మార్కెట్లోకి హ్యుండయ్‌ అల్కాజర్‌

ABN , First Publish Date - 2021-06-19T05:31:42+05:30 IST

హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా.. మార్కెట్లోకి సరికొత్త ఎస్‌యూవీ అల్కాజర్‌ విడుదల చేసింది. 6,7 సీటర్లతో కూడిన ఈ ఎస్‌యూవీ ధరలు రూ.16.3 లక్షల నుంచి రూ.19.99 లక్షల

మార్కెట్లోకి హ్యుండయ్‌ అల్కాజర్‌

ధర రూ.16.3 లక్షలు-రూ.19.99 లక్షలు

10 రోజుల్లో 4 వేలకు పైగా బుకింగ్స్‌


న్యూఢిల్లీ: హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా.. మార్కెట్లోకి సరికొత్త ఎస్‌యూవీ అల్కాజర్‌ విడుదల చేసింది. 6,7 సీటర్లతో కూడిన ఈ ఎస్‌యూవీ ధరలు రూ.16.3 లక్షల నుంచి రూ.19.99 లక్షల (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌) మధ్యన ఉన్నాయి. అల్కాజర్‌తో శరవేగంగా వృద్ధి చెందుతున్న ఎస్‌యూవీ విభాగంలో గట్టు పట్టును సాధించవచ్చని కంపెనీ భావిస్తోంది. భారత మార్కెట్లోకి హ్యుండయ్‌ ప్రవేశించి పాతికేళ్లు పూర్తి చేసుకున్న సమయంలో కొత్త ఎస్‌యూవీ అల్కాజర్‌తో మరో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా ఎండీ, సీఈఓ ఎస్‌ఎస్‌ కిమ్‌ తెలిపారు. అల్కాజర్‌ అభివృద్ధి కోసం రూ.650 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఆయన చెప్పారు. కంపెనీ ఎస్‌యూవీ పోర్టుఫోలియోలో ఇప్పటికే వెన్యూ, క్రెటా, టక్సన్‌, కోనా ఎలక్ట్రిక్‌ ఉన్నాయి. 


హ్యుండయ్‌ 6,7 సీటర్‌ అల్కాజర్‌.. మహీంద్రా ఎక్స్‌యూవీ500, టాటా సఫారీ, ఎంజీ హెక్టర్‌ ప్లస్‌కు గట్టి పోటీనిస్తుందని ఆటోమొబైల్‌ నిపుణులు భావిస్తున్నారు. హ్యుండయ్‌ మోటార్‌.. అల్కాజర్‌ను 2 లీటర్‌ పెట్రోల్‌, 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజన్‌ ఆప్షన్లతో తీసుకువచ్చింది. పెట్రోల్‌  వేరియంట్‌ ధరలు రూ.16.3 లక్షల నుంచి రూ.19.84 లక్షల మధ్యన ఉండగా, డీజిల్‌ వేరియంట్‌ ధరలు రూ.16.53 లక్షల నుంచి రూ.19.99 లక్షల మధ్యన ఉన్నాయి.


లీటర్‌కు 14.5 కిలోమీటర్ల మైలేజీ: పెట్రోల్‌ వేరియంట్‌ ప్రతి లీటర్‌కు 14.5 కిలోమీటర్లు, ఆటోమేటిక్‌ వేరియంట్‌ 14.2 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని హ్యుండయ్‌ పేర్కొంది. కాగా డీజిల్‌ వేరియంట్‌ ప్రతి లీటర్‌కు 20.4 కిలోమీటర్లు, ఆటోమేటిక్‌ వేరియంట్‌ 18.1 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని తెలిపింది. గడిచిన కొన్నేళ్లుగా భారత్‌లో ఎస్‌యూవీ విభాగం గణనీయంగా వృద్ధి చెందుతోందని, ప్రస్తుతం ఈ విభాగంలో హ్యుండయ్‌ మార్కెట్‌ వాటా ఈ ఏడాది జనవరి-మే మధ్య కాలంలో  23.3 శాతంగా ఉందని కిమ్‌ వెల్లడించారు. కంపెనీ మొత్తం ప్యాసింజర్‌ కార్ల విక్రయాల్లో ఎస్‌యూవీ వాటా 42.5 శాతంగా ఉందని, అల్కాజర్‌ విడుదలతో ఇది 50 శాతానికి చేరుకుంటుందని కిమ్‌ తెలిపారు. కాగా కేవలం పది రోజుల్లోనే అల్కాజర్‌కు 4,000కు పైగా బుకింగ్స్‌ వచ్చాయని, ఇందులో 55 శాతం మంది కస్టమర్లు డీజిల్‌ వేరియంట్‌ను ఎంపిక చేసుకున్నారని హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా డైరెక్టర్‌ తరుణ్‌ గార్గ్‌ వెల్లడించారు. 

Updated Date - 2021-06-19T05:31:42+05:30 IST