ఓటు వేసేందుకు ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థి

ABN , First Publish Date - 2022-03-07T22:09:35+05:30 IST

ఉక్రెయన్ నుంచి వచ్చిన ఒక విద్యార్థి మాత్రం ఓటు వేసేందుకు భారత్‌కు వచ్చానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ సోమవారం ఉంది. ఈ నేపథ్యంలో బాధ్యతాయుతమైన భారత పౌరురాలిగా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి..

ఓటు వేసేందుకు ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థి

లఖ్‌నవూ: రష్యా దండయాత్ర ప్రారంభం కాగానే.. ఉక్రెయిన్‌లో ఉన్న విదేశీయులు ప్రాణ భయంతో స్వదేశాలకు ప్రయాణం అయ్యారు. అయితే ఉక్రెయిన్ గగన తలాన్ని మూసివేయడం, రవాణా సౌకర్యాలు సరిగా అందుబాటులో లేకపోవడంలో అనేక మంది తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ప్రాణాలు దక్కితే చాలు అనుకుంటూ ఎన్నో కష్టాలకు ఓర్చి ఉక్రెయిన్ సరిహద్దు దాటుతున్నారు. ఉక్రెయిన్ నుంచి తిరిగి వస్తున్న వారిలో విద్యార్థులు ప్రముఖంగా ఉన్నారు. ఉక్రెయిన్‌కు చదువు కోసం వెళ్లిన 16,000 మంది భారత విద్యార్థుల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకువచ్చింది.


ఇదిలా ఉంటే.. ఉక్రెయన్ నుంచి వచ్చిన ఒక విద్యార్థి మాత్రం ఓటు వేసేందుకు భారత్‌కు వచ్చానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ సోమవారం ఉంది. ఈ నేపథ్యంలో బాధ్యతాయుతమైన భారత పౌరురాలిగా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి భారత్‌కు వచ్చానని స్పష్టం చేసింది. క్రితిక.. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థుల్లో ఒకరు. ఖార్కివ్ నగరంలో ఉంటున్న ఈమె.. అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొని పొలండ్‌కు చేరుకుని అక్కడ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో భారత్‌కు వచ్చింది.


ఇక తమ భవిష్యత్ గురించి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. చాలా మంది విద్యార్థులు ఉక్రెయిన్‌కు తిరిగి వెళ్లేది లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే క్రితిక మాత్రం.. ప్రధానమంత్రి ఇక్కడే తమకు చదువుకునే అవకాశం కల్పిస్తే ఇక్కడే ఉంటామని, లేదంటే తిరిగి ఉక్రెయిన్‌కు వెళ్లిపోతామని చెప్తోంది. ‘‘భారత రాయబార కార్యాలయం సహాయం తీసుకుని మాకు మేముగా ఖార్కీవ్ నుంచి ఉక్రెయన్ సరిహద్దు దాటి పొలండ్ చేరుకున్నాం’’ అని క్రితిక చెప్పింది.

Updated Date - 2022-03-07T22:09:35+05:30 IST