పోలవరంపై వంచన!

ABN , First Publish Date - 2020-11-01T06:32:22+05:30 IST

‘‘మనవాళ్లు ఎంత సన్నాసులో ఢిల్లీ వాళ్లకు తెలిసిపోయింది’’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు గానీ, ‘‘మనవాళ్లు ఉత్తవెధవాయిలోయ్‌’’ అని కన్యాశుల్కం...

పోలవరంపై వంచన!

నవ్యాంధ్ర అభ్యుదయానికి ఆవశ్యకమైన పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నోరు మెదపకపోవడానికి కారణం ఏమిటి? రాజ్యసభలో ప్రభుత్వానికి సంబంధించిన కీలక బిల్లులు ఆమోదం పొందాలంటే జగన్‌రెడ్డి మద్దతు అవసరం. ఈ అవసరాన్ని అడ్డుపెట్టుకుని ప్రాజెక్టు అంచనా వ్యయం 55 వేల కోట్ల రూపాయలను మంజూరు చేయాల్సిందేనని జగన్‌రెడ్డి కేంద్రాన్ని నిలదీయవచ్చు గదా? అలా చేయలేకపోతున్నారంటే అవినీతి కేసులకు సంబంధించి జగన్‌రెడ్డి భయపడుతున్నట్టేనని భావించాల్సి ఉంటుంది. తనపై కేసులున్నా లెక్క చేయకుండా న్యాయవ్యవస్థనే ఢీకొంటున్న జగన్‌ కేంద్రంలోని పెద్దలను నిలదీయలేరా? అలా జరగడం లేదంటే కేంద్రప్రభుత్వ పెద్దలకు భయపడుతున్నట్టే కదా? అదే నిజమైతే ‘‘నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించలేను, రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతోనే ఫలానా గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తాను’’ అని అయినా జగన్‌ హామీ ఇవ్వాలి. 


పోలవరం ప్రాజెక్టు మూలనపడబోతోందని తెలిసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌లో పోరాటస్ఫూర్తి రగలకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటానికి అండదండలు అందించడమే కాకుండా, నాటి పోరాటానికి మార్గదర్శకత్వం చేసిన ఆంధ్ర ప్రాంత నాయకులు, ప్రజలలో ఆ స్ఫూర్తి ఏమైపోయిందో మరి! నిలువెత్తు దగా జరుగుతున్నదని తెలిసి కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కుల, మతాల రొచ్చులో కూరుకుపోయి, ఆ దుర్గంధానికే అలవాటు పడిపోయి ప్రభుత్వం వేసే ముష్టి కోసం అర్రులు చాచడం కంటే దౌర్భాగ్యం ఏముంటుంది? ఇదంతా గమనించిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తనలోని ఆవేదనను వెళ్లగక్కారు. శషభిషలు లేకుండా ముఖ్యమంత్రిని కడిగిపారేశారు. ఉండవల్లి బాటలో ఇతరులు కూడా ఇప్పటికైనా నోరు విప్పకపోతే రాష్ర్టానికి తీరని ద్రోహం చేసిన వారవుతారు. సహాయ పునరావాస ప్యాకేజీకి నిధులు ఇవ్వకపోతే పోలవరం ప్రాజెక్టు ఎలా పూర్తవుతుందో చెప్పాలని కేంద్రంలోని పెద్దలను నిలదీయాల్సిన తరుణం కాదా ఇది?


