దర్శిలో హైడ్రామా

ABN , First Publish Date - 2021-11-09T05:51:38+05:30 IST

దర్శి నగర పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగింపు రోజైన సోమవారం అక్కడ పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎక్కువ వార్డులను ఏకగ్రీవం చేసుకోవాలని భావించిన వైసీపీ నాయకులు టీడీపీ అభ్యర్థులను లోబర్చుకునేందుకు ప్రయత్నించారు. సామ, దాన, భేదదండోపాయాలను వినియోగించారు. కానీ మొత్తం 20వార్డుల్లో ఒక్కచోట మాత్రమే ఆ ప్రయత్నం ఫలించింది. నగర పంచాయతీలోని 8వ వార్డుకు దాఖలైన నామినేషన్లలో పరిశీలన అనంతరం ఐదు చెల్లినట్లు అధికారులు ప్రకటించారు.

దర్శిలో హైడ్రామా
దర్శి మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులు

నగర పంచాయతీ ఎన్నికల్లో 

టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణ 

ఎంపీడీవో కార్యాలయం ఎదుట 

ఆపార్టీ నేతల ధర్నా 

ఎన్నికల అధికారి నిర్ణయంపై 

అప్పీలు చేయాలని నిర్ణయం 


ఆంధ్రజ్యోతి, ఒంగోలు 

నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా దర్శి నగర పంచాయతీలో సోమవారం హైడ్రామా నడిచింది. ఉద్రిక్తతల నడుమ ఒక వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామినేషన్‌ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. దీన్ని నిరసిస్తూ టీడీపీ నాయకులు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఆయన నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఉన్నతాధికారులకు అప్పీలు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే వివాదాస్పదంగా మారిన ఆ వార్డు మినహా అన్ని చోట్లా టీడీపీ, కొన్ని వార్డుల్లో జనసేన, బీజేపీ, వామపక్షాల అభ్యర్థులు రంగంలో ఉన్నారు. దీంతో ఏకగ్రీవంతోనే అత్యధిక వార్డులను కైవసం చేసుకుని ముందుగానే విజయ ఢంకా మోగించాలన్న  వైసీపీ నాయకుల ఆశలు ఫలించ లేదు. 


దర్శి నగర పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగింపు రోజైన సోమవారం అక్కడ పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎక్కువ వార్డులను ఏకగ్రీవం చేసుకోవాలని భావించిన వైసీపీ నాయకులు టీడీపీ అభ్యర్థులను లోబర్చుకునేందుకు ప్రయత్నించారు. సామ, దాన, భేదదండోపాయాలను వినియోగించారు. కానీ మొత్తం 20వార్డుల్లో ఒక్కచోట మాత్రమే ఆ ప్రయత్నం ఫలించింది. నగర పంచాయతీలోని 8వ వార్డుకు దాఖలైన నామినేషన్లలో పరిశీలన అనంతరం ఐదు చెల్లినట్లు అధికారులు ప్రకటించారు. అందులో వైసీపీ, టీడీపీ తరుపున ఇద్దరేసి నామినేషన్లు దాఖలు చేయగా, ఒక స్వతంత్ర అభ్యర్థి  ఉన్నారు. వైసీపీ నాయకులు మేడగం మోహన్‌రెడ్డిని అధికారిక అభ్యర్థిగా ప్రకటించి రెండో వ్యక్తితో నామినేషన్‌ను ఉపసంహరింపజేశారు. అలాగే స్వతంత్ర అభ్యర్థి కూడా పోటీ నుంచి తప్పుకునేలా చేయగలిగారు. టీడీపీ అభ్యర్థులుగా బలహీనవర్గానికి చెందిన తండ్రీకొడుకులు చింతలపూడి సాంబయ్య, చింతలపూడి శ్రీనివాసరావు నామినేషన్‌ వేసి ఉన్నారు. అయితే అనూహ్యంగా 12 గంటలకు సాంబయ్య ఎన్నికల అధికారి వద్దకు వచ్చి తనతోపాటు తన కుమారుడు పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు చెప్పి ఇద్దరి ఉపసంహరణ పత్రాలను అందజేశారు. వైసీపీతోపాటు ఎమ్మెల్యే వేణుగోపాల్‌ వ్యక్తిగత అనుచరగణంతో ఆయన అక్కడకు కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. 


నేతలతో కలిసి టీడీపీ అభ్యర్థి బీఫారం 

నామినేషన్ల ఉపసంహరణ సమయం ముగియక ముందే మధ్యాహ్నం 2గంటల సమయంలో టీడీపీ నేతలు నారపుశెట్టి పాపారావు, పమిడి రమేష్‌తోపాటు టీడీపీ తరఫున నామినేషన్‌ వేసిన వారిలో ఒకరైన చింతలపూడి శ్రీనివాసరావును కలుపుకొని వచ్చిన టీడీపీ ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు నూకసాని బాలాజీ ఎన్నికల అధికారి అయిన గుత్తా శోభన్‌బాబుకు పార్టీ బీఫారం అందజేశారు. టీడీపీ తరఫున పోటీ చేసిన వారిలో ఒకరైన చింతలపూడి శ్రీనివాసరావును ఎన్నికల అధికారికి పరిచేయం చేసి ఆయనకు పార్టీ బీఫారంను కూడా ఇచ్చి రిసీవ్‌ సంతకాన్ని కూడా వారు తీసుకున్నారు. 3 గంటలకు నామినేషన్‌ ఉపసంహరణ గడువు ముగిసింది.


