అభివృద్ధి జరగక.. రాజీనామా చేస్తున్నా

ABN , First Publish Date - 2022-08-13T07:14:48+05:30 IST

‘నా సెగ్మెంట్‌లో అభివృద్ధి పను లు జరగడంలేదు. ప్రజలు నన్ను నిందిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ తీవ్ర మనస్తాపంతో పదవికి రాజీనామా చేస్తున్నా’నని శుక్రవారం మధ్యాహ్నం వైసీపీ ఎంపీటీసీ నాగమ్మ విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

అభివృద్ధి జరగక.. రాజీనామా చేస్తున్నా
సాయంత్రం.. మీడియాతో మాట్లాడుతున్న నాగమ్మ

వైసీపీ ఎంపీటీసీ ప్రకటన 

 నేతల ఒత్తిడితో సాయంత్రానికి రాజీనామా ఉపసంహరణ 


చిత్తూరు సిటీ, ఆగస్టు 12: ‘నా సెగ్మెంట్‌లో అభివృద్ధి పను లు జరగడంలేదు. ప్రజలు నన్ను నిందిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ తీవ్ర మనస్తాపంతో పదవికి రాజీనామా చేస్తున్నా’నని శుక్రవారం మధ్యాహ్నం వైసీపీ ఎంపీటీసీ నాగమ్మ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. సాయంత్రానికంతా నేతల ఒత్తిడితో రాజీనామా వెనక్కి తీసుకున్నారు. తవణంపల్లె మండలం దిగువమాఘం ఎంపీటీసీ పి.నాగమ్మ శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 40 ఏళ్లుగా టీడీపీకి కంచుకోటగా ఉన్న తన సెగ్మెంట్‌లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ప్రజలు తనను గెలిపించారన్నారు. ఏడాదైనా ఒక అభివృద్ధి పని కూడా జరగకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని సీఎం జగన్మోహన్‌రెడ్డి ఒకరే పరిపాలిస్తూ.. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకపోవడంతో స్థానికంగా విలువలేకుండా పోయిందన్నారు. సంక్షేమం పేరిట అప్పుల భారం పెంచుతున్నారన్నారు. అర్హులకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తే రెవిన్యూ కుంటుపడేది కాదన్నారు. ఏదో ఒక సాకుతో అమ్మఒడి లబ్ధిదారులను తగ్గించడం సబబుకాదన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో చాలా వ్యాధులకు చోటు కల్పించకపోవడం తప్పన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు మంజూరు చేయకపోవడం, దళితులను చిన్నచూపు చూడటమేనని చెప్పారు. ఇలా ప్రతి పథకంలోనూ ప్రజలకు అన్యాయం జరుగతోందన్నారు. అర్థం పర్థం లేని పన్నులతో ప్రజలను వేధించడం చూసి మనస్తాపం చెందుతున్నానని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తనపై విశ్వాసముంచి గెలిపించిన ప్రజలకు ఏమీ చేయలేక ప్రభుత్వ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ తన ఎంపీటీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు నాగమ్మ చెప్పారు.

కట్‌ చేస్తే..: సాయంత్రం 7 గంటలకు వైసీపీ నేతలతో సదరు ఎంపీటీసీ నాగమ్మ, తన కుమారుడితో కలిసి ప్రెస్‌క్లబ్‌కు వచ్చారు. కొంతమంది ఒత్తిడి చేయడంతో రాజీనామా చేశానని.. ఇప్పడు దానిని ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై తమకు నమ్మకముందని, ఎంపీటీసీగా కొనసాగుతానని చెప్పడం కొసమెరుపు.

Updated Date - 2022-08-13T07:14:48+05:30 IST