నువ్వక్కడ.. నేనిక్కడ

ABN , First Publish Date - 2021-03-04T15:43:10+05:30 IST

పశ్చిమలో డివిజన్లలో ఓట్ల గందరగోళం అభ్యర్థులను, ఓటర్లను అయోమయంలోకి పడేసింది. శాస్ర్తీయంగా వీధుల్లోకి వచ్చి డోర్‌ నెంబర్ల..

నువ్వక్కడ.. నేనిక్కడ

కుటుంబంలో ఓట్లు చెల్లాచెదురు

44, 45 డివిజన్లలో ఓటర్లు, అభ్యర్థుల గగ్గోలు 


44వ డివిజన్‌లోని చెరువు సెంటర్‌కు చెందిన జింకా చక్రధర్‌, ప్రసూనాంబ భార్యాభర్తలు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఒకేచోట ఓటేశారు. ఈసారి ఓటర్‌ స్లిప్పుల పంపిణీలో ప్రసునాంబకు 44లో ఓటు ఉండగా, చక్రధర్‌కు 45వ డివిజన్‌లోని పోలింగ్‌ బూత్‌లోకి ఓటు మారింది.  


ఇదే డివిజన్‌లోని ఎరుకల బజార్‌లో 1-3/4-171 డోర్‌ నెంబర్‌లో  కుమార్‌, శిరీష దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి ఓట్లు 38వ డివిజన్‌లోని పోలింగ్‌ బూత్‌లోకి మారాయి. 


44వ డివిజన్‌లోని పాశం శివ వీధిలో పాలబూత్‌ నిర్వహించుకునే ఒక కుటుంబం ఓట్లు 39వ డివిజన్‌లోకి మారాయి. వీరి పరిస్థితే కాదు ఇటువంటివి ఈ డివిజన్లలో వందల్లో ఉన్నాయని ఓటర్లు, అభ్యర్థులు వాపోతున్నారు. 


భవానీపురం: పశ్చిమలో డివిజన్లలో ఓట్ల గందరగోళం అభ్యర్థులను, ఓటర్లను అయోమయంలోకి పడేసింది. శాస్ర్తీయంగా వీధుల్లోకి వచ్చి డోర్‌ నెంబర్ల వారీగా ఓటర్లను విభజించాల్సిన అధికారులు కార్పొరేషన్‌ కార్యాలయంలో కూర్చొని ఇష్టారాజ్యంగా చేసేశారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నారు. వార్డు వలంటీర్ల వ్యవస్థపై గొప్పలకు పోతున్న ప్రభుత్వం వారి ద్వారానైనా ఓటర్ల జాబితాలు సక్రమంగా నివాసం ఉండే డివిజన్లకు సరిదిద్దే ప్రక్రియకు  అధికారులు శ్రీకారం చుట్టలేదు. నిర్ధేశిత డివిజన్‌ బౌండరీ ప్రకారం డోర్‌ నంబర్లు వారీగా ఓటర్లను స్థానిక పోలింగ్‌ బూత్‌ల పరిధిలో వచ్చేలా తయారు చేయాల్సి ఉంది.  అలా కాకుండా జాబితాలను తయారు చేయడంతో 30 ఏళ్లుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న పెద్ద వయస్కులు విస్తుపోతున్నారు. లేబర్‌ కాలనీలోని కంచుపిళ్ల వెంకట రమణమూర్తి కుటుంబంలోని 15 మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఎన్నికల సిబ్బందిని అడిగితే తమకు తెలిదంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎవరి ఓటు వేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. 44వ డివిజన్‌లోని 1400 ఓట్లు 45వ డివిజన్‌లో కలిసిపోయు ఉండటంతో మంత్రి వెలంపల్లి సైతం 44,45 డివిజన్ల అభ్యర్థులు రత్నకుమారి, బట్టిపాటి సంధ్యారాణిలతో 44వ డివిజన్‌ పరిధిలోని చెరువు సెంటర్‌, లేబర్‌ కాలనీల్లో ప్రచారం చేయించారు. డోర్‌ నెంబర్‌లో ‘బై,డాష్‌’ల తేడాతో డివిజన్ల మార్చేశారు. నాలుగు స్తంభాల సెంటర్‌ , ఎరుకల బజార్‌లోని చాలా కుటుంబాల ఓట్లు 38, 39 డివిజన్లలో కలపడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అంతా జరిగిపోయాక కూడా కార్పొరేషన్‌ సిబ్బంది ఓటర్ల స్లిప్పుల పంపిణీ చేస్తుంటంతో అడ్రస్‌లు దొరక్క తలలు బాదుకుంటున్నారు. ఒక్కో వలంటీర్‌, ఇతర సిబ్బందికి 200 స్లిప్లుల పంపిణీ బాధ్యత అప్పగించారు. ఒక్క రోజులో పూర్తవ్వాల్సినవి మూడు రోజులు పడుతుండటంతో వారు తలలు పట్టుకుంటున్నారు. 

Updated Date - 2021-03-04T15:43:10+05:30 IST