గడువు ముగిసినా అభ్యర్థులను ప్రకటించని ఎన్నికల అధికారి

సాయంత్రం ఐదు గంటలైనా రంగంలో మిగిలిన అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారి ప్రకటించ లేదు. దీంతో అందరిలోనూ టెన్షన్‌ ప్రారంభమైంది. ఏదో జరుగుతుందన్న అనుమానంతో టీడీపీ నేతలు కొందరు అక్కడకు చేరారు. అసలు విషయం ఏంటనేది అధికారికంగా చెప్పకపోయినా కొందరు టీడీపీ అభ్యరులు  నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించి వైసీపీ అభ్యర్థులు ఏకగీవ్రంగా గెలుపొందినట్లు నిర్ధారించబోతున్నారన్న సమాచారం బయటకు పొక్కింది. దీంతో అన్ని వార్డుల్లోని అభ్యర్థుల్లో ఆందోళన ప్రారంభమై ఎక్కడికక్కడే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 


అధికారులపై వైసీపీ నేతల ఒత్తిళ్లు

8వవార్డు టీడీపీ అభ్యర్థి నేరుగా వచ్చి బీఫారం సమర్పించినప్పటికీ అంతకుముందు తండ్రి ఇచ్చిన ఉపసంహరణ పత్రాన్ని ఆమోదించి వైసీపీ అభ్యర్థిని ఏకగ్రీవంగా ప్రకటించాలన్న ఒత్తిడిని వైసీపీ నేతలు ఎన్నికల అధికారులపై తెచ్చారు. ఈ దశలో ఆందోళన చెందిన టీడీపీ ముఖ్య నేతలంతా ఎన్నికల అధికారి వద్దకు వెళ్లి నిలదీసేందుకు సిద్ధమయ్యారు. ఆ పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడు స్థానిక నేతలకు ఫోన్‌ చేసి అవసరమైన సూచనలు చేశారు. ఇది తెలిసి రాత్రి 7 గంటల సమయంలో 8వ వార్డులో వైసీపీ అభ్యర్థి ఏకగీవ్రంగా గెలుపొందినట్లు ప్రకటిస్తూ మిగిలిన వార్డులో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారి అయిన ఎంపీడీవో విడుదల చేశారు. 


ఆందోళనకు దిగిన టీడీపీ నేతలు 

అభ్యర్థుల జాబితాను ప్రకటించిన కొద్దిసేపటికే ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌, ఇతర ముఖ్య నేతలు 8వ వార్డు విషయమై వివరణ ఇవ్వాలని ఎన్నికల అధికారిని పట్టుబట్టారు.  తాము వచ్చి అభ్యర్థి సమక్షంలో బీఫారం సమర్పించినప్పుడు ఏమీ చెప్పకుండా ఇప్పుడు ఆయన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారని పేర్కొనడంలో ఆంత్యరమేమిటని ప్రశ్నించారు. దీనికన్నా ముందుగానే టీడీపీ అభ్యర్థులిద్దరూ నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు తమకు పత్రాలు అందాయని, ఆవిషయాన్ని మీరు వచ్చినప్పుడు చెప్పాల్సిన అవసరం లేదని ఎంపీడీవో స్పష్టం చేశారు. దీంతో జనార్దన్‌తోపాటు, పార్టీ అధ్యక్షుడు బాలాజీ, నియోజకవర్ట టీడీపీ ఇన్‌చార్జి పమిడి రమేష్‌, మాజీ ఎమ్మెల్యేలు పాపారావు, నారాయణరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. నామినేషన్‌ వేసిన అభ్యర్థే స్వయంగా తాను ఉపసంహరించుకోలేదని చెప్తుంటే మీరు పట్టించుకోరా అంటూ నిలదీశారు. దీంతో ఆయన తండ్రి ఇచ్చిన రెండు ఉపసంహరణ పత్రాలను ఎన్నికల అధికారి చూపించారు. అందులో శ్రీనివాసరావు పేరుతో ఉన్న సంతకం ఫోర్జరీ అని టీడీపీ నేతలు ఆరోపించారు. ఆ సంతకం తాను చేయలేదని శ్రీనివాసరావు కూడా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లుగానే భావించి వైసీపీ అభ్యర్థి ఏకగీవ్రమైనట్లు ప్రకటించారు. సుమారు అర్ధగంట సేపు నిరసన తెలిపిని టీడీపీ నేతలు ఈ సమస్యపై మంగళవారం ఆర్డీవో కోర్టులో అప్పీలు చేస్తామని, చివరికంతా న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించి వెళ్లిపోయారు.




Updated Date - 2021-11-09T05:51:38+05:30 IST