Mass conversion : హిందూ దేవుళ్ళను నేను ప్రార్థించను : ఢిల్లీ మంత్రి

ABN , First Publish Date - 2022-10-07T21:33:44+05:30 IST

రాష్ట్ర మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) నేత

Mass conversion : హిందూ దేవుళ్ళను నేను ప్రార్థించను : ఢిల్లీ మంత్రి

న్యూఢిల్లీ : ఢిల్లీ రాష్ట్ర మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) నేత రాజేంద్ర పాల్ గౌతమ్ (Rajendra Pal Gautam) వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఇటీవల సామూహిక మతమార్పిడి కార్యక్రమానికి హాజరై, తాను హిందూ దేవీ, దేవతలను విశ్వసించనని, వారిని పూజించనని ప్రతిజ్ఞ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవడంతో బీజేపీ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 


ఢిల్లీలోని అంబేద్కర్ భవన్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో దాదాపు 10,000 మంది బౌద్ధ మతంలోకి మారారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రాజేంద్ర పాల్ గౌతమ్, మరికొందరు తాము హిందూ దేవీ, దేవతలను విశ్వసించబోమని, వారిని పూజించబోమని చెప్తున్నట్లు కనిపించింది. 


‘‘నాకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులపై నమ్మకం లేదు, నేను వారిని పూజించను. దేవుని అవతారాలుగా చెప్తున్న శ్రీరాముడు, శ్రీకృష్ణుడుల మీద నాకు విశ్వాసం లేదు, నేను వారిని పూజించను’’ అని వీరు చెప్తున్నట్లు కనిపించింది. 


రాజేంద్ర పాల్ గౌతమ్ కూడా ట్విటర్ వేదికగా ఓ సందేశాన్ని ఇచ్చారు. అశోక విజయ దశమినాడు ‘మిషన్ జై భీమ్’ క్రింద 10,000 మందికిపైగా మేధావులు కుల రహిత, అంటరానితనం లేని భారత దేశాన్ని రూపొందించేందుకు ప్రతిజ్ఞ చేశారని తెలిపారు. బుద్ధునివైపు ప్రయాణించాలని, జై భీమ్ పిలుస్తోందని పేర్కొన్నారు. 


బీజేపీ ఆగ్రహం

ఈ వీడియో వైరల్ అవడంతో బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదంతా భారత దేశాన్ని ముక్కలు చేసే కార్యక్రమమని ఆరోపించింది. బీజేపీ నేత అమిత్ మాలవీయ (Amit Malviya) ఇచ్చిన ట్వీట్‌లో, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలోని మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ భారత దేశాన్ని ముక్కలు చేసే ప్రాజెక్టును అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మాయలో పడొద్దు, ఈ హిందూ ద్వేష ప్రచారానికి ప్రధాన స్పాన్సర్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అని తెలిపారు. 


బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ (Manoj Tiwari)  విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, రాజేంద్ర పాల్ గౌతమ్ వ్యాఖ్యలు హిందూ, బౌద్ధ మతాలను అవమానపరచేవిధంగా ఉన్నాయన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులు అల్లర్లను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆయనను పార్టీ నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయనపై తాము ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 


ఈ నేపథ్యంలో రాజేంద్ర పాల్ గౌతమ్ స్పందిస్తూ, బీజేపీ దేశ వ్యతిరేక శక్తి అని ఆరోపించారు. తనకు బౌద్ధ మతంపై విశ్వాసం ఉందన్నారు. దీని గురించి ఎవరికైనా ఎందుకు ఇబ్బంది ఉండాలని ప్రశ్నించారు. ఫిర్యాదు చేస్తే చేయనివ్వండన్నారు. ఏ మతాన్నయినా అనుసరించేందుకు రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చిందని తెలిపారు. ఆప్‌ అంటే బీజేపీ భయపడుతోందన్నారు. వారు కేవలం బూటకపు కేసులను మాత్రమే పెట్టగలరన్నారు. 


Updated Date - 2022-10-07T21:33:44+05:30 IST