నాకోసం రాసుకున్న సంపుటికి అవార్డు రావడం గర్వకారణం

ABN , First Publish Date - 2022-05-16T07:04:44+05:30 IST

కవులు, రచయితలకు అనంతపురం జిల్లా నిలయమని ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్‌ యార్లగడ్డ రాఘవేంద్ర రావు పేర్కొన్నా రు.

నాకోసం రాసుకున్న సంపుటికి అవార్డు రావడం గర్వకారణం
విశ్లేషణ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న రాధేయ, రాచపాళెం, యార్లగడ్డ రాఘవేంద్రరావు తదితరులు

ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాలప్రిన్సిపాల్‌ యార్లగడ్డ రాఘవేంద్రరావు

ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డుల ప్రదానం

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, మే15 : కవులు, రచయితలకు అనంతపురం జిల్లా నిలయమని ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్‌ యార్లగడ్డ రాఘవేంద్ర రావు పేర్కొన్నా రు. కరువు కాటకాలకు ఆలవాలమైన అనంత పురం జిల్లాలో ఎంతో మంది సాహితీపరులు ఉండటం ఈ ప్రాంతం చేసుకున్న అదృష్టమన్నారు. ఆదివారం ఎన్జీఓ హోంలో ఉమ్మడిశెట్టి ట్రస్టు ఆధ్వర్యంలో 34వ ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అవార్డు నిర్వాహకులు డాక్టర్‌ రాధేయ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్‌ రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్‌ యార్లగడ్డ రాఘవేంద్రరావు రచించిన పచ్చికడుపు వాసన కవితా సంపుటికిగానూ అవార్డును అందజేసి సత్కరించారు. అదేవిధంగా ఎం.పార్వతి సాహితీ పురస్కారాలను ఒడిశా రాష్ట్రం బరంపురానికి చెందిన తుర్లపాటి రాజేశ్వరి, గుంటూరు జిల్లాకు చెందిన వసుధారాణిలకు అందజేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ రాఘవేంద్రరావు మాట్లాడుతూ సమాజంలో కవులు, రచయితలను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. వారు రాసే రచనలు సమాజహితం కోసం ఉంటాయన్నారు. అలాంటి రచయితలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. నా కోసం రాసుకున్న ఓ సాహిత్యం అవార్డు తెచ్చిపెడుతుందని అనుకోలేదన్నారు. ఒక కవికి మరో కవి అవార్డులు ప్రదానం చేయడమంటే... నూతన కవులకు ప్రోత్సాహమిచ్చినట్లేన న్నారు. కవులు, రచయితలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో డాక్టర్‌ రాధేయ తన సొంత ఖర్చులతో ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డులు ప్రదానం చేయడం ఎంతో సంతోషకరమన్నారు. ఈ అవార్డును అందుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కాగా డాక్టర్‌ రాధేయ రచించిన ’విశ్లేషణ’  పుస్తకాన్ని ఈ సందర్భంగా యార్లగడ్డ రాఘవేంద్రరావుతో పాటు అతిథులు ఆవిష్కరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ.. యార్లగడ్డ రాఘవేంద్రరావు  రచనల్లో  నిగూఢ అర్థాలు దాగి ఉంటా యన్నారు. ఆయన రచనల్లో భావుకత ఉట్టిపడుతుంద న్నారు. సీనియర్‌ కవి, అధ్యాపకుడు తూముచెర్ల రాజారాం మాట్లాడుతూ యార్లగడ్డ రాఘవేంద్రరావు రచనల్లో కొత్తపదాలు ఉట్టిపడతాయన్నారు. ఆయన రచనల్లో మట్టి, మహిళలు, రైతులకు అధిక ప్రాధాన్యమిస్తారన్నారు. పచ్చికడుపు వాసనలో మాతృభావన కళ్లకు కనిపించేలా ఉందన్నారు. ఇలాంటి రచనలు చాలా అరుదుగా ఉంటా యని అభివర్ణించారు. ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాధేయ మాట్లాడుతూ... గత 34 సంవత్సరాలుగా రెండు తెలుగు రాషా్ట్రల్లో సాహితీ రంగంలో సేవలందించిన వారికి తాము అవార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. యార్లగడ్డ రాఘవేంద్రరావుకు ఈ ఏడాది అవార్డు అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీనియర్‌ కవయిత్రి, విమర్శకురాలు తుర్లపాటి రాజేశ్వరి మాట్లాడుతూ... ఉమ్మడి తెలుగు రాషా్ట్రల్లో కవులు, రచయితలకు కొరత లేదన్నారు.  యార్లగడ్డ రాఘవేంద్ర రావు రచించిన పచ్చికడుపు వాసన నేటి సమాజానికి చాలా దగ్గరగా ఉంటుందన్నారు. ఆయనలోని భావకవిత్వం కట్టిపడేస్తుందని అభిప్రాయపడ్డారు. అనంతరం పలువురు కవులు, రచయితలకు సన్మానం చేసి మొమెంటోలను అందజేశారు. కార్యక్రమంలో కవులు, రచయితలు డా. పతికి రమేష్‌ నారాయణ, ఏలూరు యంగన్న, టీవీ రెడ్డి, డా. నానీల నాగేంద్ర, డా. అంకె శ్రీనివాసులు, మధురశ్రీ, కుంచె లక్ష్మీనారాయణ, తరిమెల అమర్నాథ్‌రెడ్డి, తన్నీరు నాగేంద్ర, డా. ప్రగతి, వై. నరసిరెడ్డి, శివకుమార్‌, పెళ్లూరు సునీల్‌, జెట్టి జయరాం తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-05-16T07:04:44+05:30 IST