Indira Parkలో ఏంటిది.. ‘Hyderabad లో ఉన్నామా.. అఫ్ఘాన్‌లో ఉన్నామా’ ..!?

ABN , First Publish Date - 2021-08-27T14:43:22+05:30 IST

మనం అఫ్ఘాన్‌లో ఉన్నామా, హైదరాబాద్‌లో ఉన్నామా...

Indira Parkలో ఏంటిది.. ‘Hyderabad లో ఉన్నామా.. అఫ్ఘాన్‌లో ఉన్నామా’ ..!?

  • పెళ్లైన జంటకే ప్రవేశం..
  • ఇందిరాపార్కు ప్రవేశ ద్వారం ముందు ఫ్లెక్సీ 
  • కొత్త నిబంధనపై పౌర సమాజం, మహిళా సంఘాల ఆగ్రహం
  • ‘అఫ్ఘాన్‌లో ఉన్నామా’ అంటూ సోషల్‌మీడియాలో విమర్శలు..
  • బ్యానర్‌ తొలగించిన అధికారులు

హైదరాబాద్‌ సిటీ : ‘‘పెళ్లి కాని జంటకు పార్కులోకి ప్రవేశం లేదు’’ అంటూ అధికారులు ఇందిరాపార్కు బయట ఫ్లెక్సీ కట్టారు. ‘ఇదెక్కడి నిబంధన’ అంటూ పౌర సమాజ ప్రతినిధులు, మహిళా సంఘాల కార్యకర్తల జీహెచ్‌ఎంసీ తీరును నిరసించారు. ‘‘తాలిబాన్‌ మరెక్కడో లేరు, మన చుట్టూనే ఉన్నారంటూ’’ సోషల్‌ మీడియా వేదికగా విమర్శించారు. ‘‘మనం అఫ్ఘాన్‌లో ఉన్నామా, హైదరాబాద్‌లో ఉన్నామా. చెత్త తొలగించాల్సిన జీహెచ్‌ఎంసీ ఇలాంటి చెత్త నిర్ణయాలు తీసుకోవడమేంటి’’ అని భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌  నిర్వాహకురాలు కొండవీటి సత్యవతి సోషల్‌మీడియా  ద్వారా సంబంధిత అధికారులను నిలదీశారు. నిబంధన పెట్టారు సరే, ఒక జంట పెళ్లైన వారా, కానివారా అని ఎలా నిర్ధారిస్తారనేది పెద్ద ప్రశ్న. పార్కుకెళ్లాలంటే మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ వెంట తీసుకెళ్లాలా అంటూ మరి కొందరు నెటిజన్లు వ్యంగ్యంగా పోస్టులు పెట్టారు.


ఫ్లెక్సీ తొలగింపు..

ఇందిరా పార్కు పాలనాధికారుల తీరుపై మహిళా సంఘాల ప్రతినిధులు ట్విటర్‌లోనూ నిరసనలు వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో నిరసనలు వెల్లువెత్తడంతో సంబంధిత అధికారులు గురువారం ఉదయం బ్యానర్‌ను తొలగించారు. ఇదే విషయంపై అర్బన్‌ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌ మురళీధర్‌ సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. ఫ్లెక్సీ పెట్టడంపై విచారం వ్యక్తం చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా, పార్కు వాతావరణాన్ని పరిరక్షించాల్సిందిగా తాము స్థానిక పోలీసులకు విన్నవించినట్లు ఆయన తెలిపారు. సందర్శకులు తమ వంతు బాధ్యతగా మెలగాలని సూచించారు.


బోసిపోయిన పార్కు

కొత్త నిబంధనతో మూడు రోజులుగా ఇందిరాపార్కు బోసిపోయింది. ఇక్కడకు వచ్చిన ప్రేమ జంటలు పార్కులోకి ఎందుకు అనుమతి ఇవ్వరంటూ సిబ్బందితో గొడవలకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. తాజాగా   అక్కడ ఫ్లెక్సీ తొలగించడంతో పాటు గురువారం ప్రేమ జంటలకు కూడా పార్కులోకి ప్రవేశం కల్పించారు.


చర్యలు తీసుకోవాలి కానీ..

పెళ్లైన జంటలను మాత్రమే పార్కులోకి రానిస్తామనడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19డీ, 19ఇ ప్రకారం ఫ్రీడం ఆఫ్‌ మూమెంట్‌ను హరించడమే అని సామాజిక కార్యకర్త తోట రాంబాబు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర చేష్టలు చట్ట విరుద్ధం. అశ్లీలకరమైన పనులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవచ్చు. అంతేకానీ, ఒకటో, రెండో అలాంటి ఘటనలు జరుగుతున్నాయనే నెపంతో ఇటువంటి నిబంధన విధించడం సరికాదని రాంబాబు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2021-08-27T14:43:22+05:30 IST