హైదరాబాద్... యూనికార్న్‌ ‘సిటీ’... యూనికార్న్‌గా డార్విన్‌బాక్స్...

ABN , First Publish Date - 2022-01-26T21:22:54+05:30 IST

కనీసం బిలియన్‌ డాలర్ల విలువ కలిగిన స్టార్ట‌ప్‌లను యూనికార్న్‌లుగా వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో చోటు సంపాదించుకునేందుకు స్టార్టప్‌లు పోటీ పడుతుంటాయి.

హైదరాబాద్... యూనికార్న్‌ ‘సిటీ’... యూనికార్న్‌గా డార్విన్‌బాక్స్...

హైదరాబాద్ : కనీసం బిలియన్‌ డాలర్ల విలువ కలిగిన స్టార్ట‌ప్‌లను యూనికార్న్‌లుగా వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో చోటు సంపాదించుకునేందుకు స్టార్టప్‌లు పోటీ పడుతుంటాయి. మొదటిసారిగా యూనికార్న్‌లకు వేదికైన నగరాల జాబితాలో... ‘హైదరాబాద్‌’ చోటు సంపాదించుకుంది. హైదరాబాద్‌కు చెందిన డార్విన్‌బాక్స్‌ అనే హెచ్‌ఆర్‌ టెక్నాలజీ స్టార్టప్‌...  తొలి హైదరాబాదీ యూనికార్న్‌గా అవతరించింది. తాజా విడత ఫండింగ్‌లో భాగంగా పలువురు ఇన్వెస్టర్ల నుంచి 7.2 కోట్ల డాలర్ల (సుమారు రూ. 540 కోట్లు)ను డార్విన్‌బాక్స్ సమీకరించింది. తద్వారా కంపెనీ మార్కెట్‌ విలువ బిలియన్‌ డాలర్ల (100 కోట్ల డాలర్లు=రూ. 7,500 కోట్లు)కు చేరుకుందని డార్విన్‌బాక్స్‌ తాజాగా వెల్లడించింది.


ఏడేళ్ళ క్రితం... 2015 లో జయంత్ పాలేటి, రోహిత్ చెన్నమనేని, చైతన్య పెద్ది ఈ సంస్థను స్థాపించారు. డార్విన్‌బాక్స్, అటెండెన్స్, పేరోల్, ఉద్యోగుల ఆన్‌బోర్డింగ్ తదితర విధులను డిజిటలైజ్ చేస్తూ హెచ్‌ఆర్ టెక్ స్పేస్‌లో పని చేస్తోంది. దీని ఇతర పెట్టుబడిదారులలో సీక్వోయా, లైట్‌స్పీడ్ ఇండియా, సేల్స్‌ఫోర్స్ వెంచర్స్ ఉన్నాయి. కంపెనీ ఉత్పత్తుల ఆవిష్కరణను వేగవంతం చేయడంతో పాటు అంతర్జాతీయ విస్తరణకు ఈ నిధులను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఈ ఏడాదిలోనే అమెరికాకు విస్తరించనున్నట్లు వెల్లడించింది. అమెరికా నుంచి కాకుండా, ప్రధానంగా భారతదేశం నుంచి వచ్చే ఆదాయం కలిగిన ఏకైక భారతీయ


సాఫ్ట్‌వేర్ యునికార్న్‌లలో ఇది కూడా ఒకటి.  జేఎస్‌డబ్ల్యూ, అదానీ, మహీంద్రా, వేదాంత, ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌, కోటక్‌, టీవీఎస్‌, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ), రామ్‌కీ, అరబిందో, యశోదా, బిగ్‌బాస్కెట్‌, స్విగ్గీ, మేక్‌ మై ట్రిప్‌ తదితర దేశీయ సంస్థలు సహా అంతర్జాతీయంగా 650 కంపెనీలకు హెచ్‌ఆర్‌ టెక్నాలజీ సేవలందిస్తోంది. డార్విన్‌బాక్స్‌కు ప్రపంచవ్యాప్తంగా పన్నెండు కార్యాలయాలు ఉన్నాయి. ఎనిమిది నెలల్లో ఆగ్నేయాసియాలో అగ్రగామిగా ఎదగడంపై దృష్టి సారించామని, ఆ తర్వాత మిడిల్ ఈస్ట్, ఆపై ఐపీఓకు వెళతామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు రోహిత్ చెన్నమనేని పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-26T21:22:54+05:30 IST