నేనే కాంగ్రెస్‌.. కాంగ్రెస్సే నేను

ABN , First Publish Date - 2022-08-08T09:04:13+05:30 IST

భట్టి విక్రమార్క కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పనున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి ఆయనే స్వయంగా బ్రేకులేశారు.

నేనే కాంగ్రెస్‌.. కాంగ్రెస్సే నేను

పార్టీని వీడుతున్నాననేది అసత్య ప్రచారం

మునుగోడులో మాదే విజయం: భట్టి 

ఖమ్మం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): భట్టి విక్రమార్క కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పనున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి ఆయనే స్వయంగా బ్రేకులేశారు. ‘నేనే కాంగ్రెస్‌.. కాంగ్రెస్సే నేను’ అని చెప్పి పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నానంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. అంతేకాక, కాంగ్రె్‌సకు కంచుకోట అయిన మునుగోడులో జరిగే ఉప ఎన్నికలో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో తమ పోటీ టీఆర్‌ఎ్‌సతోనేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు సోషల్‌ మీడియాలో కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని ఆరో పించారు. పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలందరితో మాట్లాడతానని, అంతర్గత సమస్యలు లేకుండా చేసి అంతా ఐక్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారంపై విలేకరులు ప్రశ్నించగా.. ఆ అంశాన్ని బహిరంగంగా చర్చించబోమన్నారు.


రాజగోపాల్‌రెడ్డితో అన్ని విధాలుగా చర్చలు జరిపినా, ఆయన పార్టీని వీడారని మరో ప్రశ్నకు బదులిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ కొత్తగా వచ్చి పరిగ ఏరుకునేందుకు ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. అంతేకాక, 75వ స్వాతంత్య్ర ఘట్టాన్ని పురస్కరించుకుని.. తామే దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చామనేంతగా బీజేపీ హడావుడి చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో బీజేపీ ప్రస్థానం ఎక్కడా లేదని చెప్పారు. దేశ అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్‌ బాటలు వేస్తే, బీజేపీ దానిని ధ్వంసం చేసిందన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థలకు విఘాతం కలిగిస్తూ దేశ వినాశనానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇందులో భాగంగానే పంచవర్ష ప్రణాళిక వంటి వ్యవస్థను నిర్వీర్యం చేసి నీతి ఆయోగ్‌ను తెరపైకి తెచ్చిందన్నారు. నీతీ ఆయోగ్‌ను తాము తొలినాళ్లలోనే వ్యతిరేకించామని గుర్తు చేశారు. కాగా,  ఏఐసీసీ పిలుపు మేరకు సోమవారం నుంచి ఈ నెల 15 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్వాతంత్య్ర సంగ్రామ స్ఫూర్తి పాదయాత్రలు నిర్వహిస్తున్నామని భట్టి తెలిపారు. ఈ యాత్రల ద్వారా స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర, స్ఫూర్తిని ప్రజలకు తెలియజేస్తామన్నారు.  


రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆజాదీ గౌరవ్‌ పాదయాత్రలు 

హైదరాబాద్‌: స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా.. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఆగస్టు 9 నుంచి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆజాదీ గౌరవ్‌ పాదయాత్రలు చేపడతామని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఈ అంశంపై డీసీసీ అధ్యక్షులతో ఆదివారం ఆయన జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని శాసనసభ నియోజకవర్గాలూ కలిసేవిధంగా యాత్రను నిర్వహించాలని సూచించారు. భట్టి విక్రమార్క మాట్లాడు తూ.. కాంగ్రెస్‌ పోరాటంతోనే దేశానికి స్వాతంత్య్రం లభించిందన్నారు.  కాగా, టీపీసీసీ సోషల్‌ జస్టిస్‌ టీమ్‌ పేరుతో ఎటువంటి కమిటీలు వేయలేదని, మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి వేసిన మండలాల బాఽధ్యుల నియామకానికి కాంగ్రెస్‌కు ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. 

Updated Date - 2022-08-08T09:04:13+05:30 IST