మమత బెనర్జీని ఒప్పించే శక్తి నాకు లేదు : అమిత్ షా

ABN , First Publish Date - 2022-06-26T02:53:13+05:30 IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ (TMC) అధినేత్రి మమత బెనర్జీ

మమత బెనర్జీని ఒప్పించే శక్తి నాకు లేదు : అమిత్ షా

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ (TMC) అధినేత్రి మమత బెనర్జీ (Mamata Banerjee)ని నమ్మించే శక్తి, సామర్థ్యాలు తనకు లేవని కేంద్ర హోం మంత్రి, బీజేపీ (BJP) నేత అమిత్ షా (Amit Shah) అన్నారు. 2002 గుజరాత్ అల్లర్ల (Gujarat Riots) కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పును స్వాగతించారు. ఓ వార్తా సంస్థకు శనివారం ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు చేసినవారు ఇప్పుడు క్షమాపణ చెప్పాలన్నారు. 


రక్షణ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా హింసాత్మక సంఘటనలు జరిగిన విషయాన్ని ప్రస్తావించినపుడు అమిత్ షా మాట్లాడుతూ, శాంతిభద్రతలను కాపాడటం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని చెప్పారు. అయితే అవసరమైనపుడు, రాష్ట్రాల దగ్గర తగిన వనరులు లేనపుడు కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం కోరవచ్చునని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే వెంటనే కేంద్ర ప్రభుత్వం దళాలను పంపిస్తుందని చెప్పారు. 


మమత బెనర్జీ వంటి ప్రతిపక్ష నేతలు కేంద్ర దళాలు కేవలం కేంద్రం మాట మాత్రమే వింటాయని ఆరోపిస్తున్న విషయాన్ని ప్రస్తావించినపుడు అమిత్ షా మాట్లాడుతూ, ‘‘మీరు కానీ, నేను కానీ మమత బెనర్జీని ఒప్పించలేం’’ అన్నారు. తమ రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేసే ప్రజాస్వామిక హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. 


Updated Date - 2022-06-26T02:53:13+05:30 IST