తెలియదు.. గుర్తులేదు

ABN , First Publish Date - 2022-05-21T09:21:03+05:30 IST

దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో..

తెలియదు.. గుర్తులేదు

విచారణలో ఉన్నతాధికారుల తడబాటు సమాధానాలు!

హైదరాబాద్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో.. సుప్రీంకోర్టు నియమించిన సిర్పుర్కర్‌ కమిషన్‌ చాలా క్షుణ్ణంగా అన్ని కోణాలను స్పృషిస్తూ విచారణ చేపట్టింది. గత ఏడాది అక్టోబరులో ఈ విచారణ కీలక దశకు చేరుకుంది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న కానిస్టేబుల్‌ స్థాయి అధికారి మొదలు.. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన అప్పటి సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌, ప్రస్తుత ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ దాకా నిందితుల కస్టడీ మొదలు.. ఎన్‌కౌంటర్‌కు దారి తీసిన పరిణామాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఓ దశలో ఉన్నతాధికారులు సమాధానాలు చెప్పడంలో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎక్కడ తమ మెడకు కేసు చుట్టుకుంటుందోననే ఆందోళనతో తడబాటు.. తతరపాటు.. పొంతనలేని సమాధానాలిచ్చారు. ‘‘ఏం తెలియదు. సంబంధం లేదు. సరిగ్గా గుర్తులేదు’’ అంటూ వాంగ్మూలమిచ్చారు. వారి తీరుపై అప్పట్లోనే కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా సుప్రీంకోర్టుకు కమిషన్‌ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో.. విచారణ సమయంలో పోలీసు అధికారులు ఇచ్చిన సమాధానాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..


సజ్జనార్‌పై 165 ప్రశ్నల వర్షం

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సజ్జనార్‌ను కమిషన్‌ గత ఏడాది అక్టోబరు 11, 12 తేదీల్లో విచారించింది. మొదటి రోజు సజ్జనార్‌పై 2 గంటల పాటు.. 45 ప్రశ్నలను సంధించగా.. రెండో రోజు నాలుగున్నర గంటల పాటు 120 ప్రశ్నలతో విచారణ జరిపింది. కమిషన్‌ ప్రశ్నలకు.. ‘‘దిశ హత్యాచార కేసు దర్యాప్తుతో నాకేం సంబంధం లేదు. ఆ కేసు విచారణను నేను పర్యవేక్షించలేదు. ఎప్పటికప్పుడు వివరాలు చెప్పాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. ప్రత్యేక బృందాలు సమాచారం ఇవ్వలేదు. దిశ హత్యచార కేసు విచారణను డీసీపీ శంషాబాద్‌ పర్యవేక్షించారు.


ప్రతి రోజూ ఉదయం టెలికాన్ఫరెన్స్‌లో కేసు స్టేట్‌సను మాత్రమే నాకు చెప్పారు’’ అంటూ వాంగ్మూలమిచ్చారు. దిశ కేసు నిందితులను అదుపులోకి తీసుకున్న సమచారాన్ని 2019 నవంబరు 29 సాయంత్రం 5.30 గంటలకు శంషాబాద్‌ డీసీపీ ఫోన్‌లో చెప్పారని సజ్జనార్‌ వివరించారు. ‘‘సాయంత్రం 5.30 గంటలకు నిందితులను పట్టుకుంటే.. అదే రోజు రాత్రి 7 గంటలకు శంషాబాద్‌ డీసీసీ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ ఎలా పెట్టారు? గంటన్నరలోనే కేసు సమాచారమంతా మీకు తెలిసిందా? ఆ ప్రెస్‌మీట్‌లో హత్యాచార ఘటన ఎలా జరిగిందో.. గ్రాఫిక్స్‌ వేసి మరి వివరించారు? గంటన్నరలోనే ఇదంతా ఎలా సాధ్యమైంది’’ అని కమిషన్‌ ప్రశ్నించింది. ‘‘శంషాబాద్‌ డీసీపీ ఫోన్‌లో సమాచారం ఇచ్చినప్పుడు నేను ఎయిర్‌ఫోర్ట్‌లో ఉన్నాను. అక్కడి నుంచి నేరుగా డీసీపీ కార్యాలయానికి వెళ్లాను. డీసీపీ సూచనమేరకే ప్రెస్‌మీట్‌ నిర్వహించా’’ అని సజ్జనార్‌ ఆ ప్రశ్నకు సమాధానమిచ్చారు. కోర్టుకు సమర్పించిన కేస్‌డైరీలో రాత్రి 10 గంటలకు నిందితుల వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు స్పష్టమవుతోందని, 7 గంటలకు ప్రెస్‌మీట్‌లో అన్ని అంశాలు ఎలా చెప్పగలిగారని ప్రశ్నించగా.. సజ్జనార్‌ ‘‘గుర్తు లేదు.


