మైనారిటీలకు వంచన

Published: Fri, 24 Jun 2022 02:44:31 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మైనారిటీలకు వంచన

‘దుల్హన్‌’లో రూ.లక్ష హామీ హుళక్కి

హైకోర్టు సాక్షిగా బయటికొచ్చిన నిజం

నాడు ఇచ్చిన 50 వేలకూ ఎగనామం

ముస్లింల పథకానికి అసలుకే ఎసరు

పెళ్లిఖర్చు కుటుంబంపై పడరాదని

చంద్రబాబు అమలుచేసిన పథకం

రెట్టింపు సాయం చేస్తానన్న జగన్‌

విపక్ష నేతగా ముస్లింలకు వరాలు

తీర్చాల్సివచ్చేసరికి డబ్బులు లేవట!

మదింపు పేరిట ‘విదేశీవిద్య’ ఆపివేత

అందరికీ ఇచ్చినవే ముస్లింలకూ

ముస్లిం బడ్జెట్‌లో కలిపి మాయ


‘‘ముస్లిం అక్కలకు, చెల్లెళ్లకు ఇంకో భరోసా ఇస్తున్నాను. మీరు పిల్లలకు పెళ్లిళ్లు చేయండి. ఆడపిల్లలకు దుల్హన్‌ పథకానికి రూ.50 వేలు ఏదైతే వస్తుందో... దానిని లక్ష రూపాయలు చేస్తాం.  వైఎస్సార్‌ దుల్హన్‌ అని పేరుపెట్టి అమలుచేస్తాం’’ 


‘‘చంద్రబాబు అప్పుడే ఫ్రెష్‌గా స్నానం చేసి దిగిన ఫొటోతో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. ఎన్నికల ముందు మేనిఫెస్టో విడుదల చేస్తే దాని అర్థం ఏమిటి? ఎన్నికలప్పుడు ప్రకటించి.. ఆ తర్వాత చెత్తకుండీలో వేసేదానికి అసలు మేనిఫెస్టో ఎందుకు? మేనిఫెస్టోలో చంద్రబాబు ఒక్కో కులానికి ఒక పేజీ కేటాయించారు. ముస్లిం సోదరులకు రెండు పేజీలు కేటాయించారు. ఈ పెద్ద మనిషి తాను కేటాయించిన దాంట్లో ప్రధానమైన విషయాలు ఏవైనా అమలు చేశారా లేదా? అది మీ మనస్సాక్షినే అడగండి’’ 

- ఎన్నికలకు ముందు వైజాగ్‌లో ముస్లింలతో జరిపిన భేటీలో విపక్ష నేత హోదాలో జగన్‌ వ్యాఖ్యలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ముస్లింలను చంద్రబాబు మోసం చేశారంటూ ఎన్నికల ముందు జగన్‌ చేసిన విమర్శలు ఇప్పుడు ఆయనకే రివర్స్‌ కొడుతున్నాయి. నిధుల్లేక దుల్హన్‌ పథకం నిలిపివేశామని హైకోర్టుకు వైసీపీ ప్రభుత్వం చెప్పడాన్ని జనం నిలదీస్తున్నారు. ‘నిన్నటివరకు  చెప్పిందేమిటి? ఇప్పుడు చేస్తుందేమిటి? బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీత అని చెప్పుకొన్న ఎన్నికల మేనిఫెస్టోకే దిక్కులేదా?’’ అని ఆగ్రహిస్తున్నారు. నిజానికి, ప్రతిపక్షంలో ఉండగా.. ముస్లిం పథకాలపై అప్పటి సీఎం చంద్రబాబుపై జగన్‌ చెలరేగిపోయారు. వైజాగ్‌లో ముస్లింలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటుచేసి చంద్రబాబు 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తీవ్రంగా విమర్శించారు. పేజీలపేజీల మేనిఫెస్టోలు రూపొందించడమేగానీ వాటిఅమలు పట్టించుకోలేదని టీడీపీ సర్కార్‌ను తెగనాడారు. ఇఫ్తార్‌ విందుల్లో పాల్గొనడం... ముస్లిమ్‌లతో మమేకమైనట్లు నటించడం చేస్తూ.. వారికి సంక్షేమ, అభివృద్ధి పథకాలకు దూరం చేశారని చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు ఇచ్చిన ఇస్లాం బ్యాంక్‌ హామీ ఏమైందని నిలదీశారు. అంతేకాదు తమ ప్రభుత్వమొస్తే ముస్లిమ్‌లకు కలిగించే లబ్ధిని ఏకరువు పెట్టారు. పైగా తన తండ్రి ముస్లింలకు కల్పించిన పథకాలను గుర్తుచేసి ముస్లిం ఓటును రాబట్టారు. కానీ, ఎన్నికల్లో గెలిచిన తర్వాత అన్నింటినీ నవరత్నాల్లో చూసుకోవాలంటూ మైనారిటీలకు చెందాల్సిన పలు పథకాలకు స్వస్తి పలికారు. ఇప్పుడు ఏకంగా ‘దుల్హన్‌’కు డబ్బుల్లేవని తేల్చేశారు. 