‘‘మనవాళ్లు ఎంత సన్నాసులో ఢిల్లీ వాళ్లకు తెలిసిపోయింది’’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు గానీ, ‘‘మనవాళ్లు ఉత్తవెధవాయిలోయ్‌’’ అని కన్యాశుల్కం నాటకంలో గిరీశం పాత్ర ద్వారా గురజాడ అప్పారావు దశాబ్దాల క్రితమే చెప్పించారు. ఆంధ్రుల గురించి ఇలాంటి వ్యాఖ్యలు వెలువడటం కొంతమందికి బాధాకరంగా అనిపించవచ్చు గానీ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఈ వ్యాఖ్యల వెనుక ఆవేదన ఉందని అర్థం అవుతుంది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలోనే పేర్కొన్నప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం 20 వేల కోట్ల రూపాయలకు మించి ఇవ్వబోమని తేల్చి చెబుతున్నా, ఇటు రాజకీయ పార్టీలలో, అటు ప్రజలలో కనీస స్పందన లేకపోవడం ఎవరికైనా ఆవేదన కలిగించక మానదు. ఈ నేపథ్యంలోనే ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తన సహజ శైలి అయిన వ్యంగ్యాన్ని జోడించకుండా పోలవరం ప్రాజెక్టుకు పట్టిన దుర్గతిపై తనలోని ఆవేదనను బయటపెట్టారు. ఏ ప్రాజెక్టును చేపట్టాలన్నా ముందుగా భూసేకరణ చేయాల్సి ఉంటుంది. నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి. ఈ రెండింటికీ అయ్యే వ్యయాన్ని కలుపుకుని ప్రాజెక్టు వ్యయాన్ని నిర్ణయిస్తారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో మాత్రం భూసేకరణకు, పునరావాసానికి అయ్యే వ్యయాన్ని తాము భరించబోమని, కేవలం నిర్మాణ వ్యయాన్ని మాత్రమే చెల్లిస్తామని కేంద్రప్రభుత్వం తాజాగా తేల్చిచెప్పింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస ప్రతిఘటన లేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కోస్తా ప్రాంతానికే కాకుండా అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ ప్రజలకు తాగు, సాగునీటి అవసరాలను తీర్చే పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా కేంద్రప్రభుత్వం ఉదారంగా వ్యవహరించకపోగా, ప్రధాన రాజకీయ పార్టీల బలహీనతలను అడ్డుపెట్టుకుని బాధ్యత నుంచి తప్పుకోవాలని చూడటం దారుణం కాదా? ఈ వంచనలో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి ఎంత బాధ్యత ఉందో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కూడా అంతే బాధ్యత ఉంది. ఇలాంటి సందర్భాలలో మిగతా దక్షిణాది రాష్ర్టాల స్పందనను గుర్తుకు తెచ్చుకుని అయినా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, మేధావులనబడే వారు సిగ్గుపడాలి. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా కేరళ మొత్తం కదిలింది. కావేరి జల వివాదంపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేసేది లేదని కర్ణాటక ప్రభుత్వం ఖరాకండిగా చెప్పేసింది. ప్రజలంతా అండగా నిలిచారు.


