‘డబుల్‌’ ఇళ్ల పంపిణీలో హైడ్రామా

ABN , First Publish Date - 2022-06-25T09:40:27+05:30 IST

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీలో శుక్రవారం హైడ్రామా నెలకొంది. నిర్మాణం పూర్తయిన ఇళ్ల పంపిణీకి

‘డబుల్‌’ ఇళ్ల పంపిణీలో హైడ్రామా

దుబ్బాక గృహప్రవేశాలకు రావాలని మంత్రి హరీశ్‌కు 

ఎమ్మెల్యే రఘునందన్‌ ఆహ్వానం

మంత్రి రాకపోవడంతో లబ్ధిదారులతో గృహప్రవేశాలు


దుబ్బాక, జూన్‌ 25: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీలో శుక్రవారం హైడ్రామా నెలకొంది.  నిర్మాణం పూర్తయిన ఇళ్ల పంపిణీకి మంత్రి హరీశ్‌రావును స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆహ్వానించినా రాలేదు. దీంతో కొద్దిమంది లబ్ధిదారులతోనే ఎమ్మెల్యే గృహప్రవేశం చేయించడం చర్చనీయాంశంగా మారింది. 2016లో దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణం మూడేళ్ల క్రితం పూర్తయింది. కరోనాతో పాటు రామలింగారెడ్డి అకాల మరణం కారణంగా ఇళ్ల పంపిణీ ఆగిపోయింది. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నప్పటికీ.. ఆయన పర్యటన వాయిదాపడింది. ఈ క్రమంలో 15 రోజుల క్రితం మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సమీక్ష జరిపి, ఇళ్ల పంపిణీకి అన్నీ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.


మరోవైపు ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఈ నెల 25లోపు ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని ప్రకటించారు. దీనికి మంత్రి హరీశ్‌రావును కూడా ఆహ్వానించారు. ఆ మరుసటి రోజే ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తన స్వగ్రామం పోతారంలో అధికారులు, మునిసిపల్‌ టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లతో సమీక్ష జరిపారు. ఈ నెల 30న మంత్రి హరీశ్‌రావుతో ఇళ్లను ప్రారంభించాలని నిర్ణయించారు. కాలనీలో 872 ఇళ్లకు గానూ, 180 ఇళ్లను పంపిణీకి సిద్ధం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు శుక్రవారం కొంతమంది లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు దూరంగా ఉన్నారు. 


ప్రచారం కోసం ఎమ్మెల్యే హంగామా: ఎంపీ ప్రభాకర్‌రెడ్డి

పబ్లిసిటీ కోసం స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న హంగామాను టీఆర్‌ఎస్‌ శ్రేణు లు పట్టించుకోవద్దని ఎంపీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంత్రి వస్తేనే అక్కడ మిగిలిపోయిన పనులు పూర్తవుతాయని చెప్పారు. బాధ్యత లేని ఎమ్మెల్యే పనులు పూర్తి కాకుండానే, ఇళ్ల నిర్మాణంలో శ్రమించిన ప్రజాప్రతినిధులను విస్మరించి గృహప్రవేశం చేయించడం కుట్రగా గమనించాలన్నారు.  

Updated Date - 2022-06-25T09:40:27+05:30 IST