ముస్లిం వర్గాలకు చంద్రబాబు ప్రభుత్వం అందించిన దుల్హన్‌ పథకం ఎంతో ప్రయోజనం కలిగించేది. పెళ్లి ఖర్చు మొత్తంగా కుటుంబంపైనే పడకుండా తీసుకువచ్చిన పథకమిది. ఈ పథకం కోసం  దరఖాస్తు చేసుకున్న పెళ్లీడు ఆడపిల్లకు రూ.50 వేల ఆర్థిక సాయం అందేది.


చంద్రబాబు ప్రభుత్వం చంద్రన్న పెళ్లికానుక పేరుతో అన్ని సామాజివర్గాలకు సంబంధించిన పెళ్లికానుకలు, కులాంతర వివాహాల పారితోషికంతో కలిపి సమగ్ర పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే కొత్తగా వచ్చిన జగన్‌ ప్రభుత్వం అన్ని పెళ్లికానుక పథకాలకు స్వస్తి పలికింది. కులాంతర వివాహాలు చేసుకుంటున్న వర్గాలకు ఇస్తున్న పారితోషికం కూడా ఇవ్వకుండా నిలిపేసింది. ఏకంగా కోర్టుకు అఫిడవిట్‌ ఇవ్వడంతో ఇక దుల్హన్‌ పథకానికి శాశ్వతంగా స్వస్తి పలికినట్లయింది. ఎన్నికలకు ముందు పాదయాత్రలో 43 లక్షల మంది మైనారిటీలకు ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నో ఆశలు పెట్టారని, అధికారంలోకి రాగానే అన్నీ మరిచిపోయారని దుల్హన్‌ పథకం బాధితులు వాపోతున్నారు. ప్రతి బడ్జెట్‌లో చేసిన అంకెలగారడీతో అన్యాయం అయిపోయింది ఎక్కువగా తామేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


రద్దు పద్దులో మరెన్నో...

నిధుల్లేక దుల్హన్‌ పథకం అమలు చేయడం లేదని వైసీపీ ప్రభుత్వం తొలిసారి బయటపడింది. కానీ, ఇలా చెప్పకుండా రద్దు పద్దులో కలిసిపోయిన మైనారిటీ పథకాలెన్నో ఉన్నాయి. ముస్లిం, క్రిస్టియన్‌ మైనారిటీ వర్గాల్లో ఎక్కువ మంది పేదరికంలో మగ్గుతున్నారు. ముఖ్యంగా ముస్లిమ్‌ల్లో ఎక్కువ మంది పట్టణాల్లో, మండల కేంద్రాల్లో వెల్డింగ్‌షాపులు, మెకానికల్‌ షాపులు, పాత ఇనప సామానులు,  చిన్న చిన్న స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటుచేసుకుని జీవనం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే సాయం ఇలాంటి వర్గాలకు అందితే వారి జీవనప్రమాణాలు మెరుగుపడతాయి. ఈ ఆలోచనతో చంద్రబాబు హయాంలో  వీరికోసం ఎన్నో స్వయం ఉపాధి పథకాలు అమలయ్యాయి. ఎయిర్‌కండిషన్‌, ఫ్రిజ్‌, ఆటోమొబైల్‌ రంగంలోనూ, డ్రైవర్‌ కమ్‌ మెకానిక్‌, వెబ్‌డిజైనింగ్‌, బుక్‌ పబ్లిషింగ్‌, బ్యాంకింగ్‌, అకౌంట్స్‌, మెడికల్‌ ల్యాబ్‌, సోలార్‌ టెక్నీషియన్‌.. ఇలా పలు రకాల కోర్సుల్లో శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పించారు.