తమిళనాడులో జల్లికట్టు క్రీడను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తమిళులు మండిపడ్డారు. సినీ తారలు సైతం జల్లికట్టుకు మద్దతుగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఫలితంగా కేంద్రప్రభుత్వం దిగివచ్చి ప్రత్యేక అఫిడవిట్‌ దాఖలు చేయడంతో, ఉభయ కుశలోపరిగా సుప్రీంకోర్టు తన తీర్పును సవరించుకుంది. ప్రత్యేక రాష్ట్రం కోసం మొత్తం తెలంగాణ ప్రజానీకం ఏకమై ఉద్యమించి రాష్ర్టాన్ని సాధించుకుంది. గుజ్జర్లు, జాట్ల పోరాటం, ఉత్తరాదిన రైతుల ఉద్యమాలు ఈ కోవలోకే వస్తాయి. పోలవరం ప్రాజెక్టు మూలనపడబోతోందని తెలిసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌లో పోరాటస్ఫూర్తి రగలకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటానికి అండదండలు అందించడమే కాకుండా, నాటి పోరాటానికి మార్గదర్శకత్వం చేసిన ఆంధ్ర ప్రాంత నాయకులు, ప్రజలలో ఆ స్ఫూర్తి ఏమైపోయిందో మరి! నిలువెత్తు దగా జరుగుతున్నదని తెలిసి కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కుల, మతాల రొచ్చులో కూరుకుపోయి, ఆ దుర్గంధానికే అలవాటు పడిపోయి ప్రభుత్వం వేసే ముష్టి కోసం అర్రులు చాచడం కంటే దౌర్భాగ్యం ఏముంటుంది? ఇదంతా గమనించిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తనలోని ఆవేదనను వెళ్లగక్కారు. తాను అమితంగా ఇష్టపడే రాజశేఖర్‌ రెడ్డి కుమారుడే ముఖ్యమంత్రిగా ఉన్నారని తెలిసి కూడా శషభిషలు లేకుండా ముఖ్యమంత్రిని కడిగిపారేశారు. పోలవరం ఆగిపోతే ఉండవల్లి ఒక్కరే నష్టపోతారా? మిగతా గొంతులకు బాధ్యత లేదా? నిజానికి ఉండవల్లికి వ్యవసాయ భూములు ఉన్నాయో లేదో కూడా డౌటే. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కేసులకు భయపడి పోలవరం విషయంలో అన్యాయం జరుగుతున్నప్పటికీ నోరు మెదపడం లేదని ప్రజలు అనుకుంటున్నారని ఉండవల్లి తన మనసులోని మాటను బయటపెట్టారు. ఇలాంటి సందర్భాలలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి దారిలోకి తెచ్చుకోవాల్సిన మేధావులు నోళ్లకు తాళం వేసుకున్నారు. ఏడాదిన్నర క్రితం అయినదానికి, కానిదానికి హైదరాబాద్‌ నుంచి బయలుదేరి వెళ్లి అప్పటి ప్రభుత్వాన్ని తూర్పారబట్టి తిరిగి హైదరాబాద్‌లో సేద తీరుతూ గెరిల్లా తరహా యుద్ధం చేసిన మేధావులు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదో తెలియదు. అంటే ఆనాడు వారంతా పెయిడ్‌ ఉద్యమంలోని వారని భావించాలా? లేక వారు రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం అప్పటి ప్రతిపక్ష నాయకుడికి మేలు చేయడం కోసం పని చేశారని భావించాలా? జరిగిందేదో జరిగిపోయింది. కోరుకున్నవాడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. ఇప్పుడు పోలవరం ఆగిపోతే రాష్ట్రం పుట్టి మునుగుతుంది. ఇలాంటి సందర్భాలలో కూడా గొంతు ఎత్తనివారు మేధావులు ఎలా అవుతారు? ఒక జాతి మొత్తం చచ్చిపోయినా ఫర్వాలేదు గానీ, జీవచ్ఛవంగా మిగలకూడదని కవి సమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ తన వేయి పడగలు నవలలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ సమాజాన్ని చూస్తే విశ్వనాథ వారి మాటలు గుర్తుకు రాకుండా ఉంటాయా? ఉండవల్లి బాటలో ఇతరులు కూడా ఇప్పటికైనా నోరు విప్పకపోతే రాష్ర్టానికి తీరని ద్రోహం చేసిన వారవుతారు. సహాయ పునరావాస ప్యాకేజీకి నిధులు ఇవ్వకపోతే పోలవరం ప్రాజెక్టు ఎలా పూర్తవుతుందో చెప్పాలని కేంద్రంలోని పెద్దలను నిలదీయాల్సిన తరుణం కాదా ఇది? సంక్షేమ పథకాలకు, ఉద్యోగుల జీతాలకు కూడా అప్పులు చేస్తున్న రాష్ట్రప్రభుత్వం తన సొంత నిధులతో ఈ ప్రాజెక్టును పూర్తిచేయడం అసంభవం. ఇంకెన్నాళ్లీ వికృత రాజకీయ క్రీడ అని ప్రజలే ఉద్యమించాలి. లేనిపక్షంలో రాజధాని అమరావతికి ఏ గతి పట్టిందో పోలవరానికి కూడా అదే గతి పడుతుంది.


ఏం మారింది? ఎందుకు మారింది?

