రోహిత్‌శర్మ ఫామ్‌పై అందోళన లేదు: ముంబై కోచ్ జయవర్ధనే

ABN , First Publish Date - 2022-04-15T01:08:59+05:30 IST

ఐపీఎల్‌ ట్రోఫీని ఐదుసార్లు ఎగరేసుకుపోయిన ముంబై ఇండియన్స్ ఈసారి ఖాతా తెరిచేందుకు

రోహిత్‌శర్మ ఫామ్‌పై అందోళన లేదు: ముంబై కోచ్ జయవర్ధనే

ముంబై: ఐపీఎల్‌ ట్రోఫీని ఐదుసార్లు ఎగరేసుకుపోయిన ముంబై ఇండియన్స్ ఈసారి ఖాతా తెరిచేందుకు కూడా నానా కష్టాలు పడుతోంది. ఇప్పటికే ఆడిన ఐదు మ్యాచుల్లోనూ ఓటమి పాలై తీవ్ర పరాభవభారంలో చిక్కుకుంది. ఇక, కెప్టెన్ రోహిత్ శర్మ అయితే దారుణంగా విఫలమవుతున్నాడు. ఐదు మ్యాచుల్లో 21.60 సగటుతో 108 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రోహిత్ శర్మ ఫామ్‌పై ఆందోళన నెలకొంది. దీనిపై ఆ జట్టు కోచ్ మహేల జయవర్ధనే మాట్లాడుతూ.. రోహిత్ ఫామ్‌పై ఆందోళన అవసరం లేదన్నాడు. సమయం వస్తే చెలరేగిపోతాడని అన్నాడు. బ్యాట్‌తో అతడు కొంత నిరాశకు గురిచేస్తున్న మాట వాస్తవమే అయినా సమయం వస్తే చెలరేగుతాడని అన్నాడు. 


రోహిత్ 14-15 ఓవర్ల వరకు ఉండి పెద్ద స్కోర్లు చేయడం మనం చూశామన్నాడు. అతడో క్వాలిటీ ఆటగాడని, అతడి ఫామ్ గురించి తాను ఆందోళన చెందడం లేదని స్పష్టం చేశాడు. బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 28 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరుగురు బ్యాటర్లతో బరిలోకి దిగామని, మ్యాచ్‌ను ముగించేందుకు సూర్యను మించిన గొప్ప బ్యాటర్‌లేడని ప్రశంసించాడు. పవర్ ప్లేలో రెండు వికెట్లు కోల్పోవడంతో స్వింగ్‌తో బౌలర్లు అతడిని ఇబ్బంది పెడతారని భావించే అతడిని నాలుగో స్థానంలో పంపలేదన్నాడు. ఇది పూర్తిగా వ్యూహాత్మక విషయమన్నాడు. పరిస్థితులను అనుకూలంగా మార్చేందుకు పొలార్డ్, సూర్యకు కొంత స్వేచ్ఛ ఇచ్చినట్టు చెప్పాడు. జోప్రా అర్చర్ జట్టులో లేకపోవడం బౌలింగ్ యూనిట్‌కు పెద్ద దెబ్బగా మారిందని జయవర్ధనే చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-04-15T01:08:59+05:30 IST