కష్టపడే వారికి ఎప్పుడూ తోడుంటాను

ABN , First Publish Date - 2022-06-27T05:41:33+05:30 IST

కష్టపడే విద్యార్థులకు తాను ఎప్పుడూ తోడుగా ఉంటానని మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. ఆత్మవిశ్వాసంతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. సిద్దిపేట బీసీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ శిక్షణ పొందుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ అందజేసి మాట్లాడారు. గ్రూప్‌-1కి 200 మంది, కానిస్టేబుల్‌కి 100 మంది శిక్షణ పొందుతున్నారని తెలిపారు. సిద్దిపేట బీసీ స్టడీ సర్కిల్లో చదువుకొని 318 మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని మంత్రి తెలియజేశారు.

కష్టపడే వారికి ఎప్పుడూ తోడుంటాను
శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ అందజేస్తున్న మంత్రి హరీశ్‌రావు

ఆత్మవిశ్వాసంతో చదివి లక్ష్యాన్ని చేరాలి

కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్‌లపై ఒత్తిడి తెస్తున్నాం

ఉద్యోగాలు రాని వారు నిరాశ చెందొద్దు

ప్రైవేటు రంగంలో స్థిరపడేందుకు సహకారమందిస్తా

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు

ఉద్యోగ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ


సిద్దిపేట క్రైం, జూన్‌ 26 : కష్టపడే విద్యార్థులకు తాను ఎప్పుడూ తోడుగా ఉంటానని మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. ఆత్మవిశ్వాసంతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. సిద్దిపేట బీసీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ శిక్షణ పొందుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ అందజేసి మాట్లాడారు. గ్రూప్‌-1కి 200 మంది, కానిస్టేబుల్‌కి 100 మంది శిక్షణ పొందుతున్నారని తెలిపారు. సిద్దిపేట బీసీ స్టడీ సర్కిల్లో చదువుకొని 318 మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని మంత్రి తెలియజేశారు. అదేవిధంగా ప్రస్తుతం కష్టపడుతున్న అభ్యర్థులందరూ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని ఆశిస్తున్నానన్నారు. అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని, ఓటమితో ఎక్కడ ఆగిపోకుండా ముందుకు సాగితేనే విజయం సాధ్యమవుతుందని తన వ్యక్తిగత అనుభవంతో చెప్తున్నానన్నారు. ప్రభుత్వం స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు పెంచి 91,000 ఉద్యోగాలు తెలంగాణ యువతకు పొందేలాగా నోటిఫికేషన్‌ జారీ చేశామన్నారు. గ్లోబలైజేషన్‌లో ప్రపంచం చిన్నగా మారిపోయింది ప్రభుత్వ ఉద్యోగాలు రాని వారు నిరుత్సాహపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని మంత్రి సూచించారు. దాని కోసం కార్పొరేట్‌ ఉద్యోగాలకు వెళ్లే వారి కోసం సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఆసక్తి ఉన్న వారికి కోచింగ్‌ ఇప్పిస్తానని వెల్లడించారు. విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు కోసం ఉచితంగా ఓవర్సీస్‌ శిక్షణ ఇప్పించి వీసా ప్రాసెస్‌ చేసి పంపిస్తామని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు నోటిఫికేషన్‌లు వేయాలని ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. త్వరలోనే బీసీ స్టడీ సర్కిల్‌ శాశ్వత భవనాన్ని నిర్మించుకుందామని హామీ ఇచ్చారు. సిద్దిపేట విద్యాక్షేత్రంగా విరాజిల్లుతున్నది అని, బావి తరాలకు భవిత ఇవ్వాలనే ఉద్దేశంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు. నాలుగేళ్ల నుంచి సిద్దిపేట ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు క్లోజ్‌ అని బోర్డు కనిపిస్తుందని చెప్పారు.  ఒకప్పుడు 142 మంది ఉన్న సిద్దిపేట ఇందిరానగర్‌ హైస్కూల్‌లో నేడు పన్నెండు వందల మంది విద్యార్థులు చదువుతున్నరని మంత్రి తెలియజేశారు. ప్రైవేట్‌ పాఠశాలలను తలదన్నేలా ప్రభుత్వ బడుల్లో బోధన కొనసాగుతుందని, అది తెలంగాణ ప్రభుత్వం పని తిరుకు నిదర్శనమన్నారు. 


మీరు ఉద్యోగాలు సాధించడమే మాకు బహుమతి

ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం సొంతమవుతుందని, మీరు ఉద్యోగాలు సాధించడమే తమకు బహుమానం అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో పోలీస్‌ శిక్షణ అభ్యర్థులకు ఆదివారం ఆయన ఉచిత మెటీరియల్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ 60 రోజుల శిక్షణ పూర్తయిందంటే మీరు మొదటి మెట్టు ఎక్కినట్టే అని, ఒక బలమైన సంకల్పం ఏర్పడిందన్నారు. కొంత మంది ఉద్యోగాలు సాధించినా, మిగతా వారు ఎవరూ నిరాశ చెందవద్దని సూచించారు. జీవితంలో స్థిరపడే వరకు వదలిపెట్టమన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా, ప్రైవేటు కానీ, ఇతర ఉద్యోగాలు సాధించేందుకు అన్ని సహకారాలు తాము అందిస్తామని మంత్రి భరోసా కల్పించారు. ఎవరైతే తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడాలనుకుంటారో అదే పట్టుదల ఉన్నవారికి తాము అన్ని విధాల సహకరిస్తామని తెలిపారు. ఆత్మవిశ్వాసంతో గురి చూసి కొడితే ఆకాశానికి కూడా రంధ్రం పడుతుందని, పట్టుదలతో చదవాలని సూచించారు. కొండపాకకు చెందిన అఖిల్‌ ఇంటివద్దనే చదివి సివిల్స్‌ సాధించాడని, అతన్ని మీరందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తాత్కాలిక ఆనందాలకు కొద్ది రోజులు దూరంగా ఉంటే శాశ్వతంగా సంతోషంగా ఉండే ఫలితాలు వస్తాయని మంత్రి హితబోధ చేశారు. ప్రిలిమినరీ తర్వాత ఫిజికల్‌ టెస్ట్‌తో పాటు ఫైనల్స్‌కు కూడా శిక్షణ అందిస్తామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. అన్నీ అభ్యర్థుల చేతుల్లోనే ఉన్నాయని, అందుకోవడమే ఆలస్యమని అన్నారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు భోజనాలకు సహకరించిన వారందరికీ ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, సీపీ శ్వేత, శిక్షకుడు భాగ్యకిరణ్‌ పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-27T05:41:33+05:30 IST