ఇంతకీ పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రప్రభుత్వం ఇప్పుడే ఈ వైఖరి ఎందుకు తీసుకుంది? రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య నెలకొన్న వైరం పుణ్యమా అని కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవాలని చూస్తోంది. ఇతర విషయాలలో మాదిరిగానే అధికార పార్టీ, నెపాన్ని ప్రతిపక్ష పార్టీపై నెట్టి చేతులు దులుపుకోవాలనుకుంటోంది. చంద్రబాబు నాశనం చేశారని చెబితే సరిపోతుందా? జరిగిన తప్పులను సరిచేయకపోతే ముఖ్యమంత్రిగా నువ్వెందుకు అని జగన్మోహన్‌ రెడ్డిని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సూటిగా ప్రశ్నించారు. ఇందులో హేతుబద్ధత ఉంది. ఇంతకీ పోలవరం ప్రాజెక్టు వ్యయం అమాంతం పెరగడానికి కారణం ఏమిటి? అప్పుడు అధికార, ప్రతిపక్షాలు ఏ వైఖరి తీసుకున్నాయో ఇప్పుడు చూద్దాం. పోలవరం ప్రాజెక్టు ఎత్తుకు సంబంధించి.. ఆమోదం పొందిన డిజైన్లకు భిన్నంగా చంద్రబాబు ఎత్తు మరింత పెంచాలని నిర్ణయించారు. ఇందుకోసం అదనపు భూమిని సమీకరించాల్సి వచ్చింది. ఫలితంగా సహాయ పునరావాస ప్యాకేజీ వ్యయమే 30 వేల కోట్ల రూపాయలకు పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 55 వేల కోట్లకు పెంచుతూ రాష్ట్రప్రభుత్వం పంపిన ప్రతిపాదనను కేంద్రంలోని టెక్నికల్‌ కమిటీ కూడా ఆమోదించింది. వాస్తవంగా ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెద్దగా పెరగలేదు. సహాయ పునరావాస ప్యాకేజీ పెరగడం వల్లనే మొత్తం వ్యయం 55 వేల కోట్లకు చేరిందన్నది వాస్తవం. పోలవరం ప్రాజెక్టు ఎత్తును పెంచాలన్న ప్రతిపాదనను చంద్రబాబు ప్రభుత్వం చేసి ఉండకపోతే ఇంత వ్యయం అయ్యేది కాదు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఎత్తు పెంపు నిర్ణయం తీసుకుని ఉంటారు. అయితే ఈ విషయాన్ని ఆనాడు ప్రభుత్వాధినేతగా గానీ, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా గానీ ఆయన బాహాటంగా చెప్పలేరు. అలా చెబితే ఎగువన ఉన్న రాష్ర్టాలు అభ్యంతరం చెబుతాయి. ఫలితంగా ప్రాజెక్టు వివాదాస్పదమవుతుంది. మళ్లీ అనుమతుల ప్రక్రియ మొదటికి వస్తుంది. అయినా ఈ రంగాలపై కనీస అవగాహన లేకుండా చంద్రబాబు అవినీతికి పాల్పడటం వల్లనే ప్రాజెక్టు వ్యయం పెరిగిందని ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన సొంత పత్రికలో పుంఖానుపుంఖాలుగా వార్తలు వండి వార్చారు. అంతటితో ఆగకుండా కేంద్ర ప్రభుత్వానికి కూడా వ్యయం పెంపుపై ఫిర్యాదు చేశారు.


