులకు చేరవేస్తున్నారు.


హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వస్తున్న సరుకుతో పాటు షాపులకు విక్రయిస్తున్న ఆభరణాలకు ఎలాంటి బిల్లులూ ఉండవు. అయినా దీనికి సంబంధించిన సుంకాలను మాత్రం వ్యాపారులు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. ఈ అక్రమ లావాదేవీలన్నీ ఫోన్లలో జరుగుతుంటాయి. వ్యాపారులు కొంతమంది వ్యక్తులను హైదరాబాద్‌లో ఉండే స్మగ్లర్ల వద్దకు పంపుతున్నారు. కావాల్సిన ఆభరణాలకు ఆర్డర్‌ ఇచ్చి వారు వచ్చేస్తున్నారు. మొత్తం సరుకును విజయవాడకు తరలించి, షాపులకు చేరవేసే బాధ్యతను మాత్రం స్మగర్లు తీసుకుంటున్నారు. దాడుల్లో చిక్కిన నలుగురే కాకుండా ఇంకా కొంతమంది ఇదే మార్గంలో ఉన్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  


Updated Date - 2021-01-25T15:43:19+05:30 IST