బ్యాంకు లింకేజీ ద్వారా ఒక్కో యూనిట్‌కు రూ.మూడు లక్షలు రుణమిప్పించి అందులో సబ్సిడీగా ప్రభుత్వం రూ.ఒక లక్ష ఇచ్చేది. అంతకు ముందు వయోపరిమితి 21-45 ఏళ్లు ఉండగా..దానిని చంద్రబాబు ప్రభుత్వం 21-55 ఏళ్లకు పెంచారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఏటా 10 వేల మంది ముస్లిం, క్రిస్టియన్‌ యువత  ఆయా ఫైనాన్స్‌ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటుచేసుకున్నారు. దుకాన్‌, మకాన్‌ పథకాల కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏటా వెయ్యి మంది ముస్లిం యువతకు నివాసం, దుకాణం రెండూ.. నిర్మించుకునేందుకు ఆర్థికసాయం అందింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా స్వయం ఉపాధి యూనిట్లు అందిస్తామని దరఖాస్తులు తీసుకున్నారు. కానీ, ఇంటర్వ్యూలు అర్ధంతరంగా నిలిపేశారు. నవరత్నాలు ఇస్తున్నందున మళ్లీ స్వయం ఉపాధి యూనిట్లు ఎందుకని ప్రభుత్వ పెద్దలు సెలవిచ్చారు. అక్కడితో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. 


రంజాన్‌తోఫా సఫా...

టీడీపీ ప్రభుత్వం ముస్లింలకు రంజాన్‌ పండగ రోజున రంజాన్‌ తోఫా  అందించేది. పండగ రోజు ముస్లిం కుటుంబాలు పేద, ధనిక తేడాల్లేకుండా సంతోషంగా గడపాలనే తలంపుతో తెచ్చిన పథకం ఇది. తోఫాగా ప్రతి ఇంటికీ సరుకులను ఉచితంగా పంపిణీ చేసేవారు. ఏటా దాదాపు 10 లక్షల కుటుంబాలు రంజాన్‌తోఫాను అందుకునేవారు. జగన్‌ ప్రభుత్వం వచ్చి...  తోఫాను సఫా చేసిందని ముస్లిం వర్గాలు వాపోతున్నాయి.  


ఆగిన మసీదు, చర్చిల నిర్మాణాలు..

చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చర్చిలు, మసీదులకు భారీగా నిధులు కేటాయించింది. రాష్ట్రంలో 3,500 ముస్లిం ప్రార్థనా సంస్థలున్నాయి. 316 దర్గాలు, 1,365 మసీదులు, 43 సమాధి భూములు, 1548 అషూర్‌ఖానాలు, 66 ఈద్గాలు, 164 ముస్లిం ప్రార్థనా మందిరాలున్నాయి. వీటన్నింటికి మరమ్మతులు, ఇతర భవనాల నిర్మాణాల కోసం నిధులు అప్పట్లో భారీగానే ఖర్చు చేశారు. ఒక్కో జిల్లాకు రూ.2.50 కోట్లు మసీదుల మరమ్మతుల కోసం మంజూరుచేశారు. జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత షాదీఖానాలకు మాత్రం రూ.10 కోట్లు కేటాయించి చేతులు దులుపుకొంది. ఇక.. మిగతా నిర్మాణాలు ఎలా పూర్తి చేయాలో అధికారులకు అర్థం కావడం లేదు. 


ఇస్లాం బ్యాంక్‌ ఎక్కడ?

2014 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోలో ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి.. ఆ తర్వాత మరిచారని 2019 ఎన్నికల ముందు జగన్‌ పాదయాత్ర సందర్భంగా ప్రతి ఊళ్లో విమర్శలు గుప్పించారు. ఈ వర్గాలను టీడీపీకి దూరం చేసేందుకు ముస్లింలకు ఉన్న సెంటిమెంట్‌ను వినియోగించుకున్నారు. సాధారణంగా ముస్లిం వర్గాలు వడ్డీకు రుణం తీసుకుని వ్యాపారం చేసేందుకు ఇష్టపడరు. ఇస్లామిక్‌ బ్యాంక్‌ అంటే వడ్డీ లేకుండా రుణాలివ్వడం! అలాంటి బ్యాంకును ఏర్పాటు చేస్తామని చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయలేదంటూ కోడిగుడ్డు మీద ఈకలు లాగినట్లు ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఆ బ్యాంకును ఏర్పా టు చేస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే లేదు. ఉన్న స్వయం ఉపాధి పథకాలకూ  స్వస్తి చెప్పారు. ఎన్నికల్లో ఓట్లు కోసం చంద్రబాబుపై నిందలు వేయడమే కాకుండా అబద్ధాలు ప్రచారం చేసిన జగన్‌... ఇప్పుడు మైనారిటీలకు ఏం సమాధానం చెబుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు తన హయాంలో మేనిఫెస్టోను అమలు చేయలేదన్న జగన్‌... పాత పథకాలను ఎందుకు రద్దు చేశారో చెప్పగలరా.. అంటూ ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. రూ. వేలకోట్లు అప్పులు తెస్తున్న జగన్‌కు  పేద మైనారిటీ పథకాలను అమలుచేసే ఔదార్యం కరువైందా.. అని ఆగ్రహిస్తున్నారు.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.