కేంద్రం నిధులు ఇవ్వకపోతే రాష్ట్రప్రభుత్వం తన సొంత నిధులతో ప్రాజెక్టును పూర్తి చేయలేదా? అని కూడా ఆనాడు జగన్‌రెడ్డి ప్రశ్నించారు. కమీషన్లకు కక్కుర్తి పడే ప్రాజెక్టు నిర్మాణాన్ని చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిందని కూడా విమర్శించారు. చంద్రబాబు నాయుడిని రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికే జగన్‌ ఈ ఆరోపణలు చేసి ఉండవచ్చు. ఆయన అప్పట్లో చేసిన ఫిర్యాదులే ఇప్పుడు కేంద్రప్రభుత్వానికి అనువుగా మారాయి. చంద్రబాబు అవినీతి కారణంగా ప్రాజెక్టు వ్యయం అమాంతం పెరిగిందని గతంలో ఫిర్యాదు చేసినందున ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి ఏ మొఖం పెట్టుకుని 55 వేల కోట్లు ఇవ్వాల్సిందేనని కేంద్రాన్ని నిలదీయగలరు? అందుకే ‘‘20 వేల కోట్లకు మించి ఇవ్వం. తీసుకుంటే తీసుకోండి లేకపోతే పోండి’’ అని కేంద్రం గద్దించగలుగుతోంది. కేంద్ర టెక్నికల్‌ కమిటీ 55 వేల కోట్లకు ఆమోదం తెలిపినప్పుడు ఆ ఘనత తమదే అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అప్పట్లో ప్రకటించారు. అదే నిజమైతే కేంద్రం నుంచి 55 వేల కోట్ల రూపాయలను సాధించాల్సిన బాధ్యత వైసీపీపైన ఉంటుంది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు భూసేకరణ పూర్తికానందున 2013–14లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టం ప్రకారమే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు చంద్రబాబు గానీ, జగన్‌ గానీ బాధ్యులు కారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఈ నేపథ్యంలో సబ్జెక్టుపై కనీస అవగాహన లేని మంత్రులతో ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును తిట్టిస్తే సమస్య పరిష్కారమవుతుందా? పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని కేంద్రప్రభుత్వమే పార్లమెంట్‌ సాక్షిగా ప్రకటించింది. ఒకవేళ నిజంగా అవినీతికి పాల్పడి ఉంటే చంద్రబాబును శిక్షించండి. ఎవరూ అడ్డురారు. పట్టిసీమలో వందల కోట్ల అవినీతి జరిగిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ఆరోపణలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఆ ఊసే ఎత్తకపోవడానికి కారణం ఏమిటి? ‘ఇంటిగుట్టు లంకకు చేటు’ అన్నట్టుగా పోలవరం ప్రాజెక్టు వ్యయం అమాంతం ఎందుకు పెరిగిందని ప్రశ్నించడం వల్ల రాష్ర్టానికి పరోక్షంగా ద్రోహం చేసినట్టే అవుతుంది. మొత్తం రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించిన ఈ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నోరు మెదపకపోవడానికి కారణం ఏమిటి? రాజ్యసభలో ప్రభుత్వానికి సంబంధించిన కీలక బిల్లులు ఆమోదం పొందాలంటే జగన్‌రెడ్డి మద్దతు అవసరం. ఈ అవసరాన్ని అడ్డుపెట్టుకుని ప్రాజెక్టు అంచనా వ్యయం 55 వేల కోట్ల రూపాయలను మంజూరు చేయాల్సిందేనని జగన్‌రెడ్డి కేంద్రాన్ని నిలదీయవచ్చు గదా? అలా చేయలేకపోతున్నారంటే అవినీతి కేసులకు సంబంధించి జగన్‌రెడ్డి భయపడుతున్నట్టేనని భావించాల్సి ఉంటుంది. తనపై కేసులున్నా లెక్క చేయకుండా న్యాయవ్యవస్థనే ఢీకొంటున్న జగన్‌ కేంద్రంలోని పెద్దలను నిలదీయలేరా? అలా జరగడం లేదంటే కేంద్రప్రభుత్వ పెద్దలకు భయపడుతున్నట్టే కదా? అదే నిజమైతే ‘‘నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించలేను, రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతోనే ఫలానా గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తాను’’ అని అయినా జగన్‌ హామీ ఇవ్వాలి. అవసరమైతే ప్రాజెక్టు నిర్వహణ కేంద్రానికే అప్పగిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చావు కబురు చల్లగా చెప్పారు. సహాయ పునరావాస ప్యాకేజీ ఎవరు భరించాలన్నది తేలకుండా ఈ దశలో కేంద్రానికి అప్పగిస్తే మాత్రం సమస్య పరిష్కారం అవుతుందా? నిర్వాసితుల సమస్యలను తేల్చకుండా ప్రాజెక్టు ఎత్తు తగ్గించి నిర్మించి చేతులు దులుపుకుంటారా? అదే జరిగితే అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ ప్రజలకు తీరని ద్రోహం చేసినట్టే అవుతుంది. ప్రాజెక్టు ప్రధాన డ్యామ్‌ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. డ్యామ్‌ నిర్మాణం జరగనిదే జల విద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించలేరు. ఇప్పుడు వేసిన మట్టికట్టపై ఆధారపడి నీటిని నిల్వ చేస్తే ఉభయ గోదావరి జిల్లాలకు పెను ముప్పు పొంచి ఉంటుంది. ఈ లెక్కలన్నీ తేలాల్సిందే! 2022 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించగలరా? ఆ పని చేయకుండా మంత్రులతో రాజకీయ విమర్శలు చేయిస్తే సమస్య పరిష్కారమవుతుందా? ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వాస్తవాలను వివరించి కేంద్రంపై ఒత్తిడికి కార్యాచరణ ప్రకటించాలి. 30 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్న వ్యక్తి కీలక అంశాలలో మౌనంగా ఉంటే కుదరదు. రాజధానిని గందరగోళంలో పడేసిన వ్యక్తి, ఇప్పుడు పోలవరాన్ని కూడా మూలకు నెడితే ప్రజలు ఎంతోకాలం మౌనంగా ఉండరు. చట్టంలో స్పష్టంగా పేర్కొన్న పోలవరాన్ని కూడా సాధించుకోలేకపోతే మనవాళ్లు సన్నాసులని కేంద్రంలోని పెద్దలే కాదు.. ఇతర రాష్ర్టాల ప్రజలు కూడా భావిస్తారు.


