
ముంబై: మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ డ్రామా, సంక్షోభం నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)పై విరుచుకుపడ్డారు. ఆయనకు (షిండే) తాను ఎంతో చేశానని, అయినప్పటికీ ఇప్పుడు తనపైనే ఆరోపణలకు దిగుతున్నారని అన్నారు. ''ఏక్‌నాథ్ షిండే కోసం చాలా చేశాను. నా వద్ద ఉన్న శాఖను కూడా ఆయనకు ఇచ్చాను. ఆయన సొంత కొడుకు ఒక ఎంపీ. అయినప్పటికీ నా కుమారుడిపై కామెంట్లు చేస్తారు. నాపైన కూడా ఆరోపణలకు దిగుతున్నారు. వాళ్లకు ధైర్యం ఉండే బాలాసాహెబ్ పేరు, శివసేన పేరు చెప్పుకోకుండా ప్రజల వద్దకు వెళ్లాలి'' అని శుక్రవారంనాడు పార్టీ కార్యకర్తలతో వర్చువల్ మీట్‌లో థాకరే అన్నారు.
ఇవి కూడా చదవండి
గౌహతిలో బస చేసిన శివసేన ఎమ్మెల్యేలు పార్టీని చీల్చాలనుకుంటున్నారని థాకరే ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవిపై తనకు ఆశలేదని గతంలో కూడా తాను చెప్పానని, కానీ చావనైనా చస్తామే కానీ శివసేనను వదలిపెట్టమని చెప్పిన వారు మాత్రం ఇవాళ పారిపోయారని రెబల్ ఎమ్మెల్యేలను ఆక్షేపించారు. తాను కలలో కూడా సీఎం కావాలని అనుకోలేదని, వర్షా బంగ్లాను వదిలిపెట్టానే కానీ పోరాటాన్ని మాత్రం విడిచేది లేదని థాకరే స్పష్టం చేశారు.
శివాజీ మహరాజ్ ఓడిపోయినా, ప్రజలు వెన్నంటే ఉన్నారు...
గత ఏడాది వెన్నెముక సర్జరీ చేయించుకున్న విషయాన్ని థాకరే ప్రస్తావిస్తూ, తల, మెడ నొప్పి బాధిస్తోందని, పని సరిగా చేయలేకపోతున్నానని, కళ్లు తెరవడం కూడా కష్టంగానే ఉందని, అయితే వీటిని తాను లెక్కచేయనని చెప్పారు. శివాజీ మహరాజ్ ఓడిపోయినప్పటికీ ప్రజలు ఎప్పడూ ఆయనతోనే ఉన్నారని గుర్తు చేశారు.