చెక్‌చేసి చెబుతా’’ అని పేర్కొన్నారు. మరో రెండుమూడు ప్రశ్నలకు ఇదే సమాధానం ఇచ్చారు. దీంతో.. కమిషన్‌ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఏపీ పోలీస్‌ మాడ్యుల్‌ను ఉటంకిస్తూ.. హత్యాచార కేసు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌కు ఏకే-47, ఎస్‌ఎల్‌ఆర్‌ లాంటి భారీ ఆయుధాలెందుకు తీసుకెళ్లారని ప్రశ్నించగా.. అది ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ విభాగం పని అని.. తనకు సంబంధం లేదని సజ్జనార్‌ సమాధానమిచ్చారు. ఆ విషయం శంషాబాద్‌ డీసీపీ పరిధిలోని అంశమని చెప్పారు. దాంతో.. కమిషన్‌ ‘‘మీరు స్వతంత్రంగా ఆలోచించరా? అన్ని ప్రశ్నలకు శంషాబాద్‌ డీసీపీ అని సమాధానం చెబుతున్నారు? ఇంతకు మీరేం చేస్తారు?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.


ప్రకాశ్‌రెడ్డిపై ఆగ్రహం!

అప్పటి శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డిపై కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘రెండేళ్లు అవుతోంది. దిశ హత్యాచారం, నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలేం గుర్తులేవు’’ అని ఆయన సమాధానం ఇవ్వడంతో.. కమిషన్‌ మండిపడింది. ‘‘కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారా?’’ అని తీవ్రస్థాయిలో ప్రశ్నించింది. దిశ హత్యాచార కేసులో నిందితుడు ఆరిఫ్‌ వాంగ్మూలాన్ని ప్రెస్‌మీట్‌లో ఎలా చెప్తారని ప్రశ్నించగా.. ఆ విషయం తనకు తెలియదని చెప్పారు. ఎన్‌కౌంటర్‌ ఘటనాస్థలాన్ని వీడియోగ్రఫీ ఎందుకు చేయలేదంటూ ఎన్‌కౌంటర్‌ కేసు దర్యాప్తు అధికారి జె.సురేందర్‌రెడ్డిని ప్రశ్నించగా.. ఆయన మౌనంగా ఉండిపోయారు. అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పకపోవడంతో.. కేసు దర్యాప్తులో ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తారా? అంటూ కమిషన్‌ అసహనం వ్యక్తం చేసింది. రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్న అంశాలకు, చెప్పే విషయాలకు సంబంధం లేదని షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌ను నిలదీయగా.. ఆ విషయం తనకు తెలియదని సమాధానమిచ్చారు. నిందితుల్లో ఒకరైన మహమ్మద్‌ ఆరిఫ్‌ ఆయుధాన్ని లాక్కొన్న తీరును వివరించాలని నర్సింహారెడ్డిని కమిషన్‌ ప్రశ్నించింది. ఆయన ఆయుధాన్ని పెట్టుకునే తీరు, దాన్ని లాక్‌ చేసే విధానం, ఆయుధాన్ని పౌచ్‌ నుంచి తీసే పద్ధతిని వివరించగా.. డెమో చూపించాలని కమిషన్‌ ఆదేశించింది. 

Updated Date - 2022-05-21T09:21:03+05:30 IST