సామూహికంగా సిగ్గు పడదాం!

ఇప్పుడు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆందోళన చేస్తున్న రైతులను అరెస్ట్‌ చేసి చేతులకు సంకెళ్లు వేసిన వ్యవహారానికి వద్దాం. న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యమించే రైతుల చేతులకు బేడీలు వేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా, ఏపీ పోలీసులు ఈ క్రూరత్వానికి పాల్పడ్డారు. రైతులకు సంకెళ్లు వేయడంపై హోంమంత్రి సుచరిత కూడా ‘‘పోలీసుల అత్యుత్సాహం’’ అని వ్యాఖ్యానించక తప్పలేదు. దళిత రైతులపై కూడా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు పెట్టడం హైలైట్‌. ఈ అరెస్టులు, సంకెళ్లకు కారణమైన ఫిర్యాదు చేసిన వ్యక్తి, తన ఫిర్యాదును ఉపసంహరించుకుంటానని స్పష్టంచేసినా స్థానిక డీఎస్పీ అంగీకరించకపోవడం ఎందుకో తెలియదు. ఆంధ్రప్రదేశ్‌లో మిగతా ప్రభుత్వ శాఖలు పని చేస్తున్నాయో లేదో తెలియదు గానీ, పోలీస్‌ శాఖ మాత్రం ప్రభుత్వాధినేత సేవలో తరించిపోతోంది. ప్రభువులను సంతృప్తి పరచడానికై అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తోంది. పోలీస్‌ అంటే మహోత్కృష్టమైన సర్వీస్‌. ప్రజల కోసం పోలీసులు ప్రాణాలు పోగొట్టుకుంటారు. అలా ఎంతో మంది విధి నిర్వహణలో అసువులు బాసి అమరులయ్యారు. అలాంటి పోలీస్‌ శాఖలో ఉన్నత స్థాయిలో ఉన్న కొంతమంది నీతిమాలిన అధికారుల చర్యల వల్ల మొత్తం పోలీస్‌ శాఖకే తలవంపులు వస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ర్టాలలో కూడా పోలీసులు విధి నిర్వహణలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం విస్తృతంగా ఉంది. ఈ కారణంగానే ప్రతిపక్షాలకు చెందిన కొంతమంది పరిధి దాటి మరీ పోలీసులను విమర్శిస్తున్నారు. దీనిపై పోలీస్‌ అధికారుల సంఘాల నాయకులు స్పందించి ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎండనకా, వాననకా డ్యూటీనే ఫస్ట్‌ అని భావించే పోలీసులను దూషించడం సమర్థనీయం కాదు. ఏ విపత్తు సంభవించినా ఆదుకోవడంలో పోలీసులే ముందుంటారు. అలాంటి పోలీసులపై సమాజంలో చులకన భావన ఎందుకు ఏర్పడుతున్నదో పోలీసు అధికారులు, సంఘాల నాయకులు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. పోలీస్‌ శాఖ ఉన్నది ప్రజల కోసమే గానీ, అధికార పార్టీ కోసం కాదు. సన్మాన సత్కారాలు అందుకున్న రైతుల చేతులకు సంకెళ్లు వేసే పరిస్థితులు నెలకొన్నందుకు సామూహికంగా సిగ్గుపడదాం. ఇందుకు మొత్తం పోలీసు శాఖ క్షమాపణలు చెప్పాలి!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2020-11-01T06:32:22